హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): జల వివాదాల పరిష్కారం కోసం కమిటీ ఏర్పాటుచేయాలన్న అంశంపై కేంద్ర ప్రభుత్వంపై ఏపీ సర్కారు ఒత్తిడి చేస్తున్నది. కేంద్ర జల్‌శక్తి శాఖ అధికారులను ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్టు తె లుస్తున్నది. ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో ఇటీవ ల ఇరు రాష్ర్టాల సీఎంలు సమావేశమ య్యారు. జల వివాదాల పరిష్కారానికి కేంద్రం, ఇరు రాష్ర్టాల అధికారులతో ప్ర త్యేక కమిటీని వారంలోగా ఏర్పాటు చేసి, నెల రోజుల్లోగా రిపోర్ట్ తీసుకోవాలని ఆ భేటీలో నిర్ణయించారు.
అందుకు అనుగుణంగా తొలుత 12 మందితో కమిటీ వే యాలని ఏకాభిప్రాయానికి రాగా, కేంద్రం నుంచి జల్‌శక్తి శాఖ సెక్రటరీ, సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) సీఈలు కమిటీకి నేతృత్వం వహించాలని, ఏపీ, తెలంగాణ నుంచి ఐదుగురు చొప్పున అ ధికారులకు కమిటీలో సభ్యులుగా చోటు కల్పించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఏపీ సర్కారు ఇప్పటికే ముగ్గురితోనే కమిటీని ఏర్పాటుచేసింది. ఏపీ జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, జలవనరుల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నర్సింహమూర్తితో కమిటీని ఖరారు చేసి కేంద్ర జల్‌శక్తి శాఖకు ప్రతిపాదనలు పంపింది. తెలంగాణ సర్కారు ఇంకా కమిటీని ఖరారు చేయలేదు.
ఈ నేపథ్యంలో ఈ విషయమై ఏపీ తాజాగా కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తున్నది. తాజాగా ప్రగతి సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన ఏపీ అధికారులు కేంద్ర జల్‌శక్తి శాఖ అధికారులపై ఇదే విషయమై పదే పదే ప్రశ్నించినట్టు తెలిసింది. ముందుగా కేంద్ర జల్‌శక్తి శాఖ నుంచి అధికారులను నియమించాలని కూడా ప్రతిపాదన చేసినట్టు విశ్వసనీయ సమాచారం. అయితే, తెలంగాణ రాష్ట్రం కమిటీని ఖరారు చేసి పంపించిన తరువాతే తాము అధికారులను నియమిస్తామని కేంద్ర జల్‌శక్తి శాఖ వెల్లడించినట్టు తెలిసింది. అయితే ఏపీ మాత్రం కమిటీ ఏర్పాటుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నట్టు ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి.