హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో తనపై నమోదైన కేసును రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ ఈ నెల 19కి వాయిదా పడింది. కౌంటర్ దాఖలుకు సమయం కావాలని సీఐడీ కోరడంతో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 18లోగా కౌంటర్ వేయాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. చంద్రబాబు కస్టడీ కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్‌ను ఈ నెల 18 వరకూ విచారించవద్దని హైకోర్టు ఆదేశించింది. చంద్రబాబును 5 రోజుల కస్టడీ కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని.. చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ మేరకు సీఐడీ పిటిషన్‌పై ఎలాంటి విచారణ జరుపవద్దని ఏసీబీ కోర్టును హైకోర్టు ఆదేశించింది.
రాజధాని ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసు పిటిషన్‌పై విచారణ కూడా ఈ నెల 19కి వాయిదా పడింది. సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు తరపున హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా.. కౌంటర్ దాఖలుకు సీఐడీ సమయం కోరింది. రాజధాని నగర బృహత్ ప్రణాళిక, ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్మెంట్ నిర్ణయం వ్యవహారంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని సీఐడీ తనపై నమోదు చేసిన కేసులో బెయిల్ కోసం చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు.
హైకోర్టులో విచారణ ప్రారంభానికి ముందు జస్టిస్ శ్రీనివాస్‌రెడ్డి ఇరుపక్షాల న్యాయవాదులతో మాట్లాడుతూ.. తాను గతంలో ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశానని, దీనిని అడ్డంకిగా భావిస్తే.. ఈ కేసును మరో బెంచ్‌కు బదిలీ చేస్తానని చెప్పారు. ఇరుపక్షాల న్యాయవాదులు తమకు అభ్యంతరం లేదని తేల్చిచెప్పారు.
13 చోట్ల చంద్రబాబు
చంద్రబాబు క్యాబినెట్ అనుమతి లేకుండా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ తెలిపారు. కార్పొరేషన్ ఏర్పాటులో విధి విధానాలు పాటించలేదని, ప్రైవేట్ వ్యక్తి గంటా సుబ్బారావుకు మూడు బాధ్యతలు అప్పగించారని చెప్పారు. జీవోల్లో 13 చోట్ల చంద్రబాబు సంతకాలు చేశారని తెలిపారు. సిమెన్స్ను తెచ్చి స్కిల్ సెంటర్లు పెట్టాలన్నది ఎంవోయూలో లేదని, అగ్రిమెంట్ దురుద్దేశపూర్వకంగా చేసుకున్నారని ఆరోపించారు.