బొంరాస్పేట, సెప్టెంబర్ 12 : వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మం డలంలో ఏర్పాటు చేయతలపెట్టిన ఫార్మా విలేజ్కు వ్యతిరేకంగా రైతులు ఆందోళనను తీవ్రతరం చేశారు. ఈ ప్రాంతంలోకి ఫార్మా రావద్దంటూ మహిళలు గురువారం పోలేపల్లిలోని ఎల్లమ్మ దేవాలయంలో ముడుపు కట్టారు.
అనంతరం బాధిత గ్రామాలకు చెందిన రైతు లు గో బ్యాక్ ఫార్మా అని నినదిస్తూ హకీంపేట చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. రైతుల ఆం దోళనకు సీపీఎం, బీఆర్ఎస్ నాయకులు మద్ద తు పలికారు. సాగు భూముల్లో ఫార్మా కంపెనీల ఏర్పాటుతో రైతులు, ప్రజలు తీవ్రంగా నష్టపోతారని, వాయు, నీటి కాలుష్యం ఏర్పడి ప్రజలు రోగాల బారిన పడుతారని రైతులు ఆందోళన వ్యక్తంచేశారు.
తరాల నుంచి భూ ములనే నమ్ముకుని వ్యవసాయం చేసుకుం టూ బతుకుతున్న తాము ఫార్మా ఏర్పాటు వల్ల కూలీలుగా మారే ప్రమాదం ఉన్నదని ఆవేదన చెందారు. ప్రభుత్వం వెంటనే స్పం దించి ఫార్మా విలేజ్ ఏర్పాటును ఉపసంహరించుకోవాలని కోరారు. బీఆర్ఎస్ నాయకుడు యాదయ్య మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి బినామీ పేర్లతో భూములు తీసుకుని ఫార్మా కంపెనీలకు కట్టబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫార్మా కంపెనీని రానివ్వమని పేర్కొన్నారు. అనంతరం రిలే దీక్ష ప్రారంభించారు.