Palamuru | హైదరాబాద్, మార్చి 4 ( నమస్తే తెలంగాణ ): రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం మొండి వైఖరి వీడటం లేదు. అది అక్రమ ప్రాజెక్టు కాదని, పాత ప్రాజెక్టేనని, దాని నిర్మాణానికి ఎలాంటి పర్యావరణ అనుమతి అవసరం లేదని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ మంగళవారం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో కౌంటర్ దాఖలు చేశారు. తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు అనుమతులు లేవని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ, పర్యావరణ అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను చేపడుతున్నారని తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ ఎన్జీటీలో పిటిషన్ వేయడంతో ఏపీ సీఎస్ ఈ కౌంటర్ దాఖలు చేశారు. ఏపీ పునర్వ్యస్థీకరణ చట్టం ప్రకారం కృష్ణా బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తర్వాతే కొత్త ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాల్సి ఉన్నప్పటికీ ఏపీ సర్కారు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం కోసం 2020 మే 5న జీవో 203 జారీ చేసింది.
తెలంగాణపై ఏపీ ఎన్ని ఆరోపణలు చేస్తు న్నా, అక్రమంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మిస్తున్నా రేవంత్రెడ్డి ప్రభుత్వం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నది. ఏపీ సీఎం చంద్రబాబు వైఖరిని ఎండగట్టాల్సిన రేవంత్రెడ్డి మౌనం వహించడంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం కొనసాగుతూనే ఉన్నది. కేసీఆర్ హయాంలో ఈ ప్రాజెక్టు ని ర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఆ ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయని పలుమార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభు త్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యహరిస్తున్నది. పర్యావరణ అనుమతులు లేని రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మించొద్దని 2021 డిసెంబర్ 17న ఎన్జీటీ తీర్పు ఇవ్వడంతో ఏపీ ప్రభుత్వ ఆ పనులను తాత్కాలికంగా నిలిపివేసింది. కానీ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్రెడ్డి ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోకపోవడంతో ఏపీ సర్కారు వేగంగా ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తోంది. దీంతో ఆ పనులను అడ్డుకోవాలని రేవంత్రెడ్డి సర్కారు కంటితుడుపు చర్యగా కేంద్రానికి, కేఆర్ఎంబీకి లేఖలు రాసి చేతులు దులుపుకున్నది. ఓవైపు సొంత జిల్లాలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పక్కనపెట్టిన రేవంత్రెడ్డి మరోవైపు రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై అభ్యంతరం చెప్పకపోవడంపై అనుమానాలొస్తున్నాయి.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం అక్రమం కాదని, అది పాత ప్రాజెక్టేనని, దానికి ఎలాంటి పర్యావరణ అనుమతి అవసరం లేదని ఏపీ కౌంటర్ దాఖలు చేయడం దారుణం. ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేసిన ఏపీ.. తెలంగాణలో నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి లేదని ఆరోపించడం విడ్డూరం. పర్యావరణ అనుమతులు ఉంటేనే కొత్త ప్రాజెక్టు కట్టాలని గతంలో ఎన్జీటీ స్పష్టం చేసినపప్పటికీ ఏపీ మొండి వైఖరి వీడటం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సీఎం రేవంత్రెడ్డి ఈ అంశంపై వెంటనే స్పందించాలి.