హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో తొలిసారిగా ఇంజినీరింగ్ కాలేజీలు బ్రాంచీలను ఏర్పాటు చేసుకోబోతున్నాయి. వీటిని ఆఫ్ క్యాంపస్ కాలేజీ పేరుతో పిలుస్తారు. ఇలాంటివి ఐదు ఏర్పాటుకాబోతున్నాయి. రెగ్యులర్ కాలేజీల తరహాలోనే కోర్సులను నిర్వహిస్తాయి. 2024-25 విద్యాసంవత్సరంలో ఆఫ్ క్యాంపస్‌లను ప్రారంభించేందుకు అనుమతినివ్వాలని ఏఐసీటీఈకి బీవీఆర్ఐటీ, వర్ధమాన్,సహా మరో మూడు కాలేజీలు దరఖాస్తు చేసుకొన్నాయి. సీఎస్ఈ, సీఎస్ఈ ఏఐఎంఎల్, అనుబంధ కోర్సుల నిర్వహణకు దరఖాస్తు చేసుకున్నాయి.
ఆఫ్ క్యాంపస్ విధానంలో అదే పేరుతో మరో చోట కాలేజీని ప్రారంభించుకోవచ్చు. ఇదివరకు ఆఫ్ క్యాంపస్ ఏర్పాటు అవకాశం స్టేట్ యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీలకే ఉండేది. మంచి పనితీరు కనబరుస్తున్న విద్యాసంస్థలే ఆఫ్ క్యాంపస్‌లను నిర్వహించుకోవచ్చు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాకింగ్, క్యూఎస్ ర్యాకింగ్, 50 శాతం కోర్సులకు ఎన్బీఏ అక్రెడిటేషన్ ఉన్న కాలేజీలు ఆఫ్ క్యాంపస్‌లను తెరుచుకోవచ్చు.
స్వయంప్రతిపత్తి కాలేజీలు, ఐదేండ్లల్లో 80 శాతం సీట్లు నిండినవి కూడా ఆఫ్ క్యాంపస్‌లు తెరుచుకోవచ్చు. ప్రధాన క్యాంపస్‌లోని ల్యాబ్‌ల వసతులను వినియోగించుకోవచ్చు. తరగతులను ఆఫ్ క్యాంపస్ కాలేజీలోనే నిర్వహిస్తారు. తాజాగా దరఖాస్తు చేసిన కాలేజీలకు ఏఐసీటీఈ గుర్తింపునిచ్చిన తర్వాత జేఎన్టీయూ అధికారులు తనిఖీలు చేపట్టి అనుమతిస్తారు.