అది.. 2010, జూన్ 16.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తన పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు, 45 మంది ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో కలిసి.. ఏపీ-మహారాష్ట్ర సరిహద్దులోని బాబ్లీ ప్రాజెక్టు వద్ద నిరసన తెలిపేందుకు బయలుదేరారు. ప్రాజెక్టు వద్ద నిషేధాజ్ఞల వల్ల మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ పోలీసులు బాబు బృందాన్ని అడ్డుకున్నారు. అయినప్పటికీ బాబు బృందం ససేమిరా అనడంతో పోలీసులు అరెస్టు చేశారు. ఒకవైపు అక్కడే చంద్రబాబుతో పాటు టీడీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు నిరసనకు దిగగా.. మరోవైపు బాబు వైఖరికి నిరసనగా ధర్మాబాద్వాసులు బంద్‌కు పిలుపునిచ్చారు. ఇలా రెండురోజుల పాటు అక్కడ భారీ హైడ్రామా చోటుచేసుకుంది.
– గతంలో బాబ్లీ బాబు డ్రామా ఇది.
ప్రస్తుతం 2025 జూన్, 19.. అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు మీడియా సమావేశం.. ‘గోదావరిపై ఒక్క పోలవరం తప్ప మిగిలినవన్నీ అనుమతిలేని ప్రాజెక్టులే. గోదావరిలో నీళ్లు ఉన్నాయి. పోరాటం అవసరం లేదు. తెలంగాణ కట్టే ప్రాజెక్టులన్నీ కట్టి నీళ్లు వాడుకుంటే చాలు. ఎందుకు పోరాటం? దేనికోసం పోరాటం? ప్రాజెక్టులు కట్టండి.. కట్టి నీళ్లు తీసుకోండి. ఉమ్మడి ఏపీలో దేవాదుల ప్రాజెక్టును నేనే మొదలుపెట్టిన. ఎస్సెల్బీసీ సక్సెస్ అయిన తర్వాత కల్వకుర్తి మొదలుపెట్టా. కాళేశ్వరం కట్టుకుంటే నేనెప్పడూ అభ్యంతరం చెప్పలేదు. పైనుంచి నీళ్లు వాడుకుంటే నష్టమా? కింద ఉండి నీళ్లు వాడుకుంటే నష్టమా? సముద్రంలోకి వెళ్లే నీళ్లు. మీరు పైన నీళ్లు వాడకపోతేనే కిందకొస్తాయి. కానీ నెనెప్పుడూ ఈ పాయింట్ ఎత్తి చూపలేదు. ఇచ్చిపుచ్చుకునే ధోరణితో సముద్రంలోకి వెళ్లే నీళ్లు మీరు వాడుకుంటున్నారు వాడుకోండి. దీనికి మీకు చట్టబద్ధత కావాలంటే కేంద్రంతో కూర్చుని మాట్లాడుకుందాం. అంతేగానీ ఇష్యూ చేయడం ఎందుకు? మనం గొడవ పడుతూ ప్రజల్ని మభ్య పెట్టడం, మోసం చేయడం వల్ల లాభం లేదు.’
– బనకచర్ల బాబు హైడ్రామాలో భాగంగా నీతి ప్రవచనాలు ఇవి.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 19 (నమస్తే తెలంగాణ): శ్రీరాంసాగర్ ఎగువన నిర్మించిన బాబ్లీ సామర్థ్యం 2.7 టీఎంసీలు! బనకచర్ల సామర్థ్యం 200 టీఎంసీలు!! మరి.. ప్రతి ఏటా రెండు వేల టీఎంసీలకు పైగా గోదావరిజలాలు సముద్రంలో కలుస్తుంటే నాడు చంద్రబాబు బాబ్లీని ఎందుకు వ్యతిరేకించారు? బాబ్లీ ఆంధ్రప్రదేశ్‌కు ఎగువన ఉన్న మహారాష్ట్రలో ఉంది. సముద్రంలో ఎలాగూ 2వేల టీఎంసీలు కలుస్తుంటే 2.7 టీఎంసీల సామర్థ్యంతో ఉన్న బాబ్లీతో వచ్చిన సమస్య ఏంది? అప్పటికే ఎనిమిదేండ్లు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహించారు… 2010 నాటికి ఆరేండ్ల పాటు ప్రధాన ప్రతిపక్ష నేత హోదాను సైతం పూర్తి చేసుకున్నారు. బాబ్లీని వ్యతిరేకించి.. పొరుగు రాష్ట్రంలోకి ప్రవేశించి.. నానా హంగామా చేసి.. చివరకు తనతో మహారాష్ట్ర పోలీసులు దురుసుగా వ్యవహరించారంటూ గగ్గోలు పెట్టిన చంద్రబాబుకు రెండువేల టీఎంసీల గోదావరిజలాలు సముద్రంలో కలుస్తున్నాయన్న విషయం తెల్వకుండా ఉంటుందా?
అయినప్పటికీ పొరుగు రాష్ట్రంలో గాయిగాయి చేసి ఇప్పుడు బనకచర్ల దగ్గరికొచ్చేసరికి మాత్రం ఉప్పునీటిలో కలిసే వృథాజలాలంటూ ప్రవచనాలు వల్లించడమంటే రెండు కండ్ల బాబు రెండు నాల్కల్ని ఎలా మడతేస్తారో అర్థం చేసుకోవచ్చు. నాడు ఉమ్మడి రాష్ట్రంలోనైనా.. నేడు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగానైనా.. చంద్రబాబు తెలంగాణకు బద్ధవ్యతిరేకి అనేది నిజం. తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగించడమే ఆయన జీవిత లక్ష్యం అనేది అక్షర సత్యం. ముఖ్యంగా 2010, జూలై రెండో తేదీన అంటే బాబు బాబ్లీ డ్రామా కంటే 14 రోజుల ముందు తెలంగాణలో 12 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఆ సీట్లన్నీ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఉత్తర తెలంగాణ పరిధిలోనివే. అక్కడ ఓట్లు దండుకోవడానికి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నంలో భాగంగానే బాబు బాబ్లీ డ్రామాను రక్తి కట్టించాలని చూశారు. తెలంగాణ రైతులకు సాగునీరు అందించడమనే బృహత్తర బాధ్యతను సమైక్య పాలకులు కేవలం ఓట్ల కోసమే వాడుకుంటారని చంద్రబాబు బాబ్లీ డ్రామా రూపంలో బహిరంగంగా రుజువు చేశారు.
బండ కింద చెయ్యి పడితే ఏం చేస్తాం? నెమ్మదిగా గాయం కాకుండా తీసుకునేందుకు ప్రయత్నిస్తాంగానీ ఒక్కసారిగా గుంజుకోం కదా! దానినే ఒడుపు అంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో సమైక్య పాలకులు ఎన్నడూ ఆ ఒడుపును ప్రదర్శించలేదు. ఎందుకంటే.. బండకింద ఉన్నది వాళ్ల చెయ్యి కాదు! తెలంగాణ రైతుల బతుకులు! అందుకే నిత్యం ఇటు కృష్ణాలో ఎగువన ఉన్న కర్ణాటక-మహారాష్ట్ర.. అటు గోదావరిలో ఎగువన ఉన్న మహారాష్ట్రతో గొడవలే. దాని ఫలితంగానే తెలంగాణను సస్యశ్యామలం చేయాల్సిన కృష్ణా, గోదావరి ప్రాజెక్టులు అంతర్రాష్ట్ర చిక్కుముళ్లతో దశాబ్దాలుగా కాగితాలపైనే నానిపోయాయి. చంద్రబాబు బాబ్లీలాంటి డ్రామాలతో అగ్గికి ఆజ్యం పోశారు.
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును మహారాష్ట్రతో కనీసం సంప్రదించకుండానే టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టడంతో 2013లో అప్పటి మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ ఏపీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి ఘాటుగా లేఖ రాశారు. ఒక అంతర్రాష్ట్ర ప్రాజెక్టుపై.. అందునా పొరుగు రాష్ట్ర భూభాగంలో బరాజ్ డిజైన్ చేసి.. వారిని సంప్రదించకుండానే పనులు చేయడమంటే పొరుగు రాష్ర్టాన్ని రెచ్చగొట్టడమే. వాస్తవానికి సమైక్య పాలకుల వ్యూహమే అది. ఈ మర్మాన్ని గుర్తించినందునే కేసీఆర్ తెలంగాణ ఏర్పడిన తర్వాత రాజనీతిజ్ఞత ప్రదర్శించారు. ప్రధానంగా మహారాష్ట్రతో సత్సంబంధాన్ని కొనసాగించి ఒకేరోజు 3 అంతర్రాష్ట్ర ప్రాజెక్టులపై చారిత్రక ఒప్పందం చేసుకున్నారు. అయితే 2014-2019 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నిత్యం తెలంగాణలోని కృష్ణా, గోదావరి ప్రాజెక్టులపై కృష్ణా-గోదావరి బోర్డులకు, కేంద్ర జలశక్తికి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు.
ఈ క్రమంలో 2019లో జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రావడం.. అప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించుకోవాల్సి ఉన్నందున కేసీఆర్ సామరస్య వాతావరణం కోసం ప్రయత్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంతర్రాష్ట్ర వివాదంలో పడిపోకుండా ఉండేందుకు అప్పటి సీఎం జగన్‌ను ఆహ్వానించి.. గోదావరిలో పుష్కలంగా ఉన్న నీటిని రెండు రాష్ర్టాలు వాడుకుందామని హితవు పలికారు. ఏపీ కలిసొస్తుందా లేదా అనేది తర్వాత సంగతి. కానీ కాళేశ్వరంపై జగన్ ప్రభుత్వం తదుపరి ఫిర్యాదులు చేయకుండా ఉండేందుకు రాజనీతిజ్ఞత ప్రదర్శించారు. ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్టుపైనా చంద్రబాబు ఇదేరీతిన స్పందిస్తున్నారు.
‘గోదావరి వరద జలాలనే వాడుకుంటు న్నాం. తెలంగాణ ప్రాజెక్టులకు నేను ఎన్నడూ అడ్డుచెప్పలేదు. ఇతర రాష్ర్టాలు బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డు చెప్పడం లేదు’ అని చంద్రబాబు చెప్తున్న మాటాలన్నీ పచ్చి అబద్ధాలే. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతి ప్రాజెక్టుపై కేంద్రానికి ఫిర్యాదుచేసి అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ‘తెలంగాణ ప్రభు త్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ అనుమతులిచ్చిం దని మా దృష్టికి వచ్చింది. ఆ ప్రాజెక్టుపై ఏపీ ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్, జీఆర్ఎంబీ అనుమతులు తీసుకోకుండానే ప్రాజెక్టును చేపట్టింది.
ఇది ఏపీ ప్రయోజనాలను ప్రభావితం చేస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇచ్చిన అన్ని అనుమతులను రద్దుచేయండి. ప్రాజెక్టు పనులు నిలిపివేయించాలి’ అంటూ 2018 జూన్ 13న కేంద్రానికి చంద్రబాబు సర్కారు కేంద్రానికి లేఖ రాసింది. అదేవిధంగా భక్త రామదాసు ప్రాజెక్టు, పాలమూరు-రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల, కల్వకుర్తి, నెట్టెంపాడు, సుంకిశాల ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కేంద్ర జలవనరుల శాఖ, కేఆర్ఎంబీ, సీడబ్ల్యూసీకి ఏపీ సర్కారు అనేక లేఖలు రాసింది. ‘తెలంగాణ శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం పనులపై జలశక్తి మంత్రి జోక్యం చేసుకోవాలి. ఆ ప్రాజెక్టులను నిలువరించాలి’ అని ఉమాభారతికి చంద్రబాబు లేఖ రాశారు.