సిరిసిల్ల రూరల్, జూన్ 25 : రాజన్న సిరిసిల్లలో నేతన్నల ఆకలిచావులు పెరుగుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేండ్లుగా ఏ బాధా లేకుండా బతికిన కుటుంబాలు, కాంగ్రెస్ సర్కారు ఆరు నెలల పాలనలోనే వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయి ఉపాధి కరువై, బతుకు బరువై చితికిపోతున్నాయి. నాలుగు రోజుల కిందే సిరిసిల్లలోని( Siricilla) రాజీవ్‌నగర్‌కు చెందిన కుడిక్యాల నాగారాజు(47) ఉపాధి లేక యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువకముందే, తాజాగా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మకాలనీ (టెక్స్టైల్ పార్క్)కు చెందిన వైపని కార్మికుడు ముదిగొండ నరేష్(35) ఇంట్లోనే ఉరేసుకోవడంతో(Weaver died) కార్మిక క్షేత్రంలో విషాదం నెలకొన్నది.
వివరాల్లోకి వెళితే.. ఇందిరమ్మకాలనీకి చెందిన ముదిగొండ శాంతవ్వ, ఈశ్వరయ్య దంపతుల కొడుకు నరేష్(35) వస్త్ర పరిశ్రమంలో వైపని కార్మికుడు (బీములు నింపడం,పోగులు వేయడం) పని చేస్తున్నాడు. నరేశ్‌కు 2018లో స్వాతితో వివాహమైంది. మొదటి సంతానం కొడుకు జన్మించగా, ప్రసవ సమయంలో ఉమ్మనీరు మింగడంతో మృతి చెందాడు. స్వాతి రెండోసారి గర్భందాల్చినా కొన్నికారణాలతో కడుపులోనే శిశువు మృతి చెందింది. ఇక తల్లి శాంతవ్వ పక్షవాతంతో మంచం పట్టగా, తండ్రి ఈశ్వరయ్య వృద్ధాప్యంతో ఇంట్లోనే అచేతన స్థితిలో ఉన్నాడు. ఇన్నాళ్లూ వీరి అలనా పాలన నరేష్-స్వాతిలే చూసుకుంటున్నారు.
స్వాతి బీడీలు చుడుతూ భర్తకు చేదోడు వాదోడుగా ఉన్నది. అయితే ఆరు నెలలుగా నరేష్‌కు పనిలేక ఖాళీగా ఉంటున్నాడు. కుటుంబం గడువని పరిస్థితి నెలకొనడం, కుటుంబ సభ్యుల వైద్యానికి తెచ్చిన అప్పులు పేరుకుపోవడంతో అవస్థలు పడుతున్నాడు. ఈ క్రమంలో మనోవేదనతో సోమవారం రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోనే ఉరేసుకున్నాడు. తెల్లవారుజామున గమనించిన కుటుంబసభ్యులు బోరున విలపించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.