బాసర/ఆర్మూర్‌టౌన్, నవంబర్ 11: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ రెండో సంవత్సరం చదువుతున్న స్వాతిప్రియ (18) సోమవారం హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్‌కు చెందిన రవీందర్-ఉజ్వల దంపతుల కూతురు స్వాతిప్రియ ట్రిపుల్ ఐటీలో పీయూసీ రెండో సంవత్సరం చదువుతున్నది. తోటి విద్యార్థులు టిఫిన్ చేయడానికి డైనింగ్‌హాల్‌కు వెళ్లగా హాస్టల్ గదిలో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. టిఫిన్ చేసి రూంకు వచ్చిన విద్యార్థినులకు స్వాతిప్రియ ఉరేసుకుని కపించింది. దీంతో వారు సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అధికారులు సీఐ రాకేశ్, బాసర ఎస్సై గణేశ్‌లకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కిందకి దించి అంబులెన్సులో భైంసా ఏరియా దవాఖానకు తరలించారు. స్వాతిప్రియ ఫోన్, అక్కడ లభ్యమైన సూసైడ్ లెటర్‌ను స్వాధీనం చేసుకుని స్వాతిప్రియ తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
కాగా.. యూనివర్సిటీకి చేరుకోకముందే మృతదేహాన్ని తరలించడంతో ఆగ్రహం వ్యక్తంచేసిన తల్లిదండ్రులు.. ‘మా బిడ్డను ట్రిపుల్ ఐటీ యాజమాన్యమే చంపేసింది’ అని ఆరోపించారు. సీనియర్ విద్యార్థితోపాటు మరో తోటి విద్యార్థిని కూడా తనను వేధిస్తున్నారని తమ కూతురు చెప్పిందని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఏబీవీపీ కార్యకర్తలు గేటు దూకేందుకు ప్రయత్నించగా.. ఏబీవీపీ కార్యకర్తలు, ట్రిపుల్ ఐటీ సెక్యూరిటీకి వాగ్వాదం జరిగింది. ఇందులో ఏబీవీపీ కార్యకర్తపై సెక్యూరిటీ సిబ్బంది దాడి చేయగా తలపై తీవ్ర గాయం అయింది. వెంటనే అతడిని భైంసాకు, అక్కడి నుంచి నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. భైంసా ఏఎస్పీ అవినాశ్‌కుమార్ ట్రిపుల్ ఐటీకి చేరుకుని ఏబీవీపీ కార్యకర్తలతో మాట్లాడి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 11 నెలల్లో నలుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడటంపై ట్రిపుల్ ఐటీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.