Congress | హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): కొత్తగా ఏర్పడిన తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ వారికే కీలక బాధ్యతలు అప్పగించింది. కానీ రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర రాష్ర్టాల వారికి బాధ్యతలు అప్పగిస్తున్నది. ఇందుకు తాజా ఉదాహరణ తెలంగాణ పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తి సంస్థ (టీజీ రెడ్కో). దీనికి వైస్‌చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉద్యమకారుడైన జానయ్య ఉండేవారు. ఆయన పదవీ విరమణ చేసినప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం ఎక్స్టెన్షన్ ఇచ్చింది. ఇటీవల జానయ్య స్థానంలో విజయవాడకు చెందిన వావిల్ల అనిలను నియమించారు. ఆమె డీఈ స్థాయి అధికారిణి. కేసీఆర్ హయాంలో రెడ్కో సహా విద్యుత్తు పంపిణీ, ఉత్పత్తి సంస్థల్లో శాఖల అధిపతులందరూ తెలంగాణవారే ఉండేవారు.
ఇప్పుడు మొత్తం విద్యుత్తు శాఖ లో తెలంగాణ స్థానికత ఉన్నవారే లేరని ఉద్యోగులు చెప్తున్నారు. ప్రభుత్వంలోని కీలక మంత్రి సిఫారసు చేయడంతో ఆమెకు పదవి దక్కిందని చెప్తున్నారు. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఆయా పదవులు పొందినవారిలో బయటి రాష్ర్టాలవారే ఎక్కువ మంది ఉన్నారు. అనిలవావిల్లను రెడ్కో వైస్‌చైర్మన్, ఎండీ నియమించగా.. అంతకుముందే శాసనసభ సలహాదారుగా సూర్యదేవర ప్రసన్నకుమార్ (ఈయన ఇప్పుడు ఏపీ అసెంబ్లీకి వెళ్లిపోయారు), నీటిపారుదల రంగ సలహాదారుగా ఏపీ మాజీ ప్రధానకార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, మరో సలహాదారుగా ఏపీ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీనివాస రాజు, రాష్ట్ర మీడియా, సమాచార సలహాదారుగా కర్రి శ్రీరాం తదితరులను నియమించారు.