గోదావరిలో ప్రస్తుతం లక్షా 22వేల క్యూసెక్కుల వరద కొనసాగుతున్నది. అంటే మరో లెక్కలో 11 టీఎంసీల ప్రవాహం. వచ్చే వారం రోజులపాటు ప్రాణహితలో ఇదేస్థాయి వరద వచ్చిచేరుతుందని అంచనా. దుర్భిక్షపు ఛాయలు కమ్ముకుంటున్న వేళ ఈ నీళ్లు తెలంగాణ సాగుకు అమృతతుల్యం. కానీ.. రేవంత్ సర్కార్ ఏం చేస్తున్నది? మన పంటలను గాలికి వదిలి, వరదను కిందికి విడిచిపెడుతున్నది. ఒకవైపు పోలవరం-బనకచర్లతో మన నీళ్లను తన్నుకుపోదామని ఏపీ నక్కజిత్తులతో యత్నిస్తుంటే.. దానికి వంతపాడుతూ, వరదను దిగువకు వదిలేస్తున్నది రేవంత్ ప్రభుత్వం. కాళేశ్వరాన్ని పడావుపెట్టి గోదావరినీ దగ్గరుండి మరీ ఏపీకి సాగనంపుతున్నది.
మరి, కృష్ణాలో ఏం జరుగుతున్నది? ఏపీ, కర్ణాటక చేతులు కలిపి తెలంగాణకు చుక్కనీరు దక్కకుండా చేస్తున్నాయి. ఎగువన అక్రమ ప్రాజెక్టులతో కర్ణాటక పైపైనే కృష్ణా నీటిని మలుపుకొని పోతుంటే.. జూరాల, శ్రీశైలం ఎండిపోయేలా ఏపీ కుతంత్రాలు రచిస్తున్నది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కత్తిగట్టిన సీఎం బాబు.. గతంలోనే లేఖలతో అడ్డుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. తనకు అనుకూలమైన వ్యక్తులు అధికారంలోకి రాగానే ఇప్పుడు కుట్రల కత్తులకు మరింత పదునుపెట్టారు. అటు గోదావరి, ఇటు కృష్ణా రెండింటినీ బైపాస్ చేసి.. తెలంగాణను బలిపెట్టేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. పరాయి పాలకుల మోచేతి నీళ్లకు అలవాటు పడిన కాంగ్రెస్ సర్కార్.. బాబుకోసం తెలంగాణ రైతు నోట్లో మట్టికొట్టే కుట్రలకు వంతపాడుతున్నది.
(గుండాల కృష్ణ, మ్యాకం రవికుమార్)
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ) : కనిపించని కుట్రలతో తెలంగాణ మరోసారి వంచనకు గురవుతున్నది. అటు కాళేశ్వరాన్ని పడావుపెట్టి గోదావరి నీటిని కిందికి వదులుతుంటే.. ఇటు తుంగభద్ర మీద కర్ణాటక-ఏపీ చేతులు కలిపి కృష్ణా నీళ్లు కూడా తెలంగాణకు దక్కకుండా చేసే పన్నాగాలు రచిస్తున్నాయి. ఫలితంగా ఆరు దశాబ్దాల పాటు కృష్ణాజలాల కోసం అలమటించిన ఈ నేల మళ్లీ ఎడారిగా మారే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. నాడు పరాయి పాలనలో ఈ గడ్డ బీడుగా మారితే.. నేడు పాలమూరు బిడ్డ పాలనలోనే ఎండబెట్టే కుట్రలు చుట్టుముడుతున్నాయి. తెలంగాణ అంటేనే విషంకక్కే చంద్రబాబు మొదటి టర్మ్‌లో ఈ ప్రాంత ప్రాజెక్టులపై కేంద్రానికి వరుస ఫిర్యాదులతో తీవ్ర ఆటంకాలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తనవాళ్లు రాజ్యమేలుతున్నారని అదును చూసుకొని శాశ్వతంగా తెలంగాణకు కృష్ణాజలాలు దక్కకుండా చేసే కుతంత్రాలు పన్నుతున్నాడు.
కృష్ణమ్మ కర్ణాటకను దాటి తెలంగాణలోకి ప్రవేశించకుండా కట్టడి చేసే కుట్రల ప్రాజెక్టులను తెరపైకి తెస్తున్నాడు. ఎగువన ప్రధాన కృష్ణాపై ఆల్మట్టి సామర్థ్యాన్ని పెంచుకునేలా కర్ణాటక రాష్ర్టానికి పరోక్షంగా సహకరించడమే కాకుండా అటు భీమా, ఇటు తుంగభద్రపై ఇబ్బడిముబ్బడిగా చిన్న ప్రాజెక్టులకు రూపకల్పన చేయించి వచ్చిన నీటిని వచ్చినట్టుగా మళ్లించేందుకు భారీ స్కెచ్ వేస్తున్నాడు. తద్వారా దక్షిణ తెలంగాణ ప్రాణనాడిగా ఉన్న జూరాల, శ్రీశైలం జలాశయాలకు కృష్ణాజలాలు రాకుండా కట్టడి చేస్తున్నాడు.
ఇదే సమయంలో శ్రీశైలం, నాగార్జునసాగర్‌పై ఆధారపడిన సీమాంధ్ర ప్రాంతాలకు పోలవరం, పోలవరం-బనకచర్ల ప్రాజెక్టులతో గోదావరి జలాలను తరలించి తెలంగాణ భూములను అష్ట దిగ్బంధనం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాడు. తాను పాలమూరు బిడ్డనంటూ ప్రకటించుకునే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ కుట్రలన్నింటినీ తిప్పి కొట్టకపోగా.. బాబు వేస్తున్న పాచికల అమలుకు ఉవ్విళ్లూరుతుండటం తెలంగాణ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నది.
ఆంధ్రప్రదేశ్‌లో కలువకముందు అప్పర్ కృష్ణా ప్రాజెక్టుతో దక్షిణ తెలంగాణ సస్యశ్యామలం కావాల్సింది. కానీ ఏపీలో కలువడంతో ఆ కలలన్నింటినీ చిదిమేసినట్టయింది. ఆ తర్వాత తెలంగాణ ప్రయోజనాలను పట్టించుకోకుండా నాగార్జునసాగర్, శ్రీశైలం నిర్మాణాలు జరుగడంతో అప్పటి నుంచి తెలంగాణ భూములన్నీ శాశ్వతంగా బీడుగా మారాయి. శ్రీశైలం నుంచి తెలంగాణ చుక్క నీరు వాడుకునే వెసులుబాటు రాలేదు. నాగార్జునసాగర్ కుడి కాలువతో పోలిస్తే ఎడమ కాల్వ దిగదుడుపు. పైగా ఎడమ కాలువ మళ్లీ ఆంధ్రాలోకి ప్రవేశించి అక్కడికి సాగునీటిని అందించేలా రూపకల్పన చేశారు.
చివరికి బచావత్ ట్రిబ్యునల్‌కు చైర్మన్‌గా వ్యవహరించిన జస్టిస్ బచావత్ ఈ ప్రాంత దీనస్థితి, వివక్షను అర్థం చేసుకొని జూరాల ప్రాజెక్టుకు పురుడుపోశారు. అయినా సమైక్య పాలకులు దానిని పూర్తిగా బతికి బట్టకట్టనీయలేదు. జలయజ్ఞం కింద భారీ ప్రాజెక్టులను చేపట్టినా నిధులు పారాయేగానీ తెలంగాణ బీడు భూముల్లోకి నీళ్లు పారలేదు. దీంతో తెలంగాణ ఏర్పడేనాటికి సొంతంగా పట్టుమని పది టీఎంసీల కృష్ణాజలాలను ఒడిసిపట్టుకునే సామర్థ్యం కూడా లేదు. దీనిని బట్టే ఆరు దశాబ్దాల ప్రస్థానంలో తెలంగాణ ఎంత నష్టపోయిందో అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణ ఏర్పడేనాటికి స్వల్పంగా ఉన్న కృష్ణాజలాల నిల్వ సామర్థ్యాన్ని కేసీఆర్ ప్రభుత్వం రీడిజైనింగ్‌తో జల భాండాగారంగా మార్చింది. ఉమ్మడి రాష్ట్రంలో తలపెట్టిన జూరాల, రాజీవ్ భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి ప్రాజెక్టుల్లో తెలంగాణ ఏర్పడేనాటికి పూర్తయింది కేవలం జూరాల ప్రాజెక్టు మాత్రమే. అందునా దానికి దాదాపు 17 టీఎంసీల కేటాయింపు ఉంటే 11 టీఎంసీలకు కుదించి తొమ్మిది టీఎంసీలతో నిర్మాణం చేపట్టి చివరకు లైవ్ స్టోరేజీ ఏడు టీఎంసీలకు పరిమితం చేశారు. మిగిలిన ప్రాజెక్టులన్నింటినీ కలిపినా తెలంగాణ రోజుకు ఒక్క టీఎంసీ నీటిని కూడా ఎత్తిపోసుకునే సామర్థ్యం లేదు. కేసీఆర్ ప్రభుత్వం కల్వకుర్తి నీటి కేటాయింపుల్ని 25 టీఎంసీల నుంచి ఏకంగా 40 టీఎంసీలకు పెంచడంతో పాటు పెండింగు ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసింది.
జూరాల సామర్థ్యాన్ని బట్టి దానిపై ఇంతకంటే ఎక్కువ ప్రాజెక్టులకు రూపకల్పన చేసినా ప్రయోజనం లేదనే వాస్తవాన్ని గుర్తించింది. శ్రీశైలం జలాశయంపై దృష్టిసారించింది. ఓవైపు ఏపీ పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచుకుంటూ శ్రీశైలాన్ని మళ్లిస్తుండటంతో అందుకు దీటుగా కేసీఆర్ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఏకంగా 67.67 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో చేపట్టింది. అదే చంద్రబాబుకు కంటగింపుగా మారింది. అందుకే ప్రాజెక్టుకు కేసీఆర్ శంకుస్థాపన చేసింది మొదలు పదుల సంఖ్యలో అప్పటి ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదులు చేసింది. తెలంగాణ కాంగ్రెస్ ఎన్జీటీ వరకు వెళ్లి ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేయడంతోపాటు భూసేకరణపై పదుల సంఖ్యలో కేసులు వేసింది. అయినా కేసీఆర్ ప్రభుత్వం వాటన్నింటినీ అధిగమించి రూ.27 వేల కోట్లు ఖర్చు చేసి శ్రీశైలం నుంచి కృష్ణాజలాలను ఉద్దండాపూర్ వరకు తరలించేలా 90 శాతానికి పైగా పనులు పూర్తి చేసింది.
శ్రీశైలం జలాశయం నుంచి ఏపీ గ్రావిటీ ద్వారా మళ్లించే నీటికి దీటుగా కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టులన్నింటినీ సిద్ధం చేసి ఉంచింది. కానీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వాటన్నింటిపైనా కక్షగట్టింది. ఇదే సమయంలో మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన కుట్రలకు మళ్లీ పదును పెట్టారు. కృష్ణా నదిపై తెలంగాణ నిర్మించిన ప్రాజెక్టులన్నింటినీ శాశ్వతంగా పడావు పెట్టేలా భారీ కుట్రకు తెరలేపారు. తొలుత బనకచర్ల, ఆపై నల్లమలసాగర్, ఇప్పుడు గోదావరి-కావేరీ అనుసంధానం ముసుగులో కుంపటి పెట్టి కూర్చున్నారు.
ప్రధాన కృష్ణాలో వచ్చే వరద ఆల్మట్టి, నారాయణపూర్ దాటి దిగువన జూరాలకు రావాలి. ఆల్మ ట్టి సామర్థ్యం పెంపుతో జూరాలకు పెద్ద గండి పడనుంది. మరోవైపు భీమా నుంచి జూరాలకు వచ్చే కొద్దిపాటి నీటిని సైతం కర్ణాటక ఎత్తి పోసుకునేందుకు కొల్పూర్, హర్యాల్, సొన్నా తదితర బ్యారేజీ-కమ్-బరాజ్‌ల నిర్మాణానికి సిద్ధమవుతున్నది. దీంతో జూరాలకు నదీజలాలు రాకుం డా పైనే ఆగిపోతాయి. జూరాలకే ఇన్‌ఫ్లో లేకుం టే శ్రీశైలానికి నీళ్లు వచ్చే అవకాశమే ఉండదు.
శ్రీశైలానికి మరో కీలకమైన వనరు తుంగభద్ర జలాలు.. వాటిని కూడా శ్రీశైలం దాకా రాకుండానే ఎగువనే ఒడిసిపట్టి మళ్లించేందుకు కర్ణాటక నిల్వ సామర్థ్యాన్ని భారీగా పెంచుకోవడంతో పాటు మరిన్ని బ్యారేజీ-కమ్-బరాజ్‌ల నిర్మాణానికి రంగం సిద్ధం చేస్తున్నది.
ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం కూడా తుంగభద్ర జలాల్ని ఎగువనే మళ్లించేందుకు సమాంతరంగా మరో హైలెవల్ కాలువ, బ్యారేజీ-కమ్-బరాజ్‌లకు సిద్ధమవుతున్నది. 10 టీఎంసీల సామర్థ్యంతో గుండ్రేవుల బరాజ్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నది. తుంగభద్ర హైలెవల్ కెనాల్‌కు సమాంతరంగా వరద కాలువ తవ్వేందుకు సిద్ధమైంది. ఇప్పటికే 4 టీఎంసీలు మళ్లించేందుకు ఆర్డీఎస్ కుడికాలువ పనులు పూర్తిచేసి కాచుకొని కూర్చున్నది.
దీంతో జూరాలకు వచ్చే రెండు మార్గాలు, తద్వారా శ్రీశైలానికి వచ్చే మూడు మార్గాలను మూసేలా తాజా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కుట్రలను పసిగట్టి, తిప్పికొట్టాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం చీకటి ఒప్పందాలు చేసుకోవడంతో పాటు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ కుట్ర అమలులో భాగస్వామిని చేస్తుండటం ఆందోళనకు గురిచేస్తున్నది.
ఎగువన కర్ణాటక నుంచి తెలంగాణ గడ్డ మీదికి కృష్ణాజలాలు రాకుండా దిగ్బంధిస్తూనే.. కేంద్రం మధ్యవర్తిత్వం ద్వారా చంద్రబాబు ‘పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు 90 టీఎంసీల కేటాయింపులకు ఎన్వోసీ’ ఇస్తాననే దింపుడు కళ్లం ఆఫర్ ఇస్తున్నారు. ‘అసలు ఎగువ నుంచి ఇన్‌ఫ్లోలు లేకపోతే ప్రాజెక్టు కేటాయింపులతో తెలంగాణ ఏం చేసుకుంటుంది?’ అని సాగునీటి రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. శ్రీశైలానికి భారీగా ఇన్‌ఫ్లోలు రాకపోతే ఆ జలాశయంపై ఆధారపడ్డ ఏపీలోని ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటనే అనుమానం రావొచ్చు. పోతిరెడ్డిపాడు కాలువకు, దానికి అనుసంధానంగా ఉన్న బనకచర్ల జంక్షన్‌కు నీళ్లు రాకుంటే పెన్నా బేసిన్ ఎండిపోతుంది.
శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు నీళ్లు రాకుంటే కుడి కాలువ, కృష్ణా డెల్టాకూ సాగునీటి గండమే కదా? అని అనిపించొచ్చు. ఇక్కడే చంద్రబాబు మరో జిమ్మిక్కును ప్రదర్శించేందుకు రంగం సిద్ధం చేసినట్టు సాగునీటి రంగ నిపుణులు చెప్తున్నారు. కృష్ణమ్మను దిగ్బంధించి, తెలంగాణను ఎండబెట్టి, ఏపీకి నీటిలోటు రాకుండా చూసేందుకు భారీ ప్లాన్ వేసినట్టు పేర్కొంటున్నారు. అదే రూ.80 వేల కోట్లతో తలపెట్టిన పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు! దీని ద్వారా నికర గోదావరి జలాలను పోలవరం నుంచి బనకచర్ల జంక్షన్‌కు తరలించి పెన్నా బేసిన్ కడుపు నింపుతారు.
దిగువన నాగార్జునసాగర్‌పై ఆధారపడి ఉన్న కుడి కాలువ, కృష్ణా డెల్టాకు పోలవరం కుడి కాలువ, అవసరమైతే పట్టిసీమతో గోదావరి జలాలను తరలించి సస్యశ్యామలం చేసుకుంటారు. స్థానికంగా వచ్చే ఇన్ఫ్లోలతో నాగార్జునసాగర్‌కు వచ్చే కొద్దిపాటి వరద నుంచి ఎడమ కాలువ కింద ఉన్న ఏపీ ఆయకట్టుకు సాగునీరు అందిస్తారు. అంటే తెలంగాణకు కృష్ణమ్మను దూరం చేసి, రాని నీళ్లకు ఎన్వోసీ ఇచ్చి, ఏపీకి మాత్రం గోదావరి జలాలను తరలించుకొని వెళ్తారన్నమాట!
వానకాలం మొదలై 36 రోజులు గడుస్తున్నా గోదావరి బేసిన్లో ఎక్కడా ప్రవాహాలు మొదలు కాలేదు. అప్పర్ గోదావరి, మధ్య గోదావరిలో చుక్క నీరు రావడం లేదు. వర్షాలు కురిసినా ఎగువన మహారాష్ట్ర ప్రాజెక్టులు నిండితే తప్ప దిగువకు చుక్క నీరు రాదు. మరోవైపు ప్రాణహిత నదిలో జూన్ 1 నుంచే వరద ప్రవాహాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే దాదాపు 25 టీఎంసీల వరకు జలాలు దిగువన ఏపీకి తరలిపోయాయి. ఇప్పటికీ ప్రాణహిత నుంచి గోదావరిలోకి మేడిగడ్డ వద్ద లక్ష క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రాణహితలో 10 నెలల పాటు నికర ప్రవాహాలు కొనసాగుతాయి. మొత్తంగా ప్రాణహితలో నికర నీటిలభ్యత ఉంటుంది.
ఈ నేపథ్యంలోనే తెలంగాణకు శాశ్వత కరువును తీర్చేందుకు ప్రాణహిత గోదావరిలో కలిసిన తర్వాత మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మించారు. తద్వారా 240 టీఎంసీలు వినియోగించుకునే అవకాశం కల్పించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తే ప్రాణహిత జలాలు దిగువకు వెళ్లే అవకాశాలు తగ్గిపోతాయి. వెళ్లినా దిగువన ఉన్న సమ్మక్కసాగర్ బరాజ్‌కే చేరుతాయి. ఇక ప్రస్తుతం చిన్నపాటి సాంకేతిక లోపాన్ని కేంద్రం ఎన్డీఎస్ఏ పేరిట భూతద్దంలో చూపుతుండగా, దాన్ని సాకుగా చూపి కాంగ్రెస్ సర్కార్ మేడిగడ్డ బరాజ్‌ను రెండున్నరేండ్లుగా పడావు పెట్టింది.
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ రెండింటి లక్ష్యం ఒక్కటే. ఏపీ ప్రతిపాదించిన పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు మార్గం సుగమం చేయడమే. కారణమేమంటే కేంద్ర సంస్థల అధ్యయనం ప్రకారం గోదావరిలో మిగులు జలాలే లేవు. మరోవైపు వరద జలాల పేరిట ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్ర సంస్థలు అనుమతులు ఇవ్వవు. నిధులు మంజూరు చేయవు. నికర జలాలు ఉన్నప్పుడు మాత్రమే బనకచర్లకు అనుమతులు సాధ్యమవుతాయి.
మేడిగడ్డ, సమ్మక్కసాగర్ వినియోగంలో ఉంటే ప్రాణహిత జలాలు దిగువకు వెళ్లే అవకాశాలు తగ్గిపోతాయి. ఈ నేపథ్యంలో మేడిగడ్డను పడావు పెట్టి, సమ్మక్కసాగర్‌కు అనుమతులు రాకుండా అడ్డుకుంటున్నారు. ప్రాణహిత జలాలను దిగువకు వెళ్లేలా చేస్తూ, గోదావరిలో మిగులు జలాలను చూపుతూ బనకచర్లకు అనుమతులిచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. రేపటి రోజున జాతీయ ప్రాజెక్టు గోదావరి- కావేరి రివర్ లింకు ముసుగులో బనకచర్లకు అనుమతిస్తే ప్రాణహిత జలాలను పోలవరం మీదుగా ఏపీ బనకచర్లకు, ఆపై కావేరికి తరలిస్తారు. తెలంగాణ జలహక్కులకు పెను విఘాతం కలుగనున్నది.
ఈ ప్రతిపాదనలన్నీ పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టులో అంతర్భాగంగా పెడుతున్నట్టు సాగునీటి రంగ నిపుణులు చెప్తున్నారు. దీంతో ఇవే ప్రతిపాదనలను చివరి దశలో ఉన్న బ్రిజేశ్ ట్రిబ్యునల్ ముందు ఉంచుతున్నది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కృష్ణాజలాల వినియోగ క్రమాన్ని ట్రిబ్యునల్ ముందు తెలంగాణ డాక్యుమెంట్ల రూపంలో ఉంచింది. అందుకే చంద్రబాబు వీటికి విరుగుడుగా తెలంగాణ చెప్తున్నట్టు తాము కృష్ణాజలాలు కాకుండా గోదావరి జలాలను వినియోగించుకోనున్నట్టు పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును ట్రిబ్యునల్ ముందు ఉంచనున్నారు. దీంతో ట్రిబ్యునల్పరంగానూ కృష్ణాజలాల్లో భారీ ఎత్తున ఆదా చూపి వాటిని ఇతర ప్రాజెక్టులకు కేటాయించుకునేలా ఏపీ వ్యూహరచన చేస్తున్నదని సాగునీటి రంగ నిపుణులు అనుమానిస్తున్నారు.