హైదరాబాద్, ఆట ప్రతినిధి : భారత ఫుట్‌బాల్ దిగ్గజం ఎస్‌హెచ్ హమీద్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య కారణాలతో బాధపడుతున్న హమీద్ శుక్రవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. 1960 రోమ్ ఒలింపిక్స్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు తరఫున హమీద్ బరిలోకి దిగారు. లెఫ్ట్, రైట్, సెంటర్లో ఆడగల నైపుణ్యమున్న ఈ ప్లేయర్ పలు భారత చిరస్మరణీయ విజయాల్లో పాలుపంచుకున్నారు.
భువనగిరిలో జన్మించిన హమీద్ తన అద్భుత నైపుణ్యంతో అందరినీ ఆకట్టుకున్నారు. విశ్వక్రీడల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించిన 14 మంది హైదరాబాద్ ప్లేయర్లలో హమీద్ ఒకరు. 1964 ఆసియాకప్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టులో హమీద్ సభ్యుడు కావడం విశేషం.