హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): నల్లమల సాగర్ నిర్మించి గోదావరి జలాలను తరలించుకుపోయేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రోజుకో పన్నాగం అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తన చెప్పుచేతల్లో ఉన్నా, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అనుకూలంగా ఉన్నా.. తెలంగాణలోని మేధావి వర్గం, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో బాబు పాచికలు పారడం లేదు. అయినా తన ప్రయత్నాలను మాత్రం ఆపడం లేదు. ఈ క్రమంలో తాజాగా చంద్రబాబు మార్గనిర్దేశనంలో ఒక ఇంటిదొంగ తెరమీదికి వచ్చాడు. ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల ప్రాజెక్టుల కోసం తెలంగాణకు చెందిన ఓ మంత్రి కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారట! ఆయనకు తెలంగాణ ముఖ్యనేత, అటు ఏపీ సీఎంతో మంచి అనుబంధం ఉన్నదని రాజకీయ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి ఆయన తెలంగాణ ప్రాజెక్టుల గురించి గానీ, నీళ్ల విషయంలో గానీ తెలంగాణకు జరిగిన, జరుగుతున్న అన్యాయాల గురించి తన జీవితకాలంలో ఏనాడూ నోరు విప్పిమాట్లాడలేదని పార్టీ శ్రేణులే పేర్కొంటున్నాయి. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏపీ నిర్మిస్తున్న నల్లమలసాగర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణలో ఎలాంటి ఉద్యమం రాకుండా, రిటైర్డ్ ఇంజినీర్లు అభ్యంతరం చెప్పకుండా చూసే బాధ్యతను నెత్తికెత్తుకున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఇటీవల కర్ణాటకలో జరిగిన తుంగభద్ర డ్యామ్ గేట్ల బిగింపు కార్యక్రమానికి ఏపీ, తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు హాజరైన కార్యక్రమంలో తెలంగాణకు చెందిన ఓ సీనియర్ మంత్రి, రిటైర్డ్ ఇంజినీర్ల ఫోరంలోని కొంత మందిని స్వయంగా కలిసినట్టు సమాచారం. తాను ఏపీ, తెలంగాణ సీఎంలకు దూతగా మాట్లాడుతున్నానని చెప్పారట! నల్లమలసాగర్ విషయంలో చూసీచూడనట్టు వెళ్లాలని సూచించినట్టు తెలిసింది. ‘చంద్రబాబు, రేవంత్‌రెడ్డి ఇద్దరూ ఒక్కటే.. ప్రాజెక్టు నిర్మించాలని వారిద్దరూ అనుకున్న తర్వాత మీరు ఎన్ని పోరాటాలు చేసినా ఉపయోగంలేదు’ అని చెప్పినట్టు సమాచారం. రిటైర్డ్ ఇంజినీర్ల ఫోరంలో ఇదే విషయాన్ని చెప్పాలని, నల్లమలసాగర్ సహా ఏపీ నిర్మించే ప్రాజెక్టుల విషయంలో సానుకూల దృక్పథంతో ఉండేలా చూడాలని కోరినట్టు తెలిసింది. చంద్రబాబుతో తనకు 40 ఏండ్ల అనుబంధం ఉన్నదని, కేంద్రంలో కూడా బాబు ఇప్పుడు కీలకంగా ఉన్నారని, ఆయన కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు, నిధులు తెచ్చుకుంటారని చెప్పినట్టు తెలిసింది.
గతంలో ఎన్నడూలేని విధంగా ఏపీ ప్రభుత్వం తరఫున తెలంగాణ మంత్రి వకాల్తా పుచ్చుకోవడంపై రిటైర్డ్ ఇంజినీర్ల ఫోరం నేతలు ఆశ్చర్యపోయారట. తెలంగాణ ప్రాజెక్టులకు చంద్రబాబునాయుడు పాలనలోని ఏపీ ప్రభుత్వం అడ్డుపడుతున్నదని చెప్పినట్టు తెలిసింది. తెలంగాణ రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని, రైతుల పొట్టకొట్టేలా వ్యవహరిస్తే తాము ఊరుకోబోమని ఓ సీనియర్ రిటైర్డ్ ఇంజినీర్ గట్టిగానే సదరు మంత్రికి చెప్పినట్టు సమాచారం.
ఏపీ ప్రాజెక్టులకు తెలంగాణ అభ్యంతరం చెప్పకపోతే.. తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ సహకరించేలా తాను చొరవ తీసుకుంటానని ఆ మంత్రి ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. ఏపీకి నిధులు బాగా వస్తున్నాయని, ప్రాజెక్టుల నిర్మాణం త్వరగా పూర్తవుతుందని, తెలంగాణ సమస్యల గురించి కూడా తాను మాట్లాడుతానని చెప్పినట్టు తెలిసింది. తెలంగాణలో లేదా ఏపీలో ఎక్కడైనా సరే ప్రాజెక్టులకు సహకరించేవారిని సలహాదారులుగా రెండు ప్రభుత్వాలు తీసుకునేలా తాను చొరవ తీసుకుంటానని, నల్లమల సాగర్‌కు అభ్యంతరం చెప్పవద్దని వారించినట్టు సమాచారం. చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వచ్చినపుడు ప్రత్యేకంగా భేటీ ఏర్పాటు చేయిస్తానని, నేరుగా ఆయనే మీతో మాట్లాడే ఏర్పాటు చేయిస్తానంటూ తెలంగాణ సీనియర్ మంత్రి చెప్పినట్టు తెలిసింది.