సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలోని నేరేడుచర్ల(Nereducherla) మున్సిపల్ కమిషనర్ తాగి విధులు నిర్వర్తిస్తూ.. బీఆర్ఎస్ నాయకులపై దౌర్జన్యం చేస్తున్న కమిషనర్ని వెంటనే సస్పెండ్ చేయాలని ఆందోళనలు కొనసాగుతున్నాయి. నేరేడుచర్ల మున్సిపల్ ఆఫీసు ఎదుట డీసీసీబీ డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి రెడ్డి(Appi Reddy) ఆమరణ నిరహార దీక్ష చేపట్టారు. బీఆర్ఎస్ నాయకులు మద్దతు ప్రకటించారు. వివరాల్లోకి వెళ్తే.. ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ అప్పిరెడ్డిపై వ్యక్తిగతంగా దూషించిన కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. అవినీతి కమిషనర్ అశోక్ రెడ్డి పై చర్యలు తీసుకొని విచారణ జరిపించాలన్నారు.
ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ..కమిషనర్ తనపై వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని, కారుతో గుద్ది అంతమొందించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. గతంలో ఒకటి, రెండు బిల్లులు పెండింగ్ ఉన్నాయని, దాని గురించి అడగడానికి వస్తే.. నీకు మునిసిపాలిటీలో ఏం పని బయటకు వెళ్లమని మాటలకి చెప్పలేని విధంగా దుర్భాషలాడినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
కనీసం ప్రజాప్రతినిధులకే గౌరవిం ఇవ్వకపోతే సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందని ప్రశ్నించారు.. ప్రభుత్వ ఉద్యోగిలా కాకుండా ఓ రాజకీయ పార్టీ నాయకుడిలా వ్యవహరించాడన్నారు. అటువంటి కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే అకారణంగా అరెస్టు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కమిషనర్ని సస్పెండ్ చేసేంతవరకు నిరీక్షణ దీక్ష కొనసాగిస్తానని తెలిపారు.