Runa Mafi | అచ్చంపేట రూరల్, అక్టోబర్ 10: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ పూర్తిచేశామని ప్రభుత్వం గొప్పగా ప్రకటించుకుంది. రూ. 2 లక్షల లోపు రుణాలన్నింటినీ చెల్లించేశామని సీఎం రేవంత్‌రెడ్డి సహా మంత్రులంతా ప్రతి వేదికపైనా చెప్తున్నారు. అయితే, రుణమాఫీపై సీఎం సహా మంత్రులు చేస్తున్న ప్రకటనలకు, క్షేత్రస్థాయిలోని పరిస్థితికి పొంతనలేకుండా పోయింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజు రుణమాఫీ కాని రైతులు రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు.
బ్యాంకుల ముందు ధర్నాలు చేస్తున్నారు. తాము కూడా అర్హులమేనని, తమను కూడా రుణాల నుంచి విముక్తి చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది. మాజీమంత్రి హరీశ్‌రావు ఇటీవల రుణమాఫీపై సమాచార హక్కు చట్టం కింద లీడ్ బ్యాంక్ భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) నుంచి సేకరించిన సమాచారంలోనూ పూర్తిస్థాయిలో రైతులకు రుణమాఫీ కాలేదని తేలింది. దీనిని బలపరస్తూ తాజాగా మరో ఘటన జరిగింది.
రుణాలు తీసుకున్న రైతులు వడ్డీతో సహా చెల్లించాలంటూ బ్యాంకుల నుంచి అందుతున్న నోటీసులు చూసి రైతులు ఆవేదన చెందుతున్నారు. హామీ ఇచ్చిన ప్రకారం ప్రభుత్వం రుణాలు మాఫీ చేయకపోవడంతో పండుగ పూట బ్యాంకులు నోటీసులు పంపుతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం సింగారం గ్రామానికి చెందిన ముగ్గురు రైతులకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు నోటీసులు పంపింది. గ్రామానికి చెందిన రైతులు గెనమోని జంగయ్య నిరుడు రూ.1.60 లక్షలు (వడ్డీ రూ.6,032.11), రెండేండ్ల క్రితం ఉడుత పార్వతమ్మ రూ.1.30 లక్షలు (వడ్డీ రూ.12,429), ఏడాది కిందట నీలం వెంకటయ్య రూ.1.60 లక్షలు, పాడి కోసం అదనంగా రూ.50 వేల రుణాన్ని (వడ్డీ రూ.8,025) అచ్చంపేటలోని ఏపీజీవీబీలో తీసుకున్నారు.
వీరు తీసుకున్నది రూ. 2 లక్షల లోపే అయినా రేవంత్ సర్కారు చేసిన రుణమాఫీ వీరికి వర్తించలేదు. పైగా అసలుతోపాటు వడ్డీ కలిపి చెల్లించాలని బ్యాంక్ నుంచి నోటీసులు అందాయి. అంతేకాదు, నోటీసు పంపేందుకు అయిన రూ. 59 కూడా మీ ఖాతాలోనే కలుపుతామని నోట్ పెట్టడం గమనార్హం.