Group-1 | హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 మెయిన్ పరీక్షల నిర్వహణలో మొదటి నుంచి అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఇందుకు టీజీపీఎస్సీ అవకాశం కల్పించిందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఆరోపించారు. అయినవాళ్లకు, కొందరికి లబ్ధి చేకూరేలా టీజీపీఎస్సీ వ్యవహరించిందని చెప్పారు. హాల్ టికెట్ల దశ నుంచి పరీక్షా కేంద్రాల ఖరారు, అభ్యర్థుల హాజరు సంఖ్యలో వ్యత్యాసం, మూడుసార్లు మూల్యాంకనం, మూల్యాంకనానికి ఎంపిక చేసిన ప్రొఫెసర్లు.. అన్నీ కూడా ఒక పథకం ప్రకారం జరిగిన అక్రమాలకు అద్దం లాంటి సాక్ష్యాలని అన్నారు. గ్రూప్- 1 పరీక్షలో అవకతకవలపై దాఖలైన వ్యాజ్యాలపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు మంగళవారం విచారణ కొనసాగించారు.
సీనియర్ న్యాయవాది సురేందర్‌రావు వాదనలు వినిపిస్తూ.. జనవరి 11 నుంచి 25 వరకు మూల్యాంకనం కోసం ప్రొఫెసర్లను కేటాయించాలని కోరుతూ కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనర్‌కు టీజీపీఎస్సీ లేఖ రాసిందని తెలిపారు. అయితే ఆ లేఖ రాయకముందే సదరు ప్రొఫెసర్లకు వ్యక్తిగతంగా సమాచారం వెళ్లిపోయిందని చెప్పారు. తెలుగులో పరీక్ష రాసిన పేపర్లను ఇంగ్లిషు ప్రొఫెసర్లు ఎలా మూల్యాంకనం చేశారో ఆ దేవుడికే తెలియాలని అన్నారు. మరో సీనియర్ న్యాయవాది రచనారెడ్డి వాదిస్తూ, ప్రిలిమ్స్‌కు, మెయిన్‌కు వేర్వేరు హాల్ టికెట్లను జారీ చేయడం టీజీపీఎస్సీ చరిత్రలో మాయనిమచ్చగా అభివర్ణించారు.
అవినీతికి ఇదే తొలి బీజమని చెప్పారు. మూల్యాంకనం తొలిసారి చేసిన వాళ్లకి, రెండో వ్యక్తి బండిల్ నంబర్‌తో ఇస్తారని, మూడో వ్యక్తికి ఇవ్వరని చెప్పారు. పకన కాలమ్‌లో మారులు వేస్తారని, ఇందుకు ప్రాతిపదిక మాత్రం ఉండదని అన్నారు. మూల్యాంకనం చేశారా లేదా అన్న విషయాన్ని గుర్తించడానికి వీల్లేదని తెలిపారు. అయితే, బండిల్ నంబర్లు, సీరియల్ నంబర్లు ఎవరివో వాళ్లకు తెలుసునని అన్నారు. వాదనలు బుధవారం కూడా కొనసాగనున్నాయి.