హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు శాఖలో అత్యంత కీలకమైన తెలంగాణ విద్యుత్తు ప్రధాన తనిఖీ అధికారి (సీఈఐజీ) పోస్టు ఎవరికి దక్కుతుందన్న అంశమిప్పుడు హాట్‌టాపిగా మారింది. ఈ పోస్టును ఓ ఆంధ్రా అధికారి ఎగరేసుకుపోయేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ అధికారిని కాదని, తనకే ఆ పోస్టు కట్టబెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల పదవీ విరమణ చేసిన సీఈఐజీ కూడా ఏపీ అధికారికే మద్దతుగా నిలవటం, ఆయన్నే కొత్త సీఈఐజీగా నియమించాలని ప్రభుత్వానికి లేఖరాయటం చర్చనీయాంశంగా మారింది. ఇదివరకు పనిచేసిన సీఈఐజీ ఆగస్టు 31న పదవీ విరమణ పొందారు. దీంతో కొత్త సీఈఐజీని నియమించాల్సి ఉన్నది. తెలంగాణ ఆవిర్భావం నుంచి సీఈఐజీ పోస్టులో ఏపీ అధికారులే కొనసాగుతూ వచ్చారు. ఈసారి తెలంగాణ అధికారులకే అవకాశం కల్పిస్తారని అంతా భావించారు. కానీ, మళ్లీ ఆంధ్రా అధికారి ఈ పోస్టు కోసం ప్రయత్నాలు చేయటం తెలంగాణ అధికారులను కలవరపెడుతున్నది. రిటైర్డ్ అధికారి ఏపీ అధికారిని నియమించాలని సిఫారసు చేయడం గతంలో ఎప్పుడూ జరగలేదు. ఇదే మొదటిసారి. దీనిపై తెలంగాణ ఉద్యోగులు భగ్గుమంటున్నారు. తెలంగాణవారికే సీఈఐజీ పోస్టును కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత విద్యుత్తు సంస్థల్లో ఏపీ అధికారులకు పెద్దపీట వేస్తున్నారు. ఇన్నేండ్లు సైలెంట్‌గా ఉన్న ఆంధ్రా అధికారులు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఒక్కోదానికి ఎసరుపెడుతున్నారు. ఆంధ్రా మత్తులో జోగుతున్న తెలంగాణ సర్కారు పెద్దలు కీలక స్థానాలను వారికే అప్పగిస్తున్నారు. తెలంగాణ బిడ్డల నోట్లో మట్టికొడుతున్నారు. దీంతో పోస్టులు తెలంగాణవి.. పెత్తనం ఆంధ్రా అధికారులది అన్నట్టు తయారైంది పరిస్థితి. ఇప్పటికే టీజీఎస్పీడీసీఎల్లో ముగ్గురు ఆంధ్రా అధికారులను ఇన్చార్జి డైరెక్టర్లుగా కొనసాగిస్తున్నారు. ఇటీవలే టీజీ రెడో వైస్ చైర్మన్ అండ్ ఎండీగా సీమాంధ్ర మూలాలున్న డీఈని నియమించారు. దీనిపై ఇప్పటికే తెలంగాణ ఉద్యోగులు మండిపడుతున్నారు. సోషల్‌మీడియాలో పెద్దఎత్తున తమ నిరసన వ్యక్తంచేస్తున్నారు. ‘తెలంగాణ ఇచ్చిన పార్టీ అని ఓటేస్తే తెలంగాణ వాదాన్ని పూర్తిగా మరుగునపడేసిండ్రు. మా ఉద్యోగాలు మాకే అన్న నినాదాన్నే గాలికొదిలేసిండ్రు. ఆంధ్రా వాళ్లు వెళ్లిపోయిండ్రని అనుకుంటే చింత చచ్చినా.. పులుపుచావలే అనుకున్నట్టే’ అని ఓ విద్యుత్తు ఉద్యోగి ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రావాళ్లు లేకుండా పాలన చేసుకోలేరంటూ బెత్తంపట్టుకొని కిరణ్‌కుమార్‌రెడ్డి అన్న మాటలను నేటి కా్రంగెస్ పాలన నిజం చేస్తున్నదని మరో అధికారి విస్మయం వ్యక్తంచేశారు.