హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): అభివృద్ధి శూ న్యం.. అప్పులు ఘ నం.. అన్న చందంగా ఏపీలో వైసీపీ ప్రభుత్వ అసమర్థ పాలన కొనసాగుతున్నదని బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ప్రజలను జీవితాలు అస్తవ్యస్తం చేస్తున్నాయని ఆరోపించారు. లక్షల కోట్ల అప్పులతో ఏపీ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని ఆందోళన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలతో పేద, మధ్యతరగతి ప్రజలు జీవించలేని దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. సీఎంగా జగన్ గద్దెనెక్కిన నాటి నుంచి పరిమితికి మించి రుణాలు తెచ్చి ఏపీని అప్పుల రాష్ట్రంగా మార్చారని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాది నుంచే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రగల్భాలు పలికిన జగన్ వాగ్దానాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మాట తప్పను.. మడమ తిప్పను.. అన్న జగన్ మాటలు నీటి మూటలే అయ్యాయని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి, ప్రజలకు అభివృద్ధితో కూడిన సంక్షేమ పాలన అందించకుంటే రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
బీఆర్ఎస్లో పలు పార్టీల నేతల చేరిక
హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో విజయనగరం జిల్లా పెద్దమేడపల్లి గ్రామానికి చెందిన మాదిరెడ్డి జగన్ సహా పలు జిల్లాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.