హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఉద్యోగాలను భర్తీ చేయకుండా చోద్యంచూస్తున్న కాంగ్రెస్ సర్కారు.. న్యాయంగా నిరుద్యోగులకు దక్కాల్సిన పోస్టులనూ వారికి అందకుండా చేస్తున్నది. ఇందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీజీ ఎస్పీడీసీఎల్లో) కట్టబెట్టిన అక్రమ ప్రమోషన్లే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. సంస్థ పరిధిలోని 70 వరకు సబ్ ఇంజినీర్లకు అసిస్టెంట్ ఇంజినీర్లు (ఏఈ)లుగా పదోన్నతులు కల్పించారు. ఈ పదోన్నతుల్లో డిస్కం హెచ్ఆర్ విభాగం నిబంధనలు తుంగలో తొక్కినట్టు నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. తమకు దక్కాల్సిన ఏఈ పోస్టులను కిందిస్థాయి ఉద్యోగులకు అక్రమంగా కట్టబెట్టి నిరుద్యోగులు నోట్లో మట్టిగొట్టారని మండిపడుతున్నారు. ఈ ప్రమోషన్లపై విద్యుత్తు ఇంజినీర్ల సంఘాలు సైతం అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. ఈ ప్రమోషన్ల ఫలితంగా నిరుద్యోగులకు నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.
విద్యుత్తు సంస్థల్లో ఏఈ పోస్టులే అత్యంత కీలకం. నిబంధనలకు అనుగుణంగా 90 శాతం ఖాళీలను డైరెక్టర్ రిక్రూట్మెంట్ (డీఆర్) కోటాలో భర్తీ చేయాలి. కేవలం 10 శాతం ఖాళీలను సబ్ ఇంజినీర్లకు పదోన్నతులతో భర్తీచేయాలి. ఈ లెక్కన 100 పోస్టులు ఖాళీగా ఉంటే 90 పోస్టులను డీఆర్ కోటాలో, 10 పోస్టులను సబ్ ఇంజినీర్లకు ప్రమోషన్లు ఇవ్వాలి. కానీ కొత్త రిక్రూట్మెంట్ లేకుండా.. నోటిఫికేషన్ను విడుదల చేయకుండా డిస్కం హెచ్ఆర్ విభాగం అధికారులు 70 మంది వరకు ప్రమోషన్లు ఇచ్చారు. వాస్తవానికి 700 మందిని కొత్తగా నియమిస్తే 70 మందికి ఉద్యోగోన్నతి కల్పించాలి. కానీ కొత్తగా ఎవరినీ రిక్రూట్మెంట్ చేపట్టకుండానే 70 మందికి ప్రమోషన్లు కల్పించారు. అంటే కొత్తగా భర్తీ చేయాల్సిన పోస్టులు తగ్గిపోతున్నాయి. ఇక కొత్త రిక్రూట్మెంట్కు అవకాశమే ఉండదు. ఉద్యోగ నియామకాల కోసం ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు నిరాశే మిగులుతుందని ఆందోళన వ్యక్తమవుతున్నది.
దక్షిణ డిస్కం అధికారులు చేపట్టిన ప్రమోషన్లపై ఇంజినీర్ల సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. మునుపెన్నడూ ట్రాన్స్కో, ఉత్తర డిస్కంలో జరగనేలేదని తేల్చి చెప్తున్నారు. ఒకేసారి 70 మంది సబ్ ఇంజినీర్లకు ఏఈలుగా ప్రమోషన్లు కల్పించిన వ్యవహారంలో పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారినట్టు మింట్ కంపౌండ్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతటితో ఆగకుండా మరో 70 పోస్టులను ఇదే రీతిన అక్రమంగా ప్రమోషన్లు కట్టబెట్టాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఇదే జరిగితే రాబోయే నాలుగైదేండ్ల వరకు కొత్తగా ఏఈ నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశమే కనిపించడం లేదు. పైగా అనుభవం లేని వారితో పనిచేయిస్తే భవిష్యత్తులో తీవ్ర నష్టం జరగనున్నదన్న వాదనలు ఉన్నాయి.
అక్రమ ప్రమోషన్లపై డిస్కం అధికారులు వింత సమాధానాలు ఇస్తున్నారు. ఇవన్నీ తాత్కాలిక ఉద్యోగోన్నతులేనని పేర్కొంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎలా ఇస్తారని ప్రశ్నిస్తే మాత్రం సమాధానం నీళ్లు నములుతున్నారు. ఈ అక్రమ ప్రమోషన్లపై కొందరు ఇంజినీర్ల సంఘాల నేతలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేశారు. అయినా డిస్కం అధికారులు ఖాతరు చేయడమే లేదు. ఈ అక్రమ వ్యవహారంపై డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ సెక్రటరీలను కలిసి ఫిర్యాదు చేసేందుకు ఇంజినీర్ల సంఘాలు సిద్ధమవుతున్నాయి.