రాజన్న సిరిసిల్ల, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఉపాధి కరువై.. ఆర్థిక ఇబ్బందులు తాళలేక రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మరో నేత కార్మికుడు బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని గణేశ్నగర్కు చెందిన ఎర్రం కొమురయ్య (55) సాంచాలు నడిపేవాడు. కొమురయ్యకు భార్య కమ ల, ఇద్దరు కొడుకులు శ్రీకాంత్, సాయికిరణ్, కూతురు వరలక్ష్మి ఉన్నారు. కూతు రు, పెద్దకొడుకు పెండ్లిళ్లకు అప్పుచేశాడు. చిన్నకొడుకు పెండ్లి చేయాలనుకొని ఉన్న ఇంటి మరమ్మతులకు కలిపి మొత్తం రూ.10 లక్షల దాకా అప్పుచేశాడు. బతుకమ్మ చీరలతో నెలకు రూ.20 వేలు సంపాదిస్తూ చేసిన అప్పులు తీ ర్చాలనుకున్నాడు.
ఈ క్రమంలో చీరల ఆర్డర్లు బంద్ కావ డం, వస్త్ర పరిశ్రమ మూసేయడంతో ఉపాధి నిలిచిపోయింది. పది నెలలుగా పనుల్లేక చేసిన అప్పులు తీర్చేమార్గం లేక బుధవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకున్నాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కొమురయ్య గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన నేతన్న బీమా పథకంలో పేరు నమోదు చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.