హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం-1956లోని సెక్షన్-3 ప్రకారం కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ చేపట్టిన విచారణపై అభ్యంతరాలను వ్యక్తంచేస్తూ సుప్రీంకోర్టు ఎదుట ఏపీ తన వాదనలు వినిపించింది. జస్టిస్ సూర్యకాంత్ బెంచ్ ఎదుట బుధవారం వాదనలు ప్రారంభమయ్యాయి. కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యునల్-2కు కేంద్రం నూతన మార్గదర్శకాలపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ ఏపీ సర్కారు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది.
కొత్త టీవోఆర్ చెల్లబోదని, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టానికి అది విరుద్ధమని ఏపీ వాదిస్తున్నది. ట్రి బ్యునల్ విచారణపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు.. తన వాదనలను వినిపించేందుకు ఏపీకి అనుమతిచ్చింది. ఈ సందర్భంగా తన వాదనలను ప్రారంభించిన ఏపీ.. కృష్ణాబేసిన్ ప్రాథమిక సమాచారాన్ని వివరించింది. గురువారం కూడా విచారణ కొనసాగనున్నది.