Secretariat | హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర సచివాలయంలో వాస్తు మార్పులు చేయిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఆరు నెలలైనా పాలన ఇప్పటికీ గాడిన పడకపోవడం, నిత్యం వివాదాలు, ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు వంటి పరిణామాల నేపథ్యంలో అనేక మార్పులు చేయిస్తున్నట్టు సమాచారం.
ముఖ్యంగా ముఖ్యమంత్రి కేంద్రంగా పలు మార్పులు చేయిస్తున్నట్టు తెలిసింది. ఇన్నాళ్లూ సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయంలోకి వెళ్లేందుకు తూర్పువైపు ఉన్న ప్రధాన ద్వారాన్ని వినియోగించారు. వాస్తు మార్పుల్లో భాగంగా ఇకపై పశ్చిమం వైపు ఉన్న గేటు ద్వారా లోపలికి వస్తారని, ఈశా న్యం వైపు ఉన్న గేటు ద్వారా బయటికి వెళ్తారని చెప్తున్నారు.
ఈ రెండు గేట్లను సీఎం కోసం మాత్రమే వినియోగిస్తారని తెలిసింది. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఇతర ఉన్నతాధికారులు ఆగ్నేయం వైపు ఉన్న గేటు ద్వారా లోనికి వెళ్లాలని ఆదేశాలు జారీ అయినట్టు చర్చించుకుంటున్నారు. రేవంత్‌రెడ్డికి ఇష్టమైన నంబర్ 9 అని, సచివాలయంలోని 9వ అంతస్థులోకి సీఎం కార్యాలయాన్ని మార్చాలని నిర్ణయించినట్టు గతంలో ప్రచారం జరిగింది. ఈ మేరకు ఇప్పటికే పనులు జరుగుతున్నట్టు సమాచారం. అవి పూర్తి కాగానే సీఎంవో మొత్తం 9వ అంతస్థులోకి చేరుతుందని చెప్పుకుంటున్నారు.
వీటితోపాటు సచివాలయం లోపల మరికొన్ని మార్పులు చోటు చేసుకోబోతున్నాయని సమాచారం. సీఎం కార్యాలయం మార్పు అనంతరం, మంత్రుల చాంబర్లలో కూడా వాస్తు మార్పులు చేయించాలని భావిస్తున్నారట. ఇప్పటికే కొందరు మంత్రులు మార్పులు కావాలని కోరుతున్నట్టు చర్చ జరుగుతున్నది. మొత్తంగా రేవంత్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరుగుతున్న మొదటి వాస్తు మార్పులు ఇవే కావడం గమనార్హం.
ఇప్పుడు గప్‌చుప్?
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వాస్తు మార్పులు చేయిస్తే, మూఢనమ్మకాల సీఎం అంటూ దుష్ప్రచారం చేశారని బీఆర్ఎస్ నేతలు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి వాస్తు మార్పులు చేయిస్తున్నా, వారెందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాస్తుమార్పులను విమర్శించిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మళ్లీ వాస్తు మార్పులు చేయించడం గమనార్హం.