RRR | షాబాద్, సెప్టెంబర్ 18: ‘మాకున్నది ఒకట్రెండు ఎకరాలు. అదే మాకు ఆధారం.. దానిని గుంజుకొని రింగు రోడ్డు వేస్తే మేం ఏం తిని బతకాలి? ప్రభుత్వం పైసలిచ్చినా రెండ్రోజుల్లో అవి ఖర్చయితయ్? ఆ తర్వాత మేమెట్ల బతకాలి? ఉన్నోళ్లకు వందల ఎకరాలు ఉన్నయి. అందులో నుంచి రోడ్డు వేయకుండా.. మా భూములల్ల గుర్తులు పెడతరా? ఇదంతా మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి చేసిన పనే. కాంగ్రెస్‌లోకి పోయిందే అందుకు…’ అని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని అంతారం ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన ‘రూటు మారిన ట్రిపుల్ ఆర్’ కథనం చూసి అనేక మంది ఫోన్ చేశారు. గ్రామానికి వస్తే తాము పడుతున్న ఆవేదన చెప్తామన్నారు. గతంలో ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ ఆలూర్ మీదగా పోయేదని, ఇప్పుడు తమ గ్రామం నుంచి వేస్తున్నట్టుగా గు ర్తులు పెట్టారని ఆందోళన వ్యక్తంచేశారు. అప్పటి నుంచి తిన్న తిండి ఒంటికి పడతలేదని వాపోయారు. అలైన్మెంట్ మార్పుతో దాదాపు 60 మంది రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఆ వివరాలు వారి మాటల్లోనే…
గతంలో ఖానాపూర్ గేట్ నుంచి ఆలూరు మధ్యలో ట్రిపుల్ ఆర్ పోతుందని చెప్పారు. ఇప్పుడు అంతారం మధ్యలో నుంచి రోడ్డు పోతుందని చెబుతున్నారు. నాకు ఉన్న 32గుంటల భూమి పోతుంది. మేము దీనిమీద ఆధారపడి బతుకుతున్నాము. నేను కూడా గత 18 సంవత్సరాలుగా హోంగార్డుగా పనిచేస్తున్నాను. కుటుంబాన్ని పోషించుకోవడానికి వచ్చిన జీతాలు సరిపోవడం లేదు. కనీసం ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. పక్కనే మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి భూమి ఉంది. ఆయన భూమిలో నుంచి కొంచెకూడా పోలేదు. పక్కనే ఉన్న రూ. కోట్లు విలువచేసే విల్లాస్ నుండి భూమి పోలేదు.
– నర్సింహులు, హోంగార్డు, అంతారం
ట్రిపుల్ ఆర్‌ను పాత మార్కింగ్ ప్రకారమే ఏర్పాటు చేయాలి. కొంతమంది కోసం కొత్తగా మార్కింగ్ చేయించడం సరికాదు. గత ప్రభుత్వం మా ఊరి పక్క నుంచి ట్రిపుల్ ఆర్ పోతుందని చెప్పారు. కానీ పక్కనే ఉన్న మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి భూమిలో నుంచి రోడ్డు వెళ్లకుండా కొత్తగా మార్కింగ్ వేయించారు. నాకు ఉన్న 20 గుంటల భూమితో పాటు రెండేళ్ల కిందట గ్రామంలో నిర్మించుకున్న ఇల్లు కూడా రోడ్డులో పోయేటట్టు కనిపిస్తున్నది.
– సుధాకర్, రైతు అంతారం
ట్రిపుల్ ఆర్ పేరిట ప్రభుత్వం పేద రైతులకు అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. గత ప్రభుత్వంలో ఆలూరు వైపు నుంచి రోడ్డు వేస్తామని చెప్పారు. ఇప్పుడు అక్కడి నుంచి 500మీటర్లు పక్కకు జరిపి మా గ్రామం అంతారం మీదుగా రోడ్డు వేసేందుకు గుర్తులు పెట్టారు. దీంతో రైతుల భూములతో పాటు ఇం డ్లు కూడా పోతా యి. రైతులకు నష్టం కలిగిస్తే ఆందోళనకు దిగుతాం.
– నరేందర్, అంతారం
రింగ్‌రోడ్డు ఏర్పాటు చేయడంలో తమ గ్రామానికి ఎంతో నష్టం జరుగుతుంది. అధికారులు వచ్చి మార్కింగ్ వేసి వెళ్లారు. అప్పటి నుంచి మా భూములు, ఇండ్లు పోతాయని అందరం ఆందోళన చెందుతున్నాము. నాకున్న ఐదు గుంటల భూమి రోడ్డులోనే పోయేటట్టుంది. కూలి పనులు చేసుకుని కష్టపడి భూమి కొనుకున్నాను. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి. పాత మార్కింగ్ ప్రకారం రోడ్డు వేస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు.
– జుట్టు సుధాకర్, రైతు అంతారం
ట్రిపుల్ ఆర్ కోసం మా భూములు పోతే మేము నష్టపోతాం. మా ఊరికి ఇరువైపులా ఉన్న మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి భూములు గానీ, మరో పక్కన ఉన్న విల్లాస్ భూములు కాకుండా అంతారం, హస్తేపూర్ గ్రామాలకు సంబంధించి సుమారు 300 ఎకరాల వరకు రైతుల భూములకు నష్టం జరుగుతుంది. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, పునరాలోచించాలి. ప్రభుత్వ భూముల మీదుగా రోడ్డేయాలి.
– వెంకటేశ్, అంతారం
పెద్ద నాయకుల భూములను పక్కన పెట్టి పేదవారి భూముల్లో నుంచి రోడ్లు వేయడం సరికాదు. నాకున్న రెండు ప్లాట్లు రోడ్డులో పోతున్నాయి. ప్రస్తుతం భూముల ధరలు కోట్లల్లో ఉన్నాయి. రింగ్ రోడ్డు వస్తే భూములకు మరింత ధరలు పెరుగుతాయని మేము ఆశతో ఉంటే, ఉన్న భూముల్లో నుంచే రోడ్డు పోతే మా పరిస్థితేంటి? ప్రభుత్వం స్పందించి రోడ్డును ఊరు పక్కన నుంచి నిర్మిస్త్తే బాగుంటుంది.
– నవీన్, అంతారం
ట్రిపుల్ ఆర్ వేస్తే మాకు ఇబ్బందేమీలేదు. కానీ మాకున్న కొద్దిపాటి భూముల్లో నుంచి రోడ్డు వేస్తే నష్టం జరుగుతుంది. గ్రామంలో పెట్టిన గుర్తుల ప్రకారం చూసుకుంటే నా భూమి మూడు ఎకరాల వరకు పోతుంది. ఇక్కడ ఎకరం ధర రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు నడుస్తున్నది. రింగ్‌రోడ్డు కోసం మన్నెగూడ మీదుగా రోడ్డు పోతే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మా భూములకు నష్టం జరుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
– పెంటయ్య, రైతు అంతారం