హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బేసిన్లో పలు ప్రాజెక్టుల విస్తరణ, కొత్త ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టేందుకు సిద్ధమైందని, వాటి డీపీఆర్‌లకు ఎలాంటి అనుమతులు ఇవ్వకుండా సీడబ్ల్యూసీకి ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర జల్‌శక్తి శాఖకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తి శాఖకు ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి సాయిప్రసాద్ లేఖ రాశారు. కృష్ణా బేసిన్లో పలు ప్రాజెక్టుల విస్తరణ, కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి ఆమోదం తెలుపుతూ తెలంగాణ ప్రభుత్వం గత సెప్టెంబర్‌లో జీవో-34 విడుదల చేసిందని పేర్కొన్నారు.
అందులో ర్యాలంపాడు, గట్టు రిజర్వాయర్లు, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్‌సాగర్, శ్రీశైలం ఎడమకాలువ విస్తరణ, నీటి వినియోగాన్ని పెంచడంతోపాటు ఆకేరు, మున్నేరులపై కొత్తగా బరాజ్‌ల నిర్మాణం, పలుచోట్ల నూతన లిఫ్ట్‌లు, రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించిందని వివరించారు. ఈ జీవోపై ఇప్పటికే కేఆర్ఎంబీ (కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు)కి కూడా ఏపీ ఈఎన్సీ ఫిర్యాదు చేశారు. తాజాగా కేంద్ర జల్‌శక్తి శాఖకు ఏపీ జలవనరుల శాఖ మరోసారి ఫి ర్యాదు చేసింది. ఆయా ప్రాజెక్టులకు అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేవని, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టానికి విరుద్ధమని తెలిపింది. ఆ ప్రాజెక్టుల డీపీఆర్‌లకు అనుమతులు ఇవ్వకూడదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నది.
కేఆర్ఎంబీలో డిప్యుటేషన్‌కు అవకాశం
హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)లో తెలంగాణకు సంబంధించి ఖాళీగా ఉన్న పలు పోస్టుల్లో డిప్యుటేషన్‌పై పనిచేసేందుకు ఆసక్తి ఉన్న ఇంజినీర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు ఈఎన్సీ అడ్మిన్ మరోసారి సర్క్యులర్ చేశారు. కేఆర్ఎంబీలో తెలంగాణకు సంబంధించి ఒక ఈఈ పోస్టు, రెండు డీఈఈ (సివిల్, ఎలక్ట్రికల్) పోస్టులు, నాలుగు ఏఈఈ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలిపారు. ఆసక్తి ఉన్న ఇంజినీర్లు దరఖాస్తులు 23వ తేదీలోగా పంపాలని సర్కిల్ ఆఫీసర్లకు సూచించారు.