ఖైరతాబాద్, నవంబర్ 16: హైడ్రా ప్రభావంతో రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిందని తెలంగాణ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అన్సర్ హుస్సేన్ తెలిపారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగంపై 20 లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారని వెల్లడించారు. ఈ రంగం ద్వారా ప్రభుత్వానికి 22 శాతం ఆదాయం వస్తున్నదని చెప్పారు. కానీ ప్రభుత్వ చర్యల వల్ల ఈ రంగం కుప్పకూలిందని, ఎంతోమంది జీవితాలు రోడ్డున పడుతున్నాయని పేర్కొన్నారు. పేదలు, మధ్య తరగతి ప్రజలు ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకుంటే.. ప్రభుత్వం మాత్రం పలు కారణాలతో కూలగొడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. అనుమతులతో కట్టిన ఇండ్లను కూల్చడం సమంజసం కాదని చెప్పారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు.