ఇసుంట రమ్మంటే ఇల్లంతా నాదేనంటరు! ఆంధ్రప్రదేశ్‌తో తెలంగాణకు ఇలాంటి అనుభవం కొత్తేమీ కాదు. ముఖ్యంగా నదీజలాల విషయంలో నాటి ఉమ్మడి ఏపీలోని దశాబ్దాల కాంగ్రెస్-టీడీపీ ప్రభుత్వాల హయాంలోనైనా! నేటి తెలంగాణలోని రేవంత్ పాలనలోనైనా!! పేరుకు ఒక ప్రాజెక్టు… చిన్న కాల్వ… ఆపై దాని విస్తరణ పేరిట ఇతర బేసిన్లలోని ఆయకట్టుకు వందలాది టీఎంసీలు తరలించే ప్రణాళిక. అప్పుడు చెన్నైకి తాగునీటి సరఫరా పేరిట మొదలుపెట్టిన తెలుగుగంగ కోరలు చాచి ఇప్పుడు పోతిరెడ్డిపాడు-రాయలసీమ లిఫ్టు రూపంలో కృష్ణమ్మను చెరపట్టింది. సరిగ్గా అదే కోణంలో తాజాగా గోదారమ్మ వంతు.
పోలవరం పేరిట గోదావరిజలాల తరలింపును చేపట్టిన ఆంధ్రప్రదేశ్.. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణాజలాల్లో మనకు రావాల్సిన వాటాను ఇప్పటిదాకా ఇవ్వడం లేదు. పైగా ఏపీ సీఎం చంద్రబాబు గోదావరి-కృష్ణా అనుసంధానం పేరిట తెరపైకి తెచ్చిన బనకచర్ల ప్రాజెక్టుతో గోదారమ్మను చెరబట్టేందుకు కుట్రలు రచిస్తున్నారు. చెప్పేది ఒకటి చేసేది మరోటి అన్నట్టు ప్రకటించినదానికంటే రెండుమూడింతల పెద్దవైన వ్యవస్థలను ఏర్పాటు చేస్తారు. సామర్థ్యానికి మించి కాలువలు కడతారు. ఇక అక్రమాలకు ‘గేట్లు’ ఎత్తి అమాంతంగా ఉన్నవి మొత్తం మింగేస్తారు. ఇలా తెలంగాణ ప్రాంతంపై నాటి ఉమ్మడి వలసాంధ్ర పాలకులు చేసిన నీటి కుట్రలు అన్నీఇన్నీ కావు!
60 ఏండ్ల పాలనలో ఉమ్మడి పాలకులు చేసిన జల కుట్రలు.. కొల్లగొట్టిన నదీ జలాల గురించి చెప్పాలంటే ఒక్కరోజులో ఒడిశే ముచ్చట కాదు! ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పోతిరెడ్డిపాడు పేరిట కృష్ణా జలాలను చెరబడితే.. ఇప్పుడు అదేతరహాలో గోదావరి -బనకచర్ల లింక్ పేరిట గోదావరినీ చెరబట్టేందుకు ఏపీ సీఎం చంద్రబాబు మరో వంచనకు తెరలేపారు. కేంద్ర సర్కారు దన్నుతో వేగంగా అడుగులు వేస్తున్నారు. నాటి నుంచి నేటి దాకా అడ్డూ అదుపూ లేని ఏపీ నీటి దోపిడీపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనాలు నేటి నుంచి..
ప్రస్తుతం బచావత్ ట్రిబ్యునల్ అవార్డుకు విభిన్నంగా ఏపీ ప్రభుత్వం జీబీ లింక్‌ను ప్రతిపాదించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదేమంటే ప్రతి సంవత్సరం సగటున దాదాపు 3,000 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్తున్నదని, ఈ ఏడాది కూడా 4 వేల టీఎంసీలకు పైగా గోదావరి జలాలు సముద్రంలోకి వదిలారని ఏపీ అంటున్నది. అందులో కేవలం 200 టీఎంసీలనే తాము మళ్లించుకుం టామని చెప్తున్నది. వరద జలాల ఊసేలేనప్పుడు గంపగుత్తగా నీళ్లు ఎలా తరలిస్తారని నీటి రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
గోదావరి నుంచి మళ్లించే జలాలు: 200 టీఎంసీలు అంచనా వ్యయం : రూ.80 వేల కోట్లు
Godavari Water | హైదరాబాద్, జనవరి 15 (నమస్తే తెలంగాణ): గోదావరి నుంచి సముద్రంలో కలిసే వరద జలాలను పోలవరం నుంచి బనకచర్ల మీదుగా పెన్నా బేసిన్‌కు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా అంతర్రాష్ట్ర రివర్ లింక్ ప్రాజెక్టుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఈ ప్రాజెక్టు కోసం నిధులు మంజూరు చేయాలని ఇటీవలే కేంద్రాన్ని కోరింది. కాగా అది పూర్తిగా ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధమని విమర్శలు వస్తుండగా.. ఇది మరో నీళ్ల కుట్రేనని తెలంగాణ సాగునీటి రంగనిపుణుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇది పూర్తిగా గోదావరి నదినే చెరబట్టేందుకు ఏపీ పన్నుతున్న పన్నాగమన్న వాదనలు వినిపిస్తున్నాయి. పోతిరెడ్డిపాటు హెడ్ రెగ్యులటరీ విస్తరణతో కృష్ణా జలాలను కొల్లగొట్టేందుకు నాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుట్రలు చేస్తే.. నేడు జీబీ లింక్‌తో గోదావరి జలాలను చెరబట్టేందుకు చంద్రబాబు కుతంత్రాలు చేస్తున్నాడని సాగునీటి రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం వరద జలాల మాటున భారీ మొత్తంలో నీటిని తరలించేందుకు తాజాగా ప్రణాళికలు సిద్ధం చేయడమే తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. వాస్తవంగా గోదావరి బేసిన్‌కు సంబంధించి ట్రిబ్యునల్ అవార్డులో వరద జలాల అంశమనేదే లేదని నీటిరంగ నిపుణులు స్పష్టంచేస్తున్నారు. గోదావరి నదీ జలాల పంపిణీకి బచావత్ ట్రిబ్యునల్ ఏర్పాటైన విషయం తెలిసిందే. ట్రిబ్యునల్ ఏర్పాటుకు ముందే అప్పటి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కర్ణాటక రాష్ర్టాలు దాదాపు 10 వరకు అంతర్రాష్ట్ర ఒప్పందాలు చేసుకున్నాయి. ఆ ఒప్పందాలనే ట్రిబ్యునల్ చట్టబద్ధం చేసింది. గోదావరి మొత్తాన్ని 12 సబ్బేసిన్లుగా విభజించింది. 75 శాతం డిపెండబిలిటీపై నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాలు అనే ప్రస్తావన, విభజనలు లేకుండా రాష్ర్టాల మధ్య నీటి పంపకాలు చేపట్టింది. గోదావరి నీటి లభ్యతను అంచనా వేసి రాష్ర్టాలకు వాటాలు కేటాయించింది. కానీ ప్రస్తుతం బచావత్ ట్రిబ్యునల్ అవార్డుకు విభిన్నంగా ఏపీ ప్రభుత్వం జీబీ లింక్‌ను ప్రతిపాదించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదేమంటే ప్రతి సంవత్సరం సగటున దాదాపు 3,000 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్తున్నదని, ఈ ఏడాది కూడా 4 వేల టీఎంసీలకు పైగా నీటిని సముద్రంలోకి వదిలారని చెప్తూ అందులో కేవలం 200 టీఎంసీలనే మళ్లించుకుంటామని ఏపీ చెప్తున్నది. వరద జలాల ఊసేలేనప్పుడు నీళ్లు గంపగుత్తగా ఎలా తరలిస్తారని నీటి రంగ నిపుణుల ప్రశ్నిస్తున్నారు.
బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌కు మళ్లించినట్టయితే, ఎంతనీటిని మళ్లిస్తారో ఆ మేరకు కృష్ణా బేసిన్‌లోని రాష్ర్టాలకు వాటా కేటాయించాల్సి ఉంటుంది. పోలవరం నుంచి 80 టీఎంసీలను నాగార్జునసాగర్ ఆయకట్టుకు మళ్లించారు. ఈ నేపథ్యంలో 80 టీఎంసీల జలాలను కృష్ణా బేసిన్‌లోని నాటి ఉమ్మడి ఏపీకి 45 టీఎంసీలు, కర్ణాటకకు 21, మహారాష్ట్రకు 14 టీంఎంసీల చొప్పున ట్రిబ్యునల్ వాటాను కేటాయించింది. అందుకు ఉమ్మడి ఏపీ ప్రభుత్వం సైతం అంగీకరించింది. ఒకవేళ 80 టీఎంసీలకు మించి గోదావరి నుంచి, కృష్ణా బేసిన్‌కు మళ్లించినా అదే తరహాలోనే కృష్ణా బేసిన్‌లోని రాష్ర్టాలకు మళ్లింపు జలాల్లో వాటా ఇవ్వాల్సి ఉంటుందని బచావత్ ట్రిబ్యునల్ తన అవార్డులో స్పష్టంగా తెలిపింది. ప్రస్తుతం ఏపీ జీబీ లింక్ ద్వారా 200 టీఎంసీలు మళ్లిస్తామని చెప్తున్న బేసిన్ రాష్ర్టాల వాటాపై ప్రస్తావించకపోవడం గమనార్హం. కృష్ణా నీటిలో వచ్చే అదనపు వాటా గురించి స్పష్టమైతేనే అందులో తెలంగాణకు ఎంత వస్తుందనేది తేలుతుంది. కృష్ణాలో తెలంగాణకు వచ్చే అదనపు వాటాను ఎగ్గొట్టడానికే ఏపీ గోదావరిలో లేని వరద జలాల కాన్సెప్టును తెరపైకి తెస్తున్నది. బచావత్ అవార్డులో ఎక్కడా పేర్కొనని విధంగా వరద జలాల పేరిట మళ్లింపు కోసం ప్రాజెక్టు చేపట్టడంపై సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
గోదావరి నది మొత్తం పొడవు 1465 కిలోమీటర్లు. మహారాష్ట్రలో పుట్టి తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్‌కు చేరి ఆపై బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ ప్రస్థానంలో అనేక ఉపనదులు వచ్చి కలుస్తాయి. ప్రధానంగా మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వచ్చి సంగమించే ప్రాణహిత, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా తెలంగాణలో ప్రవేశించి కలిసే ఇంద్రావతి, దిగువన ఏపీలోకి ప్రవేశించగానే వచ్చి చేరే శబరి ఇలా అనేక ఉపనదులు కలిసి గోదావరికి జీవం పోస్తాయి. దశాబ్దాలుగా గోదావరి పరవళ్లను నమోదు చేసిన రికార్డులను తిరగేస్తే ఏటా 3-4 వేల టీఎంసీల జలాలు సముద్రంలో కలుస్తున్నాయనేది సత్యం. అందులోనూ ప్రాణహిత భాగస్వామ్యం సరాసరి 36 శాతం! అంటే 1000-1400 టీఎంసీలు. ఇక ఇంద్రావతి కలిస్తే ఇది 2000-2500 టీఎంసీల వరకు ఉంటుంది. ఇదంతా కేవలం సీజన్లో మాత్రమే ఉంటుంది. వానకాలం ముగిసిందంటే నీరు అందుబాటులో ఉండదు. గోదావరిలో వరద ప్రవాహ రోజుల సగటు సైతం నానాటికీ తగ్గుతున్నది. గతంలో 90 రోజులుగా ఉండగా, ప్రస్తుతం 40-50 రోజులకు మించని దుస్థితి నెలకొన్నది. ఈ లెక్కలన్నీ వదిలి ఏటా భారీగా జలాలు సముద్రంలో కలుస్తున్నాయని చెప్తూ ఇప్పుడు ఏపీ లింక్ ప్రాజెక్టు చేపట్టడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ ఇదే తరహాలో వరద జలాల పేరిట ప్రాజెక్టులు చేపట్టిన ఏపీ సర్కారు, ఆపై ఆయా ప్రాజెక్టులకు నీటి కేటాయింపులకు డిమాండ్ చేయడం, నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా మళ్లించుకోవడం పరిపాటిగా కొనసాగుతున్నదని నీటిరంగ నిపుణులు చెప్తున్నారు. కృష్ణా బేసిన్లో చేపట్టిన అనేక ప్రాజెక్టులను ఈ సందర్భంగా ఉదహరిస్తున్నారు.
నాడు కనీసం తమకు తాగునీటినైనా అందించాలని తమిళనాడు ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని నాటి ఉమ్మడి పాలకులు తమ ప్రాంతానికి అనువుగా మలుచుకున్నారు. కేపీ ప్రాజెక్టులో ప్రతిపాదనల అమలుకు శ్రీకారం చుట్టారు. మిట్టకొండల రిడ్జ్ను కట్ చేసి శ్రీశైలం డ్యామ్ నుంచి నీటిని విడుదల చేసేందుకు 874 అడుగుల ఎత్తు వద్ద పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీని ఏర్పాటు చేసి, అక్కడి నుంచి 1500 క్యుసెక్కుల సామర్థ్యానికి మించని లైనింగ్ చేసిన కెనాల్ ద్వారా పెన్నా వరకు, అక్కడి నుంచి మద్రాసుకు 15 టీఎంసీల నీటిని తరలించాలని ప్రతిపాదించి మొత్తానికి శ్రీశైలం రిజర్వాయర్‌కు గండికొట్టారు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు రాష్ర్టాలకు ఇచ్చిన రీ అడ్జస్ట్మెంట్, రీ అలోకేషన్ స్వేచ్ఛను సీమాంధ్ర ప్రాంతానికి ప్రయోజనం చేకూర్చేందుకు వాడుకుంటూ ఎస్ఆర్బీసీని, తెలుగుగంగ స్కీమ్‌ను తెరమీదికి తెచ్చారు. కాలువ సామర్థ్యాన్ని 11,150 క్యుసెక్కులకు విస్తరించి, ఆచరణలో రెండింతల 20,560 సామర్థ్యంతో ఏర్పాటుచేశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ (పీఆర్పీ) నుంచి బనకచర్ల రెగ్యులేటరీ వద్దకు వెళ్లే కాలువను 11,150 క్యూసెక్కుల సామర్థ్యంతో లైనింగ్ కెనాల్ నిర్మించాల్సి ఉన్నా అందుకు విరుద్ధంగా మొత్తంగా 33,450 క్యూసెక్కుల నీటిని తరలించేలా ముందుగానే ప్రణాళికలు అమలు చేశారు. అడుగడుగునా కుట్రపూరితంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ వ్యవస్థ పనులు 1987-88లో పూర్తి కాగా, నాటి నుంచి బేసిన్ ఆవల ఉన్న ప్రాంతాలకు కృష్ణా జలాల అక్రమ మళ్లింపునకు గేట్లు తెరిచారు.
మొదటి దశలో పోలవరం ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువపై ఏర్పాటు చేసిన తాడిపూడి లిఫ్ట్ ప్రధాన కాలువ ద్వారా జలాలను 175 కిలోమీటర్ల దూరంలోని ప్రకాశం బరాజ్‌కు తరలిస్తారు.
1933 నాటికే నాటి హైదరాబాద్, మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వాలు ఇరు రాష్టాలకు ప్రయోజనం చేకూరేలా కృష్ణా నది దిగువన ఉమ్మడి ప్రాజెక్టు చేపట్టాలన్న అంగీకారానికి వచ్చాయి. నీటి తరలింపునకు అనుకూల పరిస్థితులు లేకపోవడంతో ఉమ్మడి ప్రాజెక్టు నుంచి విరమించుకొని, వేర్వేరుగా డ్యామ్‌లను నిర్మించుకోవాలని నిర్ణయించాయి. ఈ క్రమంలో మద్రాసు ప్రభుత్వం సైతం 1951 నాటికి కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు (కేపీపీ) రిపోర్టును సిద్ధం చేసింది. నేటి శ్రీశైలం డ్యామ్‌కు 87 కిలోమీటర్ల ఎగువన సిద్దేశ్వరం వద్ద డ్యామ్‌ను కట్టి పెన్నాకు నీటిని మళ్లించే కృష్ణా-పెన్నా లింక్ కెనాల్‌ను, ఆ నీటిని నిల్వ చేసేందుకు వీలుగా పెన్నా నదిపై సోమశిల వద్ద డ్యామ్‌ను నిర్మించేలా రూపకల్పన చేసింది. ఆ తర్వాత 1957లో భాషా ప్రయుక్త రాష్ర్టాల ఏర్పాటు, నీటిలభ్యత నేపథ్యంలో ప్రాజెక్టు ఆచరణలోకి రాలేదు. బచావత్ ట్రిబ్యునల్‌కు సైతం శ్రీశైలం కేవలం జలవిద్యుత్తు ప్రాజెక్టేనని రిపోర్టులో నివేదించింది. ఇక్కడి నుంచి సీమ ప్రయోజనాల కోసం ఉమ్మడి పాలకులు కుట్రలకు తెరలేపారు.
2004లో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, తెలంగాణకు తీరని ద్రోహాన్ని తలపెట్టారు. అప్పటికే అనేక అక్రమాలతో ఏర్పాటైన పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ సామర్థ్యాన్ని ఏకంగా రెండింతలు చేసేందుకు పూనుకున్నారు. అల్మట్టి డ్యామ్ కట్టిన తర్వాత కూడా 114 టీఎంసీల నీటిని తరలించవచ్చని, అదీగాక వరద రోజులను 45 నుంచి 30 రోజులకు కుదిస్తూ తప్పుడు లెక్కలు చూపి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ విస్తరణను కుట్రపూరితంగా చేపట్టారు. ఎస్ఆర్బీసీకి 19, తెలుగుగంగకు 44, హెచ్ఎల్ఎస్సీకి 10, తాగునీటి అవసరాలకు 3 టీఎంసీలను, ఇక హెడ్‌రెగ్యులేటరీ వద్ద గాలేరు నగరి సుజల స్రవంతి పేరిట కొత్తగా మరో కాలువ ఏర్పాటు చేసి దానికి 38 టీఎంసీలను కేటాయించారు. పీఆర్పీ సామర్థ్యాన్ని మొత్తంగా 44 వేల క్యూసెక్కులకు పెంచుతున్నట్టు నిర్ణయించారు. అక్కడితో ఆగకుండా అందులోనూ మరో అక్రమానికి తెగబడ్డారు. భవిష్యత్తులోనూ తిరిగి హెడ్‌రెగ్యులేటరీ సామర్థ్యాన్ని 88 వేల క్యూసెక్కులకు పెంచుకునేందుకు అనువుగా కెనాల్ బెడ్ లెవల్ 32 మీటర్ల నుంచి ఏకంగా 78 మీటర్లకు పెంచడంతో పాటు, లైనింగ్ లేని కాలువను ప్రతిపాదించి అప్పుడే పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పరోక్షంగా వైఎస్ 70 వేలకు పెంచారు. అప్పటికే ఉన్న నాలుగు గేట్లను తొలగిస్తామని చెప్పినా నేటికీ ఆ పనిచేయలేదు. దీంతో అదనంగా 10 గేట్లు నిర్మించారు. అయినా వైఎస్ కేవలం నెలల వ్యవధిలోనే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ సామర్థ్య విస్తరణను పూర్తిచేయించి తెలంగాణకు తీరని నష్టాన్ని మిగిల్చారు. వైఎస్సాఆర్ తనయుడు జగన్మోహన్రెడ్డి మరో అడుగు ముందుకేసి శ్రీశైలం రిజర్వాయర్ 797 అడుగుల నుంచే కృష్ణా జలాలను తరలించేందుకు రాయలసీమ లిఫ్ట్ పథకాన్ని చేపట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే 1500 క్యూసెక్కులతో తెరమీదికి వచ్చిన పోతిరెడ్డిపాడు ద్వారా నేడు మొత్తం కృష్ణా నదినే మళ్లించుకునే స్థాయికి చేరిందంటే ఏపీ నీటి కుట్రలు ఏ తీరుగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు గోదావరిపై కూడా అలాంటి కుట్రలకే తెరలేపారని తెలంగాణ నీటిరంగ నిపుణులు చెప్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి, కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ఉద్యమనేతగా కేసీఆర్ గర్జించారు. 60 ఏండ్లపాటు సీమాంధ్ర పాలకులు నీళ్ల దోపిడీకి తెగబడ్డ తీరును బట్టబయలు చేశారు. ప్రొఫెసర్ జయశంకర్, ఇంజినీర్ విద్యాసాగర్‌రావుతో కలిసి నీళ్ల కుట్రలన్నింటినీ పటాపంచాలు చేశారు. ఉద్యమం ఊపందుకున్న సమయంలో పోతిరెడ్డిపాడు విస్తరణకు నాటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పూనుకున్నారు. వైఎస్ చర్యలతో తెలంగాణకు వాటిల్లబోయే నష్టాన్ని గ్రహించిన ఉద్యమనేత, నాటి కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం నుంచే బయటకు వచ్చేశారు. మంత్రి పదవులకు రాజీనామా చేసి ఉద్యమించారు. దేవాదుల కోసం అలుపెరగని పోరాటం చేశారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం కృష్ణా, గోదావరిలో తెలంగాణకు దక్కే న్యాయమైన వాటా సాధనకు, జలాల వినియోగానికి పక్కా ప్రణాళికతో ముందుకుసాగారు. తెలంగాణ ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఎన్జీటీ మొదలు సుప్రీంకోర్టు, ట్రిబ్యునల్, సదరన్ జోనల్ కౌన్సిల్ వరకు అన్ని వేదికలపైనా కుట్రలకు తెరలేపినా కేసీఆర్ మొక్కవోని దీక్షతో వాటన్నింటినీ అధిగమించారు. కృష్ణాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయడమేగాక, చిరకాల స్వప్నం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను సాకారం చేశారు. ఏపీ పునర్విభజన చట్టం 2014 సెక్షన్ 89 ప్రకారం తెలుగు రాష్ర్టాల మధ్య ప్రాజెక్టుల వారీగా నీటిని కేటాయించాలని గతంలో కేంద్ర మార్గదర్శకాలను సవాల్ చేశారు. అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం 1956లోని సెక్షన్ 3 ప్రకారం విచారణాధికారం ట్రిబ్యునల్‌కే కల్పించాలని పట్టుబట్టి సాధించారు. మాజీ సీఎం కేసీఆర్ అవిశ్రాంత కృషి, తెలంగాణ సర్కారు అలుపెరగని పోరా టంతో ఎట్టకేలకు కేంద్ర సర్కారు దిగివచ్చి గత అక్టోబర్‌లోనే నూతన మార్గదర్శకాలను జారీ చేయగా, ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నది. కాళేశ్వరం, సీతారామ, సమ్మక్కసాగర్ ద్వారా గోదావరి జలాల్లో తెలంగాణ వాటాను సద్వినియోగం చేసుకునే ప్రణాళికను పూర్తిచేశారు. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోవడం, కాంగ్రెస్ సర్కార్ రావడంతో మరోసారి ఏపీ పాలకులు కుట్రకు తెరలేపారు. కేంద్రం సైతం ఇటీవల మూడు ప్రాజెక్టుల డీపీఆర్‌లను వెనక్కిపంపింది.
ఆంధ్రప్రదేశ్ నలు చెరగులా సాగునీరందించే లక్ష్యంతో గోదావరి-బనకచెర్ల (జీబీ) లింక్ ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్టు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఇటీవల వెల్లడించారు. జీబీ లింక్ ప్రాజెక్టును గేమ్‌చేంజర్‌గా, గేట్ వే ఆఫ్ రాయలసీమగా అభివర్ణించారు. వీలైనంత త్వరగా పనులు కూడా చేపడతామని మీడియా ముఖంగా ప్రతిజ్ఞ కూడా చేశారు. మొదటిదశలో పోలవరం ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువపై ఏర్పాటుచేసిన తాడిపూడి లిఫ్ట్ ప్రధాన కాలువ ద్వారా జలాలను 175 కిలోమీటర్ల దూరంలోని ప్రకాశం బరాజ్‌కు తరలిస్తారు. రెండో దశలో అక్కడి నుంచి జలాలను ఆరు దశల్లో లిఫ్ట్ చేస్తారు. 84వ కిలోమీటరు వద్ద 150 టీఎంసీల సామర్థ్యంతో బొల్లపల్లి రిజర్వాయర్‌ను నిర్మించి గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లిస్తారు. మూడోదశలో బొల్లపల్లి నుంచి 110 కిలోమీటర్ల కాలువ ద్వారా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ దిగువన ఉన్న బనకచర్ల రెగ్యులేటర్‌కు గోదావరి జలాలను (పెన్నాబేసిన్‌కు) తరలిస్తారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలతోపాటు రాయలసీమ జిల్లాలన్నింటికీ సాగునీరందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ లింక్ ప్రాజెక్టుకు దాదాపు రూ.80,112 కోట్లు అవసరమని అంచనా వేశారు. నిధుల కోసం కేంద్ర ఆర్థికమంత్రిని కలిసి విజ్ఞప్తిచేశారు. పీపీపీ మోడ్‌తో సహా ఫైనాన్స్ కోసం వివిధ మార్గాలను కూడా అన్వేషిస్తున్నారు.
– మ్యాకం రవికుమార్