BC Reservations | బీసీ రిజర్వేషన్ల అంశంపై ఉత్కంఠ కొనసాగుతున్నది. తెలంగాణ హైకోర్టులో గురువారం రెండోరోజూ వాదనలు కొనసాగుతున్నాయి. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలు చేసిన జీవో9ని సవాల్ చేస్తూ బుట్టెంబారి మాధవరెడ్డి, సముద్రాల రమేశ్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. బుధవారం రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు ధర్మాసనం విచారించిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం సైతం వాదనలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. బీసీ కుల గణనపై అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందని హైకోర్టుకు ఏజీ తెలిపారు.
స్వాతంత్య్రం తర్వాత సమగ్ర కులగణన సర్వే తెలంగాణలోనే జరిగిందని, ఇంటింటికి సర్వే చేశారని.. ఈ సర్వేపై ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని చెప్పారు. బీసీ జనభా 57.6 శాతం ఉన్నారంటే ఎవరూ కాదనడం లేదని.. 57.6 శాతం జనాభా ఉన్నా 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఏజీ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుందని, రాజకీయ వెనుకబాటుతనం ఉందని అసెంబ్లీ గుర్తించి తీర్మానం చేసిందన్నారు. గ్రామీణ, పట్టణ సంస్థల్లో బీసీలకు 42 శాతం ఇవ్వాలని అసెంబ్లీ నిర్ణయం తీసుకుందని చెప్పారు. గడువు లోగా గవర్నర్ ఆమోదించకపోతే చట్టంగా భావించాల్సి ఉంటుందన్నారు. తమిళనాడు ప్రభుత్వం, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నోటిఫై చేయాల్సిన అవసరం లేదన్నారు. అసెంబ్లీ చేసిన చట్టానికి సూత్రప్రాయ ఆమోదం ఉందని.. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం చట్టానికి సూత్రప్రాయ ఆమోదం ఉందన్నారు.
ఇది రాష్ట్ర ప్రజల కోరిక అని.. దాన్ని అసెంబ్లీ ఆమోదించిందన్నారు. శాస్త్రీయ పద్ధతిలో కులగణన సర్వే జరిగిందని.. సర్వేలో అన్ని కులాల లెక్కలు తేలాయన్నారు. బీసీ సబ్ కేటగిరిల వారీగా వివరాలు సర్వేలో తేలాయన్నారు. సర్వేలో అగ్రవర్ణాల లెక్కలు బయటకు వచ్చాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడిందని కోర్టుకు చెప్పారు. కొందరు ఇది నోటిఫికేషన్ కాదంటున్నారని.. అది తప్పని ఏజీ చెప్పారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పత్రులను ఏజీ ధర్మాసనం ఎదుట ఉంచారు. నోటిఫికేషన్ వచ్చాక న్యాయస్థానాల జోక్యం ఉండదని.. నోటిఫికేషన్ వచ్చాక జోక్యం చేయొద్దని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. అలాగే, ప్రభుత్వం తరఫున న్యాయవాది రవి వర్మ వాదనలు కొనసాగించారు. రిజర్వేషన్లకు రాజ్యాంగం ఎలాంటి పరిమితి విధించలేదన్నారు. ఈ దశలో ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవద్దని ఏజీ కోర్టును కోరారు.