వర్ధన్నపేట, జనవరి 11 : ఆన్లైన్ గేమ్స్‌కు బానిసై మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకున్నది. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన లైశెట్టి కుమారస్వామి, సుజాత దంపతుల చిన్న కొడుకు రాజు(25) ఆన్లైన్ గేమ్స్‌కు అలవాటు పడ్డాడు. తెలిసిన వారి వద్ద సుమారు రూ.30 లక్షల వరకు అప్పు చేసి, ఆన్లైన్ గేమ్స్‌లో పోగొట్టుకున్నాడు. తనకు మరో రూ.4 లక్షలు కావాలని నాలుగు రోజుల క్రితం తండ్రిని అడగ్గా లేవని చెప్పాడు. చేసిన అప్పులు తీర్చేమార్గం కానరాక, రెండు రోజులుగా మనోవేదనకు గురైన రాజు శనివారం తెల్లవారుజామున ఇంట్లోని స్లాబ్ కొక్కానికి చీరెతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.