కమాన్ చౌరస్తా, ఏప్రిల్ 25: శాతవాహన యూనివర్సిటీ (Satavahana University) పరిధిలో గురువారం మధ్యాహ్నం నుంచి మంటలు ఎగిసిపడుతున్న విషయం తెలిసిందే. అయితే సాయంత్రం వరకు ఫైర్ సిబ్బంది ఆ మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. సాయంత్రం సమయంలో వంటలు ఆరిపోయినట్లు నిర్ధారించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. కానీ రాత్రి ఆ మంటలు చల్లారకుండా ఎగ్జామినేషన్ బ్రాంచ్ వరకు వ్యాపించాయి. ఈ క్రమంలో అధికారులు స్టోర్ చేసిపెట్టిన ఎగ్జామినేషన్ బ్రాంచ్‌కి సంబంధించిన ఆన్సర్ పేపర్లు, ఆ రూమ్‌లోని పరికరాలు, స్విచ్ బోర్డులు, ఏసీలు దాదాపు కాలిపోయాయి.
శుక్రవారం ఉదయం వాకింగ్ వచ్చిన స్థానికులు మంటలను గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కానీ అప్పటికే ఎగ్జామినేషన్ బ్రాంచ్‌లో ఉన్న పలు పేపర్లు దగ్ధం అయ్యాయి. అయితే, ఈ విషయమై అధికారులను వివరణ కోరగా అవి ఐదు సంవత్సరాల క్రితం ఆన్సర్ పేపర్లు అని చెప్పారు. వాటిని స్క్రాప్‌కి పంపించామని, రెండు మూడు రోజుల్లో తొలగిస్తామన్నారు. అవి కాలినా నష్టం లేదని సమాధానమిచ్చారు. అగ్నిప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.