MLC Kavitha | జగిత్యాల: మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు దేశంలోని కీలక అంశాలపై మీ వైఖరి ఏమిటని గాంధీ కుటుంబాన్ని, కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సూటిగా ప్రశ్నించారు. దేశంలోని ముఖ్యమైన అంశాలపై ఏ వైఖరి లేని ఏకైక పార్టీ కాంగ్రెస్సేనని విమర్శించారు. కీలకమైన అంశాలపై మౌనం వహించడం తగదని కాంగ్రెస్ పార్టీకి సూచించారు. బుధవారం రోజున జగిత్యాలలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆమె పాల్గొని మాట్లాడారు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల కోసం రెండు రోజుల్లో మొత్తం గాంధీ పరివారం తెలంగాణకు వస్తుంది. నేను వాళ్లకు ఒకే ప్రశ్న అడుగుతున్నాను. తెలంగాణ డిక్లరేషన్ల పేరిట ఇస్తున్న హామీలను కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారా..? తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పనులను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కలలోనైనా ఊహించగలరా..? ముందు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పి తెలంగాణకు రావాలి అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సవాలు విసిరారు. మహిళ బిల్లుపై, రైతాంగ అంశాలపై కాంగ్రెస్ వైఖరి ఏమిటని నిలదీశారు.
వికలాంగులకు తెలంగాణలో నెలకు రూ. 4 వేల పెన్షన్ ఇస్తుంటే కర్నాటకలో రూ. 400, గుజరాత్లో రూ. 1250, రాజస్థాన్లో రూ. 750, చత్తీస్గఢ్లో రూ. 500, ఉత్తర ప్రదేశ్లో రూ. వెయ్యి, మహారాష్ట్రలో రూ. 300, మధ్య ప్రదేశ్లో రూ. 300, ఒడిశాలో రూ. 200 మాత్రమే ఇస్తున్నారని, తెలంగాణలో ఇస్తున్న దానికి రాష్ట్రం కూడా దరిదాపుల్లో లేదని అన్నారు. తమకు అధికారం ఇస్తే పెన్షన్ మొత్తాన్ని మరింత పెంచుతామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని, ఇది కన్నతల్లికి అన్నం పెట్టరు కానీ చిన్నమ్మకు బంగారు గాజులు ఇస్తామన్నట్లుగా ఉందని విమర్శించారు. కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మవద్దని కవిత కోరారు.