హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ హయాంలో వేగంగా కొనసాగిన ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియ కాంగ్రెస్ రాకతో చతికలపడింది. గతంలో ఏడాదిన్నర కాలంలో 6 ప్రాజెక్టు డీపీఆర్‌లను సీడబ్ల్యూసీ ఆమోదించడంతోపాటు టీఏసీని కూడా మంజూరు చేసింది. కాంగ్రెస్ ఏడాది పాలనలోనే మూ డు డీపీఆర్‌లను సీడబ్ల్యూసీ తిప్పి పంపింది. దీంతో ఇప్పుడు సమ్మక్కసాగర్, సీతారామ ప్రాజెక్టులకు సం బంధించిన డీపీఆర్ ఆమోదంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయి నుంచి ఉన్నతస్థాయి వర కు అధికారుల నిర్లక్ష్యం, పట్టింపులేని తనం వల్లే డీపీఆర్‌లను తిరస్కరిస్తున్నట్టు తెలుస్తున్నది. సీడబ్ల్యూసీ సై తం ఇదే విషయాన్ని నొక్కి చెప్తున్నది.
సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు సాధించడమనేది ఎన్నో వ్యయప్రయాసలకు సంబంధించిన అంశం. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) పరిధిలో మొత్తంగా 18 డైరెక్టర్టరీల నుంచి ఆమోదం పొందాల్సి ఉండగా అందులో హైడ్రాలజీ, అంతరాష్ట్ర నదీ జల విభాగం, సెంట్రల్ వాటర్ కమిషన్, ఇరిగేషన్ ప్లానింగ్, కాస్ట్ అండ్ ఎస్టిమేషన్, భూగర్భజల శాఖ, టెక్నికల్ అప్రైజల్ కమిటీ తదితర ఆరు రకాల అనుమతులను కచ్చితంగా పొందాల్సిందే. అవికాకుండా పర్యావరణ మంత్రిత్వశాఖ, అటవీశాఖ, కాలుష్య నియంత్రణ మండలి తదితర విభాగాల నుంచి కూడా అనుమతులను పొందాల్సి ఉంటుంది. దీని కోసం ఏండ్లు గడిచిపోతాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టుల పరిస్థితి ఇలాగే ఉండేది.
తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ చరిత్రను తిరగరాసింది. ప్రాజెక్టులకు అనుమతులు సాధించడంలో ప్రత్యేకత చాటుకున్నది. కృష్ణా, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం 2021 గెజిట్ జారీచేసింది. అందులో భాగంగా అనుమతిలేని ప్రాజెక్టులన్నింటికీ తెలంగాణ, ఏపీ రాష్ర్టాలు ఆరు నెలల్లోగా అనుమతులు పొందాల్సి ఉంది. లేదంటే ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టుల నిర్వహణతో పాటు, ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టుల పనులను కూడా నిలిపేయాల్సిందేనని కేంద్రం షరతులు విధించింది.
దీంతో బీఆర్ఎస్ సర్కారు గెజిట్‌లో పేర్కొన్న 11 ప్రాజెక్టులకు గాను మొత్తంగా సమ్మక్కసాగర్, సీతారామ, చౌటుపల్లి హన్మంతరెడ్డి, గూడెం, చనాకా కొరాట, మోడికుంట, చిన్నకాళేశ్వరం, వార్ధా బరాజ్ ప్రాజెక్టుల డీపీఆర్‌లను సీడబ్ల్యూసీకి సమర్పించింది. మిగిలిన నాలుగింటిలో కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు టీఎంసీ, కందకుర్తి లిఫ్ట్, రామప్ప-పాకాల లింక్, కంతనపల్లి ప్రాజెక్టులకు అనుమతులే అక్కర్లేదని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా తెలియజేసింది. కేవలం ఏడాదిన్నరలోనే 5 ప్రాజెక్టులకు సీడబ్ల్యూసీ తుది అనుమతులను కేసీఆర్ సర్కారు సాధించింది. మిగిలిన మూడు డీపీఆర్‌లకు సైతం ఇప్పటికే కీలక అనుమతులు రాగా, తుది దశకు చేరుకున్నాయి.
అప్రైజల్ లిస్ట్ నుంచి డీపీఆర్‌ల తొలగింపు
క్షేత్రస్థాయిలో మంచిర్యాల, నాగర్‌కర్నూల్‌కు ఇన్చార్జి సీఈలే ఉండగా, వారి పరిధిలోని వార్ధా, పాలమూరురంగారెడ్డి ప్రాజెక్టుల డీపీఆర్‌లు వెనక్కి వచ్చాయి. ఏడాది నుంచి కంప్లయన్స్ రిపోర్టులు పెండింగ్ పెట్టడం, అనేకసార్లు లేఖ రాసినా స్పందించకపోవడం, కోరిన వివరాలను అందివ్వకపోవడం తదితర కారణాల వల్లే డీపీఆర్‌లను అప్రైజల్ లిస్ట్ నుంచి తొలగిస్తున్నట్టు సీడబ్ల్యూసీ పేర్కొన్నది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వాటి డీపీఆర్‌లను వెనకి పంపిస్తున్నామని, ఆ మూడు ప్రాజెక్టులను అప్రైజల్ లిస్టు నుంచి తొలగిస్తున్నామని తేల్చి చెప్పిందంటే ప్రభుత్వ పర్యవేక్షణ ఏ రీతిలో అర్థమవుతుంది. ఇక సమ్మక్కసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి అన్ని అనుమతులు వచ్చినా ఇంటర్‌స్టేట్ అంశం పెండింగ్ లో ఉన్నది. మహారాష్ట్ర నుంచి ఎన్వోసీ తీసుకుంటే చాలు అనుమతులు వచ్చే అవకాశముంది. కానీ ములుగు సీఈ విరమణ పొందగా, అక్కడ ఇన్చార్జి సీఈనే నియమించింది. వెరసి పర్యవేక్షణ కొరవడి అనుమతుల పక్రయ ఎక్కడికక్కడే నిలిచిపోయిందని ఇంజినీర్లు చెప్తున్నారు