హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ) : ఏపీ ప్రభుత్వం జారీచేసిన కుల ధ్రువీకరణ పత్రం తెలంగాణాలో పీజీ మెడికల్ అడ్మిషన్లకు చెల్లబాటు కాదని హై కోర్టు కీలక తీర్పు వెలువరించింది. తెలంగాణ కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సిందేనని, ఈ అభ్యర్థులకే రిజర్వేషన్లు వర్తిస్తాయని స్పష్టంచేసింది. ఏపీ ప్రభుత్వం జారీచేసిన ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాల ద్వారా రిజర్వేషన్ క్యాటగిరీ కింద తన దరఖాస్తును అనుమతించేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను డిస్మిస్ చేసిం ది. రాష్ట్రానికి చెందిన నిర్దేశిత అధికారి జారీ చేసే ఎస్సీ/ఎస్టీ/బీసీ కుల ధ్రువీకరణ పత్రాలను సమర్పించిన అభ్యర్థులకే పీజీ మెడికల్ అడ్మిషన్లలో రిజర్వేషన్లు కల్పిస్తామన్న కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయ చర్యను సమర్థించింది. ఆ నిబంధనను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ రేణుక యారాతో కూడిన ధర్మాసనం సోమవారం సుదీర్ఘంగా విచారణ జరిపింది.
ఈ సందర్భంగా కాలోజీ వర్సిటీ, ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఏపీకి చెందిన ఎస్సీ వర్గాలు తెలంగాణలో రిజర్వేషన్లు కోరడం సరికాదని అన్నారు. ఏపీ కుల ధ్రువీకరణ పత్రాన్ని తెలంగాణలో అమలు చేయాలని కోరడం చట్ట వ్యతిరేకమని తెలిపారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం షెడ్యూలు 5లో తెలంగాణలో ఏ కులాలు ఎస్సీలు, ఎస్టీ లు, బీసీలుగా ఉన్నాయో స్పష్టంగా ఉందని చెప్పారు. ఆ మేరకు రిజర్వేషన్ల అమలు ఉంటుందని అన్నారు. ఏపీ ఇచ్చిన ధ్రువీకరణ పత్రాన్ని అనుమతిస్తే తెలంగాణ ఏర్పాటు లక్ష్యం నీరుగారుతుందని చెప్పారు. ఒక రాష్ట్రంలోని ఎస్సీలను మరో రాష్ట్రంలో ఎస్సీలుగా పరిగణించాలని లేదని అ న్నారు. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రకారం రాష్ట్రంలో తీసుకున్న కులధ్రువీకరణ పత్రమే చెల్లుబాటు అవుతుందని చెప్పారు. ఇతర రాష్ట్రంలో ఎస్సీ/ ఎస్టీగా ఉన్నవారి పిల్లలు వలస రాష్ట్రంలో పుడితే వారి కులం అక్కడ షెడ్యూలులో లేకపోతే రిజర్వేషన్ క్లెయిం చేయడానికి వీల్లేదని, తెలంగాణలో కుల ధ్రువీకరణ పత్రాలు జారీచేసే అధికారాన్ని ప్రభుత్వం ఎమ్మార్వో, ఆర్డీవోలకు ఇచ్చిందని చెప్పారు. ఇరుపక్షాల వాదనల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం/వర్సిటీల వాదనలను హైకోర్టు ఆమోదిస్తూ తీర్పు వెలువరించింది.