హైదరాబాద్, జనవరి 9(నమస్తే తెలంగాణ): ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న నిరుద్యోగులపై రేవంత్ సర్కార్ దాష్టీకానికి దిగుతున్నదని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి ఆరోపించారు. అశోక్‌నగర్‌లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని చితకబాదడం దుర్మార్గమని, ఉద్యోగాల కోసం ఉద్యమించిన విద్యార్థులపై కేసులు బనాయించడం అన్యాయమని పేర్కొన్నారు.
శుక్రవారం ఆయన తెలంగాణభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. నిరుద్యోగులను పోలీసులతో కొట్టించడం, ఓ ఉన్నతాధికారి నీచంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సదరు అధికారి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
అశోక్‌నగర్‌కు వచ్చి ఏటా రెండు లక్షల ఉద్యోగాలిచ్చే బాధ్యత తీసుకుంటానని నమ్మించిన రాహుల్‌గాంధీ ఇప్పుడు ఎందుకు మిన్నకున్నారని రాకేశ్‌రెడ్డి ప్రశ్నించారు. హామీని ఎగ్గొట్టిన రాహుల్‌ను ఉద్దేశించి కడుపుమండిన కేటీఆర్ మాట్లాడితే కాంగ్రెస్ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కారుపై నిరుద్యోగులు సమరానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.