KRMB | హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ) : కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)లో ఏపీ పెత్తనమే కొనసాగుతున్నది. బోర్డులో తెలంగాణకు సంబంధించిన పోస్టులన్నీ సుదీర్ఘకాలం నుంచి ఖాళీగా ఉన్నా, వాటి భర్తీకి ప్రభుత్వం చొరవ చూపడం లేదు. బోర్డు విశాఖకు తరలుతుందన్న ఉద్దేశంతో రాష్ట్ర అధికారులు బోర్డులోకి వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇదే అదునుగా ఏపీకి అనుకూలంగా బోర్డు పావులు కదుపుతున్నట్టు తెలుస్తున్నది. బోర్డులో ఖాళీ పోస్టులన్నింటినీ ఏపీ అధికారులతో నింపేందుకు సన్నద్ధమవుతున్నదని విశ్వసనీయ సమాచారం. విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీ, వివాదాల పరిష్కారానికి రివర్ బోర్డులు ఏర్పాటయ్యాయి. ఈ బోర్డుల్లో చైర్మన్, మెంబర్ సెక్రటరీ, ఇద్దరు మెంబర్లను కేంద్రం నియమిస్తుంది. మిగతా బోర్డు సెక్రటేరియట్లో ఇరు రాష్ర్టాల నుంచి ఎస్ఈలు, ఈఈలు, డీఈఈ, ఏఈఈలు సమాన నిష్పత్తిలో నియమించుకుంటారు.
కేఆర్ఎంబీలో 2 ఎస్ఈ (సూపరింటెండెంట్ ఇంజినీర్), 4 ఈఈ (ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్), 6 డీఈఈ (డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్), 10 ఏఈఈ (అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్) పోస్టులు మొత్తం 22 ఉన్నాయి. ఆ పోస్టులను ఇరు రాష్ర్టాలకు సంబంధించిన అధికారులతో సమాన నిష్పత్తిలో భర్తీ చేయాలి. ఇవి గాకుండా ఎలక్ట్రికల్ ఇంజినీర్, అకౌంట్స్ ఆఫీసర్, సూపరింటెండెంట్, సీనియర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులున్నాయి. అయితే ఏపీకి సంబంధించిన 50% పోస్టులన్నీ ఆ రాష్ట్ర అధికారులతో భర్తీ చేశారు. ప్రస్తుతం తెలంగాణకు సంబంధించి 50% కోటాలో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక ఈఈ పోస్టు ఇప్పటికీ ఖాళీ ఉన్నది. వచ్చేనెలలో మరో ఈఈ పోస్టు ఖాళీ కానున్నది. 5 ఏఈఈ పోస్టుల్లో ఒక్క ఏఈఈ మాత్రమే ఉండగా, నాలుగు పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఉన్న ఆ ఒక్క ఏఈఈ పదవీకాలం వచ్చే నెలతో ముగియనున్నది. దీంతో ప్రస్తుతం బోర్డులో కీలక వ్యవహారాలన్నీ ఏపీ అధికారులే చక్కబెడుతున్నారు. బోర్డులో తెలంగాణ గొంతుకను, అభిప్రాయాలను బలంగా వినిపించే అనుభవజ్ఞులు లేకుండాపోయారు.
తెలంగాణ కోటాకు సంబంధించిన పోస్టుల భర్తీకి ఆసక్తి ఉన్న ఉద్యోగుల నుంచి తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ ఇప్పటికే గత మార్చి నుంచి దాదాపు 4 దఫాలుగా దరఖాస్తులను కోరింది. అయితే, కేఆర్‌ఎంబీలోకి డిప్యుటేషన్‌పై వెళ్లేందుకు రాష్ట్ర ఇరిగేషన్ ఉద్యోగులెవరూ ఆసక్తి చూపడం లేదు. కేఆర్ఎంబీని త్వరలోనే ఏపీకి తరలిస్తారనే ప్రచా రం కొనసాగుతున్నది. ఒకవేళ అదే జరిగితే ఏపీకి వెళ్లి విధులు నిర్వర్తించాల్సి వస్తుందనే కారణంతో ఎవరూ ముందుకు రావడంలేదని తెలుస్తున్నది. బోర్డులో పనిచేసే అధికారులకు గతంలో బేసిక్ వేతనంపై 25శాతం ఇన్సెంటివ్ చెల్లించేవారు. ఇటీవల దాన్ని కూడా రద్దు చేశారు. దీంతో బోర్డులోకి వెళ్లేందుకు రాష్ట్ర అధికారులు ఆసక్తి చూపడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బోర్డులో ఉద్యోగుల భర్తీకి ఎలాంటి చొరవ చూపడం లేదు. సుదీర్ఘకాలంగా తెలంగాణ కోటా పోస్టులను భర్తీ చేయకపోవడంతో ఇప్పుడు పరిపాలన పరమైన సాకుతో ఆ పోస్టులను ఏపీ అధికారులతో భర్తీ చేయాలని బోర్డు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. అదే జరిగితే ఏఈఈ పోస్టులన్నింట్లో ఏపీ అధికారులే తిష్ట వేయనున్నారు. అది బోర్డులో తెలంగాణకు చాలా ఇబ్బందికరమని రాష్ట్ర ఇంజినీర్లు చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని ఎన్నిసార్లు తీసుకెళ్లినా స్పందించడం లేదని వివరిస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం తక్షణం స్పందిం చి, దీనిపై దృష్టి సారించాలని కోరుతున్నారు.