హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): నిబంధనల ప్రకారం నిర్వహించటం లేదనే కారణంతో కొన్నేండ్ల క్రితం మూతపడ్డ వొకేషనల్ కాలేజీలకు ఇప్పుడు అనుమతులు వస్తున్నాయి. రాష్ట్రంలో 220 వొకేషనల్ కాలేజీల అనుమతులు పెండింగ్‌లో పెట్టిన అధికారులు కొన్నింటిపై మాత్రం ‘ప్రత్యేక’ ప్రేమ చూపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ నుంచి ఇంటర్‌బోర్డు అధికారుల వరకు కాసులకు కక్కుర్తిపడి గుడ్డిగా సంతకాలు పెట్టారని వొకేషనల్ అధ్యాపక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమ వ్యవహారంలో రాజకీయ నేతల ‘హస్తం’ఉన్నదని విమర్శలు గుప్పిస్తున్నారు.
వొకేషనల్ కాలేజీ ఏర్పాటుకు నిబంధనల ప్రకారం 8,000 చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉండాలి. సింగిల్ ఆక్యుపెన్సీ ఉండాలి. కళాశాల భవనంలో కుటుంబాలు నివాసం ఉండొద్దు. ఎలాంటి షాపులూ నిర్వహించొద్దు. ఫైర్ సేఫ్టీ రూల్స్ పక్కాగా పాటించాలి. అప్పుడే కాలేజీ నిర్వహణకు అనుమతులు మంజూరు చేస్తారు. ఈ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో గతేడాది రాష్ట్రవ్యాప్తంగా సుమారు 220 కాలేజీల అనుమతులను నిలిపివేశారు. కానీ, కొన్నేండ్ల నుంచి మనుగడలో లేని, కనీస నిబంధనలు పాటించని పలు కాలేజీలకు మాత్రం పరిగెత్తుకుంటూ అనుమతులు ఇచ్చారు. నాలుగేండ్ల క్రితం సిద్దిపేట జిల్లాలో మూతపడ్డ ఓ పారా మెడికల్ కాలేజీకి కేవలం 3,041 చదరపు అడుగుల వైశాల్యం, మిక్స్డ్ ఆక్యుపెన్సీ ఉన్నప్పటికీ, భవన నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించనప్పటికీ తెరుచుకొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం సాగుతున్నది.
వొకేషనల్ కాలేజీలకు అనుమతిచ్చేందుకు అధికారులు అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్టు అర్థమవుతున్నది. క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాల్సిన మున్సిపల్ అధికారులు కాలు బయటపెట్టకుండానే నిబంధనలు పాటించని సిద్దిపేటలోని ఓ కాలేజీకి సర్టిఫికెట్ జారీ చేస్తున్నట్టు తెలుస్తున్నది. బిల్డింగ్ నిర్మాణంలో నాణ్యతను తనిఖీ చేసి అనుమతిలివ్వాల్సిన మున్సిపల్ ఏఈలు కూడా నో అబ్జెక్షన్ పత్రం ఇస్తున్నట్టు వినికిడి. బల్దియా అధికారులు ఇచ్చిన వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాల్సిన జిల్లా వొకేషనల్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు అధికారులు కూడా పచ్చజెండా ఊపుతున్నట్టు సమాచారం. కిందిస్థాయి అధికారుల నివేదికలోని అంశాలను పరిశీలించకుండానే వొకేషనల్ ఇంటర్మీడియట్ జాయింట్ డైరెక్టర్, డైరెక్టర్, సెక్రటరీ కూడా గుడ్డిగా సంతకాలు పెడుతున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ వ్యవహారంలో ఏదో తిర‘కాసు’ఉన్నదనే ప్రచారం సాగుతున్నది.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రూల్స్ పాటించలేదనే కారణంతో నాలుగేండ్ల క్రితం వందలాది వొకేషనల్ కాలేజీలకు అధికారులు అనుమతులివ్వలేదు. అప్పటి నుంచి మూతపడే ఉంటున్నవి. అయితే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత కొన్నింటికీ మాత్రమే పర్మిషన్ రావడం చర్చనీయాంశమైంది. అదికూడా మే నెలలోగా కాకుండా నవంబర్‌లో అనుమతులివ్వడం గమనార్హం. కొందరు రాజకీయ నాయకులు అధికారులపై ఒత్తిడి తేవడం, వారు కూడా డబ్బులకు ఆశపడే నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చినట్టు వొకేషనల్ అధ్యాపక, విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.