NREGA | హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (NREGA) అమలులో కూలీలకు ఎదురవుతున్న సమస్యలు ఏండ్ల తరబడి పరిష్కారం కావడం లేదు. ప్రతియేటా గ్రామాల్లో నిర్వహించే సోషల్ ఆడిట్లో కూలీలు తమ సమస్యలను వెల్లడిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. వలసలను నివారించి, పేదలకు పనితోపాటు ఆర్థిక భరోసాను ఇచ్చే ఉపాధి పథకంలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించింది. గతంలోనూ ఇలాంటి నిర్లక్ష్య ధోరణి ఉన్నప్పటికీ కాంగ్రెస్ పాలనలో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ నిర్వహించే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) వెబ్సైట్లోని సోషల్ అడిట్ సోషల్ యాక్షన్ రిపోర్టు ఆధారంగా.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి కూలీలు 18,211 పేరాలు/ఫిర్యాదులు చేయగా, కేవలం 803 మాత్రమే పరిష్కరించారు. 2025-26లో ఇప్పటివరకు 6,356 పేరాలు రాగా, ఒక్కటి మాత్రమే పరిష్కరించారు. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో ఉపాధి పేరాలు పెరుగుతున్నా ఒక్కశాతం కూడా పరిష్కారానికి నోచుకోవడం లేదు.
ఉపాధి హామీ పథకం పనుల్లో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను నాలుగు విభాగాలుగా గ్రీవెన్సెస్ (ఫిర్యాదులు), ప్రొసెస్ వాయిలేషన్ (నిబంధనల ఉల్లంఘన), ఫైనాన్షియల్ డీవియేషన్ (పనుల కొలతల్లో తేడాలు), ఫైనాన్షియల్ మిస్అప్రోప్రియేషన్ (నిధుల దుర్వినియోగం)పై స్వీకరిస్తారు. ఈ నాలుగింటిపై వచ్చిన ఫిర్యాదులను పేరాలుగా పేరొంటారు. డీటీఆర్ వెబ్ రిపోర్ట్ ఆధారంగా రెండేండ్లలో 24,567 పేరాలు రాగా, 804 మాత్రమే (3.27 శాతం) పరిష్కరించడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. ఉపాధి హామీ చట్టం నిబంధనల ప్రకారం 7 నుంచి 15 రోజుల్లో పరిషరించాలి, కానీ, ఏండ్ల తరబడి పరిష్కరించడం లేదు. ఉపాధిహామీ సోషల్ ఆడిట్లో వెల్లడైన విషయాలతోపాటు కూలీలు చేసిన ఫిర్యాదులను పరిష్కరించడానికి రాష్ట్రంలో గతంలోనే అంబుడ్స్మన్ల వ్యవస్థను తెచ్చారు. ప్రస్తుతం 32 జిల్లాలో అంబుడ్స్మన్ ఉన్నారు. వీరి వేతనాల కోసం ప్రభుత్వం (32×45000 x 12=) రూ.1,72,80,000 ఖర్చు చేస్తున్నది. అయినా, కూలీల సమస్యల పరిషారం శూన్యంగా కనిపిస్తున్నది.