ఏపీ సీఎం చంద్రబాబుతో చెప్పి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను తానే నిలిపివేయించానంటూ అసెంబ్లీ వేదికగా తెలంగాణ సీఎం రేవంత్ ప్రకటించిన గంటల్లోనే అదంతా అబద్ధమని తేలిపోయింది. ఆ పనులు 2020లోనే అప్పటి ప్రభుత్వం (కేసీఆర్ సర్కార్) ఫిర్యాదుతో ఆగిపోయిందని ఆదివారం ఏపీ ప్రకటించింది. రాజకీయ ప్రయోజనం కోసమే రేవంత్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తంచేసింది.
హైదరాబాద్, జనవరి4 (నమస్తే తెలంగాణ) : కృష్ణా జలాలను దోచుకెళ్లేందుకు ఏపీ రాయలసీమ లిఫ్ట్ పెట్టినా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పట్టించుకోలేదంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలే అని మరోసారి తేలిపోయింది. బాబుకు చెప్పి తానే సీమ లిఫ్ట్ పనులు ఆపివేయించానన్నదీ అబద్ధమేనని స్పష్టమైంది. రాయలసీమ లిఫ్ట్ పనుల నిలిపివేతకు తమ ప్రభుత్వానికి సంబంధమే లేదని ఏపీ సర్కార్ కుండబద్ధలుకొట్టింది. 2020లోనే పనులు నిలిచిపోయాయని ప్రకటించింది. పాలమూరు ఎత్తిపోతల పథకానికి నాడు కేసీఆర్ ప్రభుత్వం 90 టీఎంసీల జలాలను కేటాయించగా, ఇటీవల కాంగ్రెస్ సర్కార్ కేవలం 45 టీఎంసీలకు కుదించింది.
ఈ క్రమంలోనే రేవంత్ ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులు చెరగడం, ఆ హడావుడిలో ఏదో చేయాలని ‘కృష్ణా జలాల’ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్చను నిర్వహించడం అంతా తెలిసిందే. చర్చలో భాగంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చేపట్టినా నాటి సీఎం కేసీఆర్ అడ్డుకోలేదంటూ సీఎం రేవంత్రెడ్డి ఆరోపించి నిజాలను వక్రీకరించే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా “రెండు రాష్ర్టాల మధ్య మంచి వాతావరణం ఉండాలని ఇప్పటిదాకా నేను సాధించిన విజయాలను చెప్పుకోలేదు. ఏపీ సీఎం చంద్రబాబుతో ఏకాంతంగా సమావేశమైనప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పనులను నిలిపేయాలని స్వయంగా విజ్ఞప్తి చేశాను. నా మీద గౌరవంతో చంద్రబాబు ఆ పనులను ఆపేశారు. కావాలంటే నిజనిర్ధారణ కమిటీ వేసి, అక్కడి పంపండి” అంటూ ప్రగల్భాలు పలికారు. దీంతో సీఎం రేవంత్రెడ్డి మాటలపై ఏపీ ప్రభుత్వం తీవ్ర అసహనం వ్యక్తం చేయడమే కాకుండా ఆగ్రహంతో ఈ మేరకు ఆదివారం ఒక ఘాటైన ప్రకటన విడుదల చేసింది.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు తెలంగాణ ప్రయోజనాల కోసం నిలిపివేశారని సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏపీ సర్కారు తీవ్రంగా ఖండించింది. కేవలం రాజకీయ లబ్ధి కోసమే రేవంత్రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని, ఆయన మాటలు పూర్తిగా అసంబద్ధంగా ఉన్నాయని చంద్రబాబు ప్రభుత్వం తేల్చిచెప్పింది. “అనుమతులు లేకుండానే జగన్ హయాంలో రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు పనులు చేపట్టారు. ఆ పనులపై తెలంగాణ ప్రభుత్వం (కేసీఆర్) కోర్టులో కేసులు వేసింది. ఎన్జీటీతోపాటు, పలు కేంద్ర సంస్థలకు ఫిర్యాదు కూడా చేసింది.
ఫిర్యాదులు విచారించి అనుమతులు లేనందునా పనులు నిలిపివేయాలని 2020లోనే ఎన్జీటీ, కేంద్రం ఆదేశాలు ఇచ్చాయి. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే లిఫ్ట్ పనులు కేంద్రం ఆపేయించింది” అని ఏపీ ప్రభుత్వం స్పష్టంగా ప్రకటనలో పేర్కొన్నది. అంతేకాకుండా రాష్ట్ర నీటి హక్కుల విషయంలో రాజీపడే ప్రసక్తే ఉండబోదని తేల్చి చెప్పింది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రకటనతో కేసీఆర్పై కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలన్నీ పచ్చి అబద్ధాలు, కల్పనలే అని మరోసారి తేలిపోయింది.