Hyderabad | హైదరాబాద్, మే 31(నమస్తే తెలంగాణ): పదేండ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలన్న గడువు జూన్ 2తో ముగుస్తుండటంతో ఏపీ నేతలు మళ్లీ ఉమ్మడి కుట్రలకు తెరలేపుతున్నారు. ఉమ్మడి రాజధాని పేరుతో తెలంగాణపై పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరికొన్నేండ్లు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలంటూ కుట్రల రాగం ఎత్తుకున్నారు. మొన్నటికి మొన్న వైసీపీ కీలక నేతలు వైవీ సుబ్బారెడ్డి, పెద్దారెడ్డి హైదరాబాద్‌ను మరికొంత కాలం ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేయగా, తాజాగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా అదే పాట అందుకున్నారు. రాష్ట్ర విభజన చట్టంలో హైదరాబాద్‌ను పదేండ్ల పాటు ఉమ్మడి రాజధానిగా పేర్కొన్నారు. ఈ గడువు ఆదివారంతో ముగుస్తున్నది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌పై హక్కులు కోల్పోతున్నామనే ఆక్రోశంతో దీనిని అడ్డుకునేందుకు తమదైన రాజకీయాలకు తెరలేపుతున్నారు.
ఆది నుంచి ఏపీ నేతల కన్నంతా హైదరాబాద్‌పైనే ఉన్నది. రాష్ట్ర విభజన సమయంలోనే హైదరాబాద్‌ను తెలంగాణకు దక్కకుండా చేయాలని కుట్ర పన్నారు. వారి కుట్రలను ఉద్యమ నేత కేసీఆర్ పటాపంచలు చేశారు. హైదరాబాద్ లేకుండా తెలంగాణ ఇవ్వడమంటే తలకాయ లేకుండా మొండెం ఇవ్వడమేనంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. మొత్తానికి హై దరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ర్టా న్ని ఏర్పాటుచేశారు. అయినా ఏపీ నేతల కుట్రలు ఆగలేదు. ఏ విధంగానైనా హైదరాబాద్‌ను తెలంగాణకు దక్కకుండా చేయాలనే కుట్రలతో ఉమ్మడి రాజధాని అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. కొత్తగా ఏర్పడిన రాష్ర్టానికి రాజధాని ఏర్పాటుకు సమయం పడుతుంది కాబట్టి పదేండ్ల పాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలని పట్టుబట్టారు. అప్పటి కేంద్ర ప్రభుత్వం ఇందుకు అంగీకరించింది. ఇప్పుడు ఉమ్మడి రాజధాని గడువు ముగుస్తుండడంతో మళ్లీ కుట్రలకు తెరలేపారు.
హైదరాబాద్‌పై విషం కక్కడం వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డితో మొదలైంది. ఈ ఏడాది మొదట్లో ఉమ్మడి రాజధానిపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీ మూడు రాజధానుల అంశం న్యాయపరమైన వివాదాలతో కోర్టులో పెండింగ్‌లో ఉన్నదని, ఏపీకి రాజధాని తేలేవరకు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. సుబ్బారెడ్డి డిమాండ్‌కు వైసీపీ మరో కీలక నేత పెద్దారెడ్డి వంత పాడారు. సుబ్బారెడ్డి డిమాండ్ లో ఏ మాత్రం తప్పులేదని, మరికొంత కా లం హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని పేర్కొన్నారు. వీరి వ్యా ఖ్యలపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. ఏపీ వైసీపీ నేతల వ్యాఖ్యలపై అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖం డించడంతో పాటు ఎదురుదాడికి దిగింది. హైదరాబాద్ తెలంగాణ సొం తమని, దీని జోలికొస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించడంతో ఏపీ నేతలు ఉమ్మడి రాజధానిపై వ్యాఖ్యలు చేయడం ఆపేశారు. ఇప్పుడు తాజాగా జై భారత్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మరోసారి ఈ తేనెతుట్టెను కదిపారు. ఈనెల 25న ఈ అంశంపై ‘ఎక్స్’లో పోస్ట్ చేస్తూ ఏపీకి రాజధాని తేలేవరకు హైదరాబాద్‌ను మరో పదేండ్లపాటు ఉమ్మ డి రాజధానిగా కొనసాగించాలని, ఇందుకోసం రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేయాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలంటూ ఏపీ నేతలు వరుసగా డిమాండ్ చేస్తుండడంపై తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గడువు ముగిసింది కాబట్టి పొడిగించే ప్రసక్తే లేదని, అలా చేస్తే మరో ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లేనిపక్షంలో హైదరాబాద్‌ను తెలంగాణకు దక్కకుండా చేస్తారని హెచ్చరిస్తున్నారు.
గతంలో వైసీపీ నేతలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను కొనసాగించాలని డి మాండ్ చేస్తే వెంటనే స్పందించిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వారికి కౌంటర్ ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతున్నది. ఉమ్మడి రాజధాని అంశంపై లక్ష్మీనారాయణ తన అభిప్రాయం వ్యక్తంచేసి మూడు రోజులు గడుస్తున్నా ఒక్కరంటే ఒక్క కాంగ్రెస్ మంత్రి, నేత కూడా ఖండించకపోవడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ పరిస్థితి విచిత్రంగా తయారైంది. రాష్ట్ర విభజన జరిగి పదేండ్లు పూర్తవుతున్నప్పటికీ ఇప్పటికీ రాజధాని లేని రాష్ట్రంగానే మిగిలిపోయింది. విభజిత ఏపీ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ మూడు రాజధానుల ఏర్పాటును ఎజెండాగా పెట్టుకున్నది. ఇది కోర్టుకు చేరడంతో ఇప్పటివరకు ఏపీకి రాజధాని లేదు. అక్కడ రాజధాని వివాదాన్ని పరిష్కరించుకోవడంలో విఫలమైన ఏపీ నేతలు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలంటూ చేస్తున్న డిమాండ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఏపీ మూడు రాజధానుల అంశం న్యాయపరమైన వివాదాలతో కోర్టు లో పెండింగ్‌లో ఉన్నది. ఏపీ రాజధాని తేలేవరకు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలి.
– వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి (ఫిబ్రవరి 13, 2024)
హైదరాబాద్‌ను మరికొంత కాలం ఉమ్మడి రాజధానిగా కొనసాగించడం మంచిదే. వైవీ డిమాండ్‌లో తప్పులేదు.
– వైసీపీ నేత పెద్దారెడ్డి
ఏపీకి రాజధాని ఏదో ఇంకా తేలలేదు. జూన్ 2తో హైదరాబాద్ ఉమ్మ డి రాజధాని గడువు ముగుస్తున్నది. మరో పదేండ్లపాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలి. ఈ అంశాన్ని రాష్ట్రపతి పరిగణనలోకి తీసుకొని ఆర్డినెన్స్ జారీ చేయాలి.
– సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ (మే 25, 2024)
ఏపీకి రాజధాని తేలేవరకు అవసరమైతే 30 ఏండ్లు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలి.
– నాగార్జున యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ ధర్నా (జూన్ 29, 2022)