హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ) : ‘మాది యంగ్ ఇండియా బ్రాండ్’ అంటూ పదేపదే చెప్పే కాంగ్రెస్ సర్కారు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం కోసం తంటాలు పడుతున్నది. యంగ్ గురుకుల భవనాల నిర్మాణానికి నిధులు సమీకరించేందుకు ఆపసోపాలు పడుతున్నది. ఈ గురుకులాల నిర్మాణం కోసం రూ.8 వేల కోట్ల అప్పు చేయనున్నది. ఈ అప్పు కోసం జపాన్లోని ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ)కు దరఖాస్తు చేసింది. దీనిపై సంప్రదింపులు జరిపేందుకు సెప్టెంబర్ 1 నుంచి 4 వరకు విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ కోసం రూ.11,700 కోట్ల జైకా రుణం కోసం ఇప్పటికే సర్కారు సంప్రదింపులు జరిపింది. తాజాగా మరో రూ.8వేల కోట్ల కోసం సంప్రదింపులు జరిపేందుకు రెడీ అయ్యింది. ఇదిలాఉండగా నాబార్డు నుంచి ఏటా కొంత అప్పుగా తీసుకోనున్నట్టు సమాచారం. అప్పుగా తీసుకున్న మొత్తాన్ని పాఠశాల విద్యపై ఖర్చుచేయనున్నట్టు తెలిసింది. మూడేండ్ల కాలంలో నాబార్డ్ నుంచి వందల కోట్లు అప్పుగా తీసుకునేందుకు ప్రభుత్వ వర్గాలు రెడీ అవుతున్నట్టు సమాచారం.
రాష్ట్రంలో గురుకులాల పేర్లను తెలంగాణ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ (టీవైఐఆర్ఎస్)గా సర్కారు పేరు మార్చింది. అన్ని రకాల గురుకులాలు ఒకే ప్రాంగణంలో ఉంటాయని సర్కారు వర్గాలు వెల్లడించాయి. ఒక్కో రెసిడెన్షియల్ స్కూల్కు రూ.200 కోట్ల అంచనా వ్యయంగా ఖరారు చేశారు. మొదటి విడతలో 78 గురుకులాల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. వీటిలో 76 యంగ్ ఇండియా గురుకులాల భవనాల నిర్మాణానికి తెలంగాణ విద్య, సంక్షేమ మౌలిక వసతుల కల్పన సంస్థ (టీజీఈడబ్ల్యూఐడీసీ) టెండర్లు పిలిచింది. మరో రెండింటి నిర్మాణంపై సందిగ్ధత నెలకొన్నది. కాగా 14 టెండర్లకు ఆమోదం లభించగా, 18 టెండర్లు మూల్యాంకనం దశలో ఉన్నాయి. మరో 44 గురుకులాల టెండర్ల ప్రక్రియ కొనసాగుతున్నది. మొత్తం 78 గురుకులాలకు రూ.16 వేల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనున్నది. సెప్టెంబర్లో మొత్తం టెండర్ల ప్రక్రియ పూర్తికానున్నది. ఆ వెంటనే దశలవారీగా నిధులను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో వాయువేగంతో ఏడీబీ రుణం కోసం ప్రభుత్వం పావులు కదిపింది. మొదటి దశలో రూ.8 వేల కోట్లు అప్పు చేయనుండగా, మిగిలిన రూ.8 వేల కోట్లను కూడా అప్పు ద్వారానే సమీకరించనున్నట్టు సమాచారం.
ఇప్పటికే రాష్ర్టానికి వచ్చే ఆదాయం తగ్గింది. జీఎస్టీ స్లాబుల సవరణతో ఏటా రూ.7 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్ల వరకు ఆదాయం తగ్గుతుందని సర్కారు వర్గాలంటున్నాయి. కొంతకాలం క్రితం ‘నన్ను కోసుకుతిన్నా రూపాయి లేదంటూ’ సాక్షాత్తు సీఎం రేవంత్రెడ్డియే ప్రకటించారు. జీతాలిద్దామన్నా.. అప్పు పుడుతలేదని, అప్పు కోసం వెళితే దొంగలాగా చూస్తున్నారని వ్యాఖ్యానించారు. మరి దమ్మిడీ ఆదాయం లేనప్పుడు.. ఈ ఆడంబరం దేనికి? అప్పులు చేసి కట్టడం అవసరమా? అన్న ప్రశ్నలొస్తున్నాయి. ఎవరి ప్రయోజనాల కోసం వీటిని కడుతున్నారన్న సందేహాలు తలెత్తుతున్నాయి. అప్పులు తెచ్చి.. ప్రజల నెత్తిమీద భారం మోపి తమ అస్మదీయులకు కాంట్రాక్ట్లు కట్టబెట్టి 10-20 శాతం కమీషన్ల పేరిట కొల్లగొట్టే భారీ కుట్రదాగి దీని వెనుక ఉందన్న ఆరోపణలొస్తున్నాయి. తమవారి ప్రయోజనాలు, పర్సంటేజీల కోసం అప్పులు చేయడం దివాళాకోరుతనమని నిపుణులంటున్నారు. తాజాగా విద్యారంగం సహా యంగ్ ఇండియా గురుకులాల కోసం తెచ్చే అప్పులను ఎఫ్ఆర్బీఎం నుంచి మినహాయించాలని సర్కారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ను కోరింది.