హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): టీసీయూఆర్ (తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్), ఆరు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో మైక్రోబ్రూవరీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తిగల వారు ఈనెల 3 నుంచి 25 వరకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దరఖాస్తు ధరను లక్ష రూపాయలుగా నిర్ణయించారు. మైక్రోబ్రూవరీలకు బార్లు, ఎలైట్ బార్లు, క్లబ్లు, టూరిజం స్థలాలు, హోటల్, రెస్టారెంట్, ఆహార పదార్థాలను అందజేసే సంస్థలు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
మైక్రోబ్రూవరీలు ఏర్పాటు చేయాలనుకునేవారు 1000 చదరపు అడుగుల స్థలాన్ని కలిగి ఉండేవిధంగా చూసుకోవాలని సూచించారు. కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్, అదిలాబాద్, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లలో దరఖాస్తులను సంబంధిత ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ల కార్యాలయంలో అందజేయాలని తెలిపారు. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్లో, మేడ్చల్ జిల్లా పరిధిలోని బోడుప్పల్, జవహర్నగర్, పీర్జాదిగూడ, నిజాంపేట్, రంగారెడ్డిలో.. బడంగ్పేట్, బండ్లగూడ జాగీర్, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు జీహెచ్ఎంసీ పరిధిలోని వారు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో తమ దరఖాస్తులను అందజేయాల్సి ఉంటుందని తెలిపారు.