అందోల్, జనవరి 8: ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేయడాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్ నేతలపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నదని సంగారెడ్డి జిల్లా అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ విమర్శించారు. రైతుభరోసా రూ.15 వేలు చెల్లించాలని, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెట్టడం మానుకోవాలని, ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం జోగిపేటలో నోటికి నల్లగుడ్డలు కట్టుకుని శాంతి ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరారు. ఈ సందర్భంగా చంటి క్రాంతికిరణ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.