యాదాద్రి: ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా (RK Roja) యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకున్నారు. స్వాతి నక్షత్రం సందర్భంగా శతఘటాభిషేకంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం అర్చకులు మంత్రి రోజాకు వేదాశీర్వచనం అందించారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. శ్రావణమాసంలో స్వాతి నక్షత్రం రోజు స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
ప్రజలకు సేవచేయడానికి యాదాద్రీశుడు నాకు మరింత ధైర్యం, రెట్టింపు ఉత్సాహం ఇస్తాడని చెప్పారు. గతంలో స్వామివారిని దర్శించుకున్న తర్వాతే మంత్రి అయ్యానని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారని, అది కేసీఆర్ పూర్వ జన్మసుకృతమన్నారు. భగవంతుడు తనకు నచ్చిన వారితో ఆలయ నిర్మాణం చేస్తాడని.. సీఎం కేసీఆర్కు ఆ భాగ్యం దక్కిందని వెల్లడించారు.