హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ) : సిగాచి పరిశ్రమలో ప్రమాదం నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యుత్తు ప్లాంట్లు భద్రమేనా? అన్న అనుమానాలొస్తున్నాయి. రాష్ట్రంలో టీజీ జెన్కో ఆధ్వర్యంలో మొత్తం 11 థర్మల్‌ప్లాంట్లు, 65 హైడల్ (యూనిట్లు) ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం 9 థర్మల్, 56 హైడల్ యూనిట్లు పనిచేస్తున్నాయి. ఇవన్నీ భద్రమేనా? అన్న చర్చ నడస్తున్నది. శ్రీశైలం పవర్‌ప్లాంట్‌లో 2020లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తొమ్మిది మంది చనిపోయారు. కొంతకాలం క్రితం భద్రాద్రి పవర్‌ప్లాంట్‌లో జనరేటర్ కాలిపోయింది. యాదాద్రి పవర్ ప్లాంట్‌లోనూ చిన్నపాటి ప్రమాదం జరిగి కార్మికులు గాయపడ్డారు.
థర్మల్ విద్యుత్తు ప్లాంట్లల్లో బాయిలర్లు ఉంటాయి. ఒక్కో ప్లాంట్‌లో వెయ్యి నుంచి 1,200 మంది వరకు కార్మికులు, ఉద్యోగులు పనిచేస్తుంటారు. బాయిలర్లలో 1,400 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. ప్లాంట్లలో యూనిట్ కంట్రోల్‌బోర్డు ఉంటుంది. ప్లాంట్ నిర్వహణలో ఇదే కీలకం. ఏవైనా లోపాలు తలెత్తితే ఇది ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది. అలారమ్ మోగిస్తుంది. అప్పటికప్పుడు వాటిని సవరించాలి. లేదంటే పెనుముప్పు తప్పదు. ఇక బాయిలర్లకు సేఫ్టీవాల్ (ప్రెజర్ రిలీఫ్ వాల్) ఉంటుంది. స్ట్రీమ్ (ఆవిరి) నిర్వహణ, ఉష్ణోగ్రతల హెచ్చతగ్గులను సేఫ్టీవాల్ నియంత్రిస్తుంది. సేఫ్టీవాల్ పనిచేయకపోతే జరిగే ప్రమాదాన్ని ఊహించలేం.
థర్మల్ప్లాంట్లల్లో స్ట్రీమ్ లీకేజీ (ఆవిరి లీకేజీ) ప్రధాన సమస్యగా మారింది. ఒక దగ్గర లీకేజీని అరికట్టగానే మరోచోట సమస్య తలెత్తుతున్నది. ఈ లీకేజీలతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనన్న అనుమానం అధికారులను పట్టిపీడిస్తున్నది. మణుగూరులోని భద్రాద్రి థర్మల్ప్లాంట్లలో లీకేజీలు తలెత్తుతున్నాయి. యాదాద్రి థర్మల్ప్లాంట్లోనూ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ విషయంలో బీహెచ్ఈఎల్ అధికారులు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, సమస్యలున్నా పట్టించుకోవడంలేదని కార్మికులు, ఇంజినీర్లు ఆరోపిస్తున్నారు. మే మాసంలో కాకతీయ పవర్‌ప్లాంట్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఆ తర్వాత సవరించారు. ప్రస్తుతం సవ్యంగానే నడుస్తున్నది. విద్యుత్తుకు డిమాండ్ తగ్గిన నేపథ్యంలో ప్రస్తుతం థర్మల్ప్లాంట్లను ఉదయం పూట బ్యాక్‌డౌన్ చేసి, రాత్రిపూటే నడుపుతున్నారు. జూరాల సహా ఇతర హైడల్ ప్లాంట్లలో పగటిపూట విద్యుత్తును ఉత్పత్తిచేస్తున్నారు.