హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): వరంగల్- నల్లగొండ- ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం వరంగల్, నల్లగొండ ఉమ్మడి జిల్లాల అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎన్నికల ఇన్చార్జిలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం నియమించారు. ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్, గెలుపు కోసం ప్రత్యేక వ్యూహాలు అమలు చేస్తున్నది.
రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఈ స్థానాన్ని బీఆర్ఎస్సే సొంతం చేసుకుంటూ వస్తున్నది. కపిలవాయి దిలీప్‌కుమార్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఇద్దరూ రెండేసి సార్లు బీఆర్ఎస్ నుంచి పోటీచేసి ఎమ్మెల్సీలుగా గెలుపొందారు. మొన్నటి దాకా ఈ స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఇటీవల జనగామ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేశ్‌రెడ్డి బరిలో నిలిచారు.
తెలంగాణ ఉద్యమం, వామపక్ష భావజాలానికి కేంద్రమైన నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లోని పట్టభద్రులు ఆదినుంచీ బీఆర్ఎస్కు అండగా నిలుస్తూ వస్తున్నారు. ఇదే స్ఫూర్తి తో ఎన్నికల్లో విజయం కోసం బీఆర్ఎస్ పకడ్బందీ కార్యాచరణ అమలు చేస్తున్నది. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలు, మాజీ మం త్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులను ఇన్చార్జిలుగా నియమించారు. వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో ఎక్కువ మంది ఇన్చార్జిలను నియమించారు.