Srisailam | కొల్లాపూర్, నవంబర్ 16: కృష్ణా జలాలను ఏపీ అడ్డూ అదుపూ లేకుండా తరలించుకుపోతున్నది. కాల్వల ద్వారా నీటిని ఎక్కువ మొత్తంలో తరలిస్తున్నది. ఈ తరలింపును ఇప్పటికైనా అడ్డుకోకపోతే ముప్పు ముంచుకొచ్చే ప్రమాదం నెలకొన్నది. ఇప్పటికే నిండుకుండలా ఉన్న శ్రీశైలం డ్యాం రెండు నెలల్లో ఖాళీ అవుతుందన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతున్నది. రేవంత్ సర్కారు ఇప్పటికైనా మేల్కొని శ్రీశైలం ప్రాజెక్టులో నీటినిల్వలు కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. లేనిపక్షంలో ఇటు పంటలకు, అటు తాగునీటికి రాబోయే రోజుల్లో గడ్డుకాలం తప్పదని రైతులు వాపోతున్నారు. పోతిరెడ్డిపాడు కాల్వ ద్వారా ఏపీ కృష్ణా జలాలను భారీగా తరలించుకుపోతున్నది.
కొల్లాపూర్ మండలంలోని సోమశిల వద్ద ఉన్న కృష్ణా అవతలి వైపు పోతిరెడ్డిపాడు కాల్వలో రోజుకు 24 వేల క్యూసెక్కులు(2 టీఎంసీలు) తరలించాల్సి ఉండగా.. ప్రస్తుతం 36 వేల క్యూసెక్కులు(3 టీఎంసీలు) తరలించుకోపోతున్నది. దీనికితోడు హంద్రీనివా, ముచ్చుమర్రి, మల్యాల ప్రాజెక్టుల నుంచి కూడా రోజుకు 12 వేల క్యూసెక్కుల (టీఎంసీ వరకు) నీటి తరలింపు కొనసాగుతున్నది. దిగువ ప్రాంతంలో రాయలసీమ ఉండడంతో నది నుంచి నీరంతా వేగంగా అక్కడి కాల్వల ద్వారా పారుతోంది.
మహాత్మాగాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం(ఎంజీకేఎల్) ద్వారా రోజుకు 4 వేల క్యూసెక్కులు మాత్రమే మనం ఎత్తిపోసుకుంటున్నాం. పాలమూరు-రంగారెడ్డి (పీఆర్ఎల్ఐ) ద్వారా నీటి పంపింగ్ కొనసాగడం లేదు. దీంతో తెలంగాణ తీవ్రంగా నష్టోపోతున్నది. బ్యాక్ వాటర్‌ను ఇలాగే తోడిపోస్తే రెండు నెలల్లో శ్రీశైలం ఖాళీ కావడం ఖాయమని ఓ అధికారి తెలిపారు. శ్రీశైలం జలాశయంలో శుక్రవారం నాటికి 875.6 అడుగుల నీటిమట్టం నమోదైంది.
ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లోని 10 లక్షల ఎకరాలకు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని 2.30 లక్షల ఎకరాలకు సాగు, తాగునీటికి, పరిశ్రమలకు నీటిని అందించేలా నిర్మించారు. లిఫ్ట్-1లోని నార్లాపూర్ రిజర్వాయర్ 6.40 టీఎంసీలు(9 టీఎంసీల పెంపునకు అవకాశం), వీరాంజనేయ రిజర్వాయర్ 6.55 టీఎంసీలు, వెంకటాద్రి రిజర్వాయర్ 16.74 టీఎంసీలు, కురుమూర్తిరాయ రిజర్వాయర్ 19 టీఎంసీలు, ఉద్ధండాపూర్ రిజర్వాయర్ 16.03 టీఎంసీలు, కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ 2.80 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టును డిజైన్ చేశారు. ఈ లిఫ్ట్‌నకు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నీటిని తీసుకోవాలంటే డ్యాం నీటిమట్టం 800 అడుగులు ఉండాలి. ఐదు రిజర్వాయర్ల పనులన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు 95 శాతం పనులు పూర్తవగా.. 70 టీఎంసీల సామర్థ్యంతో వీటిని నిర్మించారు. ప్రతి రిజర్వాయర్‌లో 9 మోటర్లు బిగించారు. అంతటి పెద్ద ప్రాజెక్టును ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. రేవంత్ ప్రభుత్వం వచ్చి 11 నెలలైనా పనులపై దృష్టి సారించలేదు. గతేడాది సెప్టెంబర్ 16వ తేదీన కొల్లాపూర్ సమీపంలోని మొదటి లిఫ్ట్‌ను నాటి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. తర్వాత నార్లాపూర్ రిజర్వాయర్‌ను నీటిని నింపారు. కానీ నేడు రిజర్వాయర్లలోకి చుక్క నీటిని కూడా తరలించలేదు.
శ్రీశైలం నిల్వ నీటి తరలింపులో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆరోపణలు ఉన్నాయి. దీంతో కాల్వల ద్వారా ఏపీ ఎక్కువ మొత్తంలో జలాలను పారిస్తుండగా.. తెలంగాణ తక్కువ మొత్తంలో రెండు ఎత్తిపోతల ద్వారా తరలిస్తున్నది. నీటి తరలింపులో ముందస్తు ప్రణాళిక లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు వరప్రదాయిని ఎంజీకేఎల్‌ఐకి బ్యాక్ వాటర్ 824 అడుగుల వద్ద మాత్రమే నీటిని డ్రా చేసుకొనే అవకాశం ఉంటుందని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిసింది. ఎంజీకేఎల్ఐ నుంచే మిషన్ భగీరథ పథకానికి నీటిని వినియోగిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఎల్లూరు రిజర్వాయర్‌లో ఉన్న 0.35 టీఎంసీలు కేవలం పది రోజులు తాగునీటిని అందించేందుకే మాత్రమే సరిపోతాయని అధికారులు చెబుతున్నారు.