Rakesh Reddyహైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): హైడ్రాతో హైడ్రామా క్రియేట్ చేసి హైలెవల్ కమీషన్లు దండుకోవడమే రేవంత్‌రెడ్డి లక్ష్యమని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి అన్నారు. హైడ్రాను బ్లాక్ మెయిలింగ్‌కు వాడుకొని డబ్బులు ఢిల్లీకి, అభివృద్ధిని అమరావతికి, రెమ్యునరేషన్ రేవంత్‌రెడ్డికి, తెడ్డు తెలంగాణకు ఇదే కాంగ్రెస్, రేవంత్‌రెడ్డి లక్ష్యమని ఆరోపించారు.
శనివారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతియ్యాలని రేవంత్ కుట్ర చేస్తున్నారని, ఆకస్మిక, అనాలోచిత కూల్చివేతలతో భయభ్రాంతులకు గురిచేసి రియల్ ఎస్టేట్‌ను కుదేలు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. పెట్టుబడులను అమరావతికి మళ్లించడమే రేవంత్ లక్ష్యమని ఆరోపించారు. పేదల ఇండ్ల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. హైడ్రాకు ఉన్న చట్టబద్ధత ఏమిటని ప్రశ్నించారు.
వరంగల్ పేదల ఇండ్ల జోలికి వస్తే సహించబోమని హెచ్చరిం చారు. హైడ్రాకు తాము వ్యతిరేకం కాదని, పేదల ఇండ్లు కూల్చడాన్ని వ్యతిరేకిస్తున్న ట్టు చెప్పారు. రేవంత్ కుటుంబానికి ఒక రూలు, ప్రజలకు ఒక రూలా? అని ప్రశ్నించారు. పేదల ఇండ్లు కూల్చివేత కారణంగా రోడ్డున పడిన వారికి తక్షణమే ఇల్లు కట్టించి ఇవ్వడంతోపాటు పరిహారం కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అస్మత్పేట, అల్వాల్, సరూర్‌నగర్, బోయిన్పల్లి, రాజీవ్‌నగర్, ఖాజాగూడలో పేదల ఇండ్లకు కూల్చివేత నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు.