హైదరాబాద్ : తెలంగాణలో రైతులు పండించిన యాసంగి ధాన్యం మొత్తాన్ని కేంద్రమే కొనాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రేపు నిర్వహించనున్న మండల కేంద్రాలలో ధర్నా, ఆందోళన కార్యక్రమాలకు రైతులు, ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు.
నిన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు మంత్రి ఎర్రబెల్లి వరంగల్ ఉమ్మడి జిల్లా నాయకులతో ఆదివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో మంత్రి సత్యవతి రాథోడ్, జిల్లా పరిషత్ చైర్మన్ లు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్టీ ముఖ్య నేతలు వివిధ విభాగాల జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రేపు మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు. 6వ తేదీన జాతీయ రహదారులపై రాస్తారోకో అయితే ఇది ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోకి రాదని ఆరోజు జాతీయ రహదారుల బంధ కార్యక్రమం ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఉండదని మంత్రి చెప్పారు. కాగా, 7 న జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు. 8న గ్రామాల్లో నిరసన ప్రదర్శనలు, ప్రతి రైతు ఇంటిపై నల్లజండాలు ఎగరవేయడం, మునిసిపాలిటీల్లో బైక్ ర్యాలీలు చేపట్టాలన్నారు. 11న ఢిల్లీలో నిరసన దీక్ష ఉంటుందన్నారు.
ముందుగా మండల కేంద్రాలలో చేపట్టే ఆందోళన కార్యక్రమాలను పార్టీ నేతలు రైతాంగం ప్రజల సమన్వయంతో సక్సెస్ చేయాలని మంత్రి ఆదేశించారు. ఆందోళన కార్యక్రమాల అనంతరం మీడియా సమావేశాలు నిర్వహించి ప్రజలు, రైతుల అందరికి చేరే విధంగా గతంలో బీజేపీ నేతలు ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడిన వీడియో క్లిప్పింగులను చూపించాలని మంత్రి సూచించారు. మన గల్లీలకు ఢిల్లీ దిగి వచ్చే వరకు ఆందోళన కార్యక్రమాలు జరుగుతాయని మంత్రి తెలిపారు.