హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): నాడు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హెచ్చరికలతో ఏపీ నిలిపివేసిన గుండ్రేవుల రిజర్వాయర్‌ను మళ్లీ ఆ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తెచ్చింది. తుంగభద్రా నదిపై 20 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణానికి శరవేగంగా పావులు కదుపుతున్నది. తుంగభద్రా డ్యామ్‌కు నూతన గేట్లను అమర్చిన సందర్భాన్ని పురస్కరించుకొని గురువారం హోస్పేటలో ఏర్పాటుచేసిన ప్రత్యేక భేటీలో కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర సీఎంలతో చర్చించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఈ భేటీకి హాజరుకానున్నారు. రిజర్వాయర్ నిర్మాణంతో తెలంగాణలో భారీగా ముంపు ఏర్పడనుండగా, శ్రీశైలం రిజర్వాయర్‌కు జల ప్రవాహాలు గణనీయంగా తగ్గిపోయే ప్రమాదం ఉన్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ ఏ విధంగా స్పందిస్తున్నదనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
కర్నూలు-కడప (కేసీ) కెనాల్ ఆయకట్టుకు నీరందడం లేదన్న సాకుతో ఏపీ ప్రభుత్వం సుంకేశుల బరాజ్‌కు దాదాపు 15 కిలోమీటర్ల ఎగువన గుండ్రేవుల వద్ద తుంగభద్రపై మరో రిజర్వాయర్‌ను నిర్మించేందుకు సిద్ధమైంది. తుంగభద్ర- పెన్నా లింకు పేరిట ప్రణాళికలను రూపొందించింది. దాదాపు 20 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే ఈ రిజర్వాయర్‌కు 2019లో పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఆ తర్వాత ఇటీవల రూ.5,400 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్‌ను సైతం సిద్ధంచేసింది. ఇదిలా ఉంటే రిజర్వాయర్ నిర్మాణంతో తెలంగాణకు తీరని నష్టం వాటిల్లనున్నది. రాష్ట్రం లోని 6 గ్రామాలతోపాటు, వెయ్యి ఎకరాల అటవీ భూమి, మరో 2వేల ఎకరాల రైతుల పట్టా భూములు మునిగిపోనున్నాయి. ప్రధానంగా పెద్ద ధన్వాడ, వేణి సోమాపురం, కేసవరం, కుతుకునూరు, కిసాన్ నగరం, చిన్న ధన్వాడ, పులికల్ గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. దిగువన తుమ్మిళ్ల లిఫ్ట్‌కు నీరు అందడమే గగనం కానున్నది. మరోవైపు శ్రీశైలం జలాశయానికి వచ్చే తుంగభద్రా జలాలు పూర్తిగా తగ్గిపోనుండగా, ఉమ్మడి పాలమూరు జిల్లాకు తీరని నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉన్నది.
కేసీఆర్ హెచ్చరికలతో నాడు బ్రేకులు
గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం కోసం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాం నుంచి ఉమ్మడి ఏపీ పాలకులు ముమ్మర యత్నాలు చేస్తూ వస్తున్నారు. దానిని ఉద్యమనేతగా నాడు కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. ఆ తర్వాత 2019లో ఎన్నికల ముందు నాటి, నేటి సీఎం చంద్రబాబు గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం కోసం రూ.2,890 కోట్లతో పరిపాలనా అనుమతులు జారీచేశారు. జీవో 154ను విడుదల చేశారు. ఏపీ చర్యలను నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు. అనుమతులు తీసుకోకుండా, అంతర్రాష్ట్ర వివాదాలను పరిష్కరించకుండా గుండ్రేవుల రిజర్వాయర్‌ను నిర్మించవద్దని కరాఖండిగా తేల్చిచెప్పారు. మొండిగా ముందుకు సాగితే అలంపూర్ వద్ద తాము రిజర్వాయర్‌ను నిర్మిస్తామని బాహాటంగానే హెచ్చరికలు జారీచేశారు. అంతేకాదు ఏపీ దుందుడుకు చర్యలపై కేఆర్‌ఎంబీతోపాటు, అన్ని ఫోరమ్‌లపై కేసీఆర్ ప్రభుత్వం ఫిర్యాదులు చేసింది. గుండ్రేవుల రిజర్వాయర్ ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకించింది. కేసీఆర్ ప్రభుత్వం చర్యలతో ఏపీ ఎట్టకేలకు తలొగ్గింది. రిజర్వాయర్ నిర్మాణంపై ముందుకు సాగలేదు. కానీ నేడు ఏడాది కాలంగా ఏపీ గుట్టుగా పావులు కదుపుతున్నది. అయినా ఇప్పటికీ సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ నోరు మెదపకపోవడం చర్చనీయాంశంగా మారింది.
పేరుకే కర్ణాటక పిలుపు.. గుట్టుగా అడుగులు
2024 ఆగస్టులో వచ్చిన వరద ప్రవాహానికి తుంగభద్ర జలాశయం 19వ క్రెస్ట్ గేట్ కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో డ్యామ్ ఇతర క్రస్ట్ గేట్ల పనితీరును అంచనా వేసేందుకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ప్రత్యేకంగా ఏకే బజాజ్ నేతృత్వంలో సాంకేతిక నిపుణుల కమిటీని నియమించగా, అది మొత్తం 33 క్రస్ట్ గేట్లను మార్చాలని నిర్ధారించింది. కమిటీ సిఫార్సుల మేరకు గేట్ల మార్పును గత 6 నెలల క్రితం చేపట్టారు. ఇటీవలే చివరి గేటును సైతం మార్చారు. ఈ నూతన గేట్ల ప్రారంభోత్సవాన్ని కర్ణాటక ప్రభుత్వం విజయనగర జిల్లా హోస్పేటలో గురువారం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు సైతం హాజరుకానున్నారు. ఇది పైకి మాత్రమేనని తెలంగాణ, ఏపీ ఇంజినీర్లు చెప్తున్నారు. గుండ్రేవుల రిజర్వాయర్ ప్రతిపాదనలపై కర్ణాటక, తెలంగాణతో చర్చల కోసమేనని అనుమానిస్తున్నారు. రిజర్వాయర్ ముంపు, పరిహారం చెల్లింపులతో పాటు నీటి వినియోగంపై ఇరు రాష్ర్టాల సీఎంలతో చంద్రబాబు చర్చించనున్నారని ఏపీ వర్గాలు బాహాటంగానే వెల్లడిస్తున్నాయి. రిజర్వాయర్ నుంచి నీటి వినియోగానికి ఇరు రాష్ర్టాలకు అవకాశం కల్పిస్తామని ఏపీ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు వివరిస్తున్నారు. భేటీలో ఆయా అంశాలపై చర్చలు కొనసాగించాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది. ఏపీ ప్రతిపాదనలపై కర్ణాటక ప్రభుత్వం సైతం సానుకూలంగా ఉన్నదని తెలుస్తున్నది. ఇదిలా ఉంటే తెలంగాణ సీఎం స్పందనపైనే అందరి దృష్టి నెలకొని ఉన్నది.
గుండ్రేవుల రిజర్వాయర్‌తో తెలంగాణకు తీరని నష్టం