Singareni Scam | హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : రామగుండంలోని 107 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌లో అతిపెద్ద కుంభకోణానికి రేవంత్ ప్రభుత్వం తెరలేపిందని మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన విమర్శలు చేశారు. మూడు వేర్వేరు సైట్లలో సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టేది ఉండగా, తమ అనుయాయులకు కట్టపెట్టడంలో భాగంగా పోటీని తగ్గించేందుకు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎమ్మెస్ఎంఈ) సంస్థలు పాల్గొనకుండా మూడు సైట్లు కలిపి 107 మెగావాట్లతో సింగిల్ టెండర్ పిలిచారని చెప్పారు.
సోలార్ పవర్ ప్లాంట్‌ను కూడా దక్కించుకోడానికి సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే కండీషన్ పెట్టారని విమర్శించారు. తమ వారికి రూ.250 కోట్లు అదనంగా లబ్ధి చేకూరేలా ఈ టెండర్లను కట్టబెట్టారని మండిపడ్డారు. ఈ టెండర్‌ను గిల్టీ పవర్ లిమిటెడ్ అనే కంపెనీకి అప్పచెప్పారని తెలిపారు. దేశవ్యాప్తంగా సోలార్ పవర్‌పై టెండర్లు కొనసాగుతున్నాయని, ఒక మెగావాట్ సోలార్ ఉత్పత్తికి రూ.3.50 కోట్లు అవుతుందని, పైగా భూమి కూడా సోలార్ కంపెనీలదే ఉంటుందని తెలిపారు. ఇకడ సింగరేణి భూమిలో సోలార్ ప్లాంట్లు పెట్టి సోలార్ పవర్ ఉత్పత్తి చేసినందుకు ఒక మెగావాట్‌కు రూ.5 కోట్ల 4 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి ఆ కాంట్రాక్టర్‌కు చెల్లించబోతున్నాయని, ఇలా రూ.540 కోట్ల టెండర్‌ను సొంతవారికి అప్పగించబోతున్నారని చెప్పారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అక్రమాలను పూర్తి ఆధారాలతో తెలంగాణభవన్‌లో శుక్రవారం మీడియా ఎదుట బయటపెట్టారు.
67 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌లోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయని హరీశ్ విమర్శించారు. దాదాపు ఏడు కోట్లకు ఒక మెగావాట్ సోలార్ పవర్ ఉత్పత్తికి ఈ ప్లాంట్‌ను కట్టబెట్టారని, నేషనల్ యావరేజ్ కంటే ఇది డబుల్ కాస్ట్ అని ఆందోళన వ్యక్తంచేశారు. రూ.480 కోట్లకు వారికి కావాల్సిన కంపెనీకి కట్టబెట్టారని మండిపడ్డారు. ఈ కంపెనీకి కూడా సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధనలు పెట్టి తమ అనుయాయులకు అప్పనంగా అందించారని చెప్పారు. అకడ రూ.250 కోట్లు, ఇకడ రూ.250 కోట్లు నేరుగా చేతులు మారాయని, అదనంగా రూ.500 కోట్లు చెల్లింపులు జరిగాయని విమర్శించారు. జైపూర్‌లో సింగరేణి నిర్మిస్తున్న థర్మల్ పవర్ప్లాంట్లలోనూ కాంగ్రెస్ నేతలు అనేక అవకతవకలకు పాల్పడ్డారని హరీశ్ విమర్శించారు. త్వరలోనే ఆ వివరాలు బట్టబయలు చేస్తానని స్పష్టంచేశారు.
సింగరేణిలో జిలిటెన్ స్టిక్స్ కొనుగోలు పేరిట కాంగ్రెస్ సర్కార్ ఎక్స్‌ప్లోజివ్ స్కామ్‌కు తెరలేపిందని హరీశ్‌రావు సంచలన విమర్శలు చేశారు. ‘జిలిటెన్‌స్టిక్స్‌ను 30 శాతం అదనపు ధరతో కొనుగోలు చేయాలని ఒత్తిడి తేవడంతో సింగరేణి డైరెక్టర్ జీవీ రెడ్డి రాజీనామా చేసి వెళ్లిపోయారు.. సంతకం పెట్టను అని నిరాకరించిన మరో డైరెక్టర్ వీకే శ్రీనివాస్‌ను జీఎం పోస్టులోకి తిరిగి పంపారు. ఇలా బెదిరించి, భయపెటి,్ట నిబంధనలు మార్చి కోట్లాది రూపాయలు కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని నిప్పులు చెరిగారు.
సింగరేణి టెండర్ల పేరిట ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్న ప్రభుత్వం శ్రీరాంపూర్ ఓబీలో మరో స్కామ్‌కు తెరలేపింది. సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానాన్ని అడ్డంపెట్టుకొని అక్రమాలకు పాల్పడుతున్నది. శ్రీరాంపూర్ ఓబీలో రూ. 600 కోట్లతో వర్క్ టెండర్ పిలిచారు. టెక్నికల్ బిడ్ ఓపెన్ చేసి ఫైనాన్షియల్ బిడ్డు కోసం ఏడు సార్లు తేదీలిచ్చి వాయిదా వేశారు. ముఖ్యమంత్రి బావమరిది సృజన్‌రెడ్డి హైదరాబాద్ హోటళ్లలో కాంట్రాక్టర్లతో జరిపిన చర్చలు ఫలించకపోవడం, ఒప్పందం కుదరకపోవడం వల్లే తేదీలు పొడిగిస్తూ వస్తున్నారు.
‘సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానంలో పిలిచిన నైని బ్లాక్ టెండర్లను రద్దుచేసిన ప్రభుత్వం ప్రకాశం ఖనిని కట్టబెట్టేందుకు రూ. 1044 కోట్లతో టెండర్లు పిలువడం ఎంత వరకు కరెక్ట్?’ అని హరీశ్ నిలదీశారు. ‘ప్రకాశం ఖనికి సంబంధించి టెండర్లు పిలిచి ఫిబ్రవరి 2 వరకు గడువు విధించారు. ఇక్కడా టెండర్లను రింగ్ చేస్తున్నారు’ అని వివరించారు. సైట్ విజిట్ సిస్టం తప్పయితే ఈ కాంట్రాక్ట్‌ను సైతం క్యాన్సల్ చేయాలని డిమాండ్ చేశారు.
సింగరేణి టెండర్ల పేరిట ప్రభుత్వం శ్రీరాంపూర్ ఓబీలో మరో స్కామ్‌కు తెరలేపిందని హరీశ్ సంచలన విమర్శలు చేశారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానాన్ని అడ్డంపెట్టుకొని అక్రమాలకు పాల్పడుతున్నదని ధ్వజమెత్తారు. శ్రీరాంపూర్ ఓబీలో రూ. 600 కోట్లతో వర్క్ టెండర్ పిలిచారని, టెక్నికల్ బిడ్ ఓపెన్ చేసి ఫైనాన్షియల్ బిడ్డు కోసం ఏడు సార్లు తేదీలు ఇచ్చి వాయిదా వేశారని తెలిపారు. ముఖ్యమంత్రి బావమరిది సృజన్‌రెడ్డి హైదరాబాద్ హోటళ్లలో కాంట్రాక్టర్లతో జరిపిన చర్చలు ఫలించకపోవడం, ఒప్పందం కుదరకపోవడంతోనే తేదీలు పొడిగిస్తూ వస్తున్నారంటూ దుయ్యబట్టారు. రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత సైట్ విజిట్ విధానంలో పిలిచిన 6 ఓబీ టెండర్లను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. జైపూర్‌లో సింగరేణి నిర్మిస్తున్న థర్మల్ పవర్ప్లాంట్లలో కూడా కాంగ్రెస్ నేతలు అనేక అవకతవకలకు పాల్పడ్డారని విమర్శించారు. త్వరలోనే ఈ వివరాలను బట్టబయలు చేస్తానని స్పష్టంచేశారు.
రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే సింగరేణి టెండర్లపై సీబీఐతో గానీ, సిట్టింగ్ జడ్జితో గానీ విచారణ జరిపించి కాంగ్రెస్ నేతల అక్రమ బాగో తాన్ని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రేవంత్, బీజేపీ కుమ్మక్కయినట్టేనని ప్రజలు భావిస్తారని కుండబద్దలు కొట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి సైతం తన బావమరిది తెరలేపిన బొగ్గు కుంభకోణాలపై సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. శనివారం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కొత్తగూడెంలో సింగరేణి హెడ్ ఆఫీస్‌కి వెళ్లి రివ్యూ చేస్తారన్న సమాచారం ఉన్నదని, తాము బొగ్గు స్కామ్‌ను వెలుగులోకి తేవడం వల్లే ఇది జరుగుతున్నదని చెప్పారు. రెండేండ్లు బొగ్గు మంత్రిగా ఉన్నా కిషన్‌రెడ్డి ఇప్పటిదాకా పట్టించుకోలేదని విమర్శించారు. బీఆర్ఎస్ బయట పెడితేనే ఢిల్లీలో ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారని, ఢిల్లీ కిషన్‌రెడ్డి గల్లీకి వచ్చి కొత్తగూడెంలో సింగరేణిపై మీటింగ్ పెడుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే కుంభకోణంపై విచారణ జరపాలని కిషన్‌రెడ్డికి డిటైల్డ్ లేఖ రాసినట్టు హరీశ్ చెప్పారు.
నాటి 1.50 లక్షల కోట్ల కోల్ సామ్ యూపీఏ ప్రభుత్వ పతనానికి ఎట్లా దారితీసిందో, తెలంగాణలో నేటి ఈ బొగ్గు కుంభకోణం కూడా అలానే కాంగ్రెస్ సర్కార్ పతనానికి బీజం వేసిందని హరీశ్ చెప్పారు. తన బావమరిది సృజన్‌రెడ్డి కోసం చేసిన ఈ కుంభకోణం దేశం మొత్తం చర్చనీయాంశంగా మారిందని, చరిత్రలో తొలిసారిగా ఢిల్లీలో కోల్ మినిస్ట్రీ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టిందని చెప్పారు. రేవంత్‌రెడ్డి చేసిన ఈ బొగ్గు కుంభకోణం వల్ల తెలంగాణ ప్రతిష్ఠ దెబ్బతిన్నదని మండిపడ్డారు. తెలంగాణ సిరులగని సింగరేణిని.. నేడు సృజన్గనిగా మార్చారని మండిపడ్డారు. బొగ్గు స్కామ్ వాటాల పంచాయితీ కాంగ్రెస్ పార్టీకి ఉరితాడుగా మారిందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన బావమరిది సృజన్‌రెడ్డి అవినీతి బాగోతాలను కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, బీజేపీతో కుమ్మకై ఈ సిట్ల డ్రామా ఆడుతున్నారని నిప్పులు చెరిగారు.
ఈ డ్రామాలో భాగంగా మొన్న తనకు, ఇవ్వాళ కేటీఆర్‌కు సిట్ నోటీసులిచ్చి ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ఇదే తెలంగాణభవన్‌లో కేటీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి సృజన్‌రెడ్డి బాగోతాలను ఆధారాలు సహా బయటపెట్టినందుకే కేటీఆర్‌కు నోటీసులిచ్చారని చెప్పారు. ‘నువ్వు ఎన్ని కుట్రలు చేసినా నీ అవినీతిని బయట పెట్టకుండా ఊరుకోం. నీ పాపాల చిట్టాలను బయటపెడుతూనే ఉంటాం’ అని రేవంత్‌ను హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న బొగ్గు సామ్ పార్ట్-2 పేరుతో రేవంత్ సర్కార్ చేస్తున్న మరికొన్ని కుంభకోణాలను ఆధారాలతో వెల్లడించారు. సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్‌రావు, కోవా లక్ష్మి పాల్గొన్నారు.