హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రకటించిన రెండు లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ ఏమైందని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హామీ మేరకు జాబ్ కేలండర్‌ను విడుదల చేయాలని డిమాండ్‌చేశారు. తెలంగాణభవన్‌లో గురువారం నిరుద్యోగులతో కలిసి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగ యువత అరిగోస పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మార్పు కోసం ఓటేసిన పాపానికి యువతను వేధిస్తున్నదని మండిపడ్డారు. ప్రభుత్వ తీరుతో అన్నివర్గాల ప్రజలు రోడ్డెక్కుతున్నారని చెప్పారు.
ఎన్నికల కోడ్ సాకుతో అన్నింటినీ ప్రభుత్వం వాయిదా వేసిందని, కోడ్ ముగిసిన తర్వాత ఏ హామీ నెరవేర్చలే దని విమర్శించారు. గ్రూప్-1లో 1:100 చొప్పన మెయిన్‌కు ఎంపిక చేయాలని, గ్రూప్-2లో 2 వేల పోస్టు లు, గ్రూప్-3లో 3 వేల పోస్టుల చొప్పు న మలి నోటిఫికేషన్లు ఇవ్వాలని, డీఎస్సీ ద్వారా 25 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉండగా జీవో 46పై పోరాడిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక స్పందించడంలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానిది ప్రజాపాలన కాదని, దగాపాలన అని ధ్వజమెత్తారు. నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు.