హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ)/గజ్వేల్/తొగుట: తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుసంక్షేమానికి, వ్యవసాయరంగ అభివృద్ధికి అమలు చేస్తున్న కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని వివిధ రాష్ర్టాలకు చెందిన రైతుప్రతినిధులు కొనియాడారు. కేసీఆర్ లాంటి సీఎం తమకూ ఉంటే బాగుండునని వారు ఆకాంక్షించారు. రైతుల కోసం ఆలోచించే అరుదైన నాయకుల్లో సీఎం కేసీఆర్ ఒకరని, అందువల్లే తెలంగాణలో రైతుకేంద్రంగా అభివృద్ధి జరుగుతున్నదని వారు పేర్కొన్నారు. తెలంగాణలో జరుగుతున్న వ్యవసాయ, సాగునీటి రంగ అభివృద్ధిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధ్యయనం చేసేందుకు ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక, పంజాబ్, జార్ఖండ్, ఒడిశా సహా 25 రాష్ర్టాలకు చెందిన వందమందికి పైగా రైతుసంఘాల నాయకులు, ప్రతినిధులు శుక్రవారం రాష్ర్టానికి చేరుకున్నారు. తెలంగాణ అమలు చేస్తున్న వ్యవసాయ విధానాలను స్వయంగా చూసేందుకు వారు వచ్చారు. నగరంలోని హోటల్ టూరిజం ప్లాజాలో బస చేసిన రైతుప్రతినిధుల బృందం.. మూడు రోజులపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్నది. శుక్రవారం సిద్దిపేట జిల్లాలో క్షేత్రస్థాయి పరిశీలనను వారు ప్రారంభించారు. మల్లన్నసాగర్, సింగాయపల్లిల్లో పర్యటించిన రైతు ప్రతినిధులు.. తెలంగాణలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని అభిప్రాయపడ్డారు. ఇక్కడి రైతు సంక్షేమ, వ్యవసాయ, అభివృద్ధి విధానాలను తమ రాష్ర్టాల్లోనూ అమలు చేసేలా అక్కడి ప్రభుత్వాలను డిమాండ్ చేస్తామని వారు పేర్కొన్నారు.
మల్లన్నసాగర్ లాంటి ప్రాజెక్టులు
మల్లన్నసాగర్ మానవ నిర్మిత అద్భుతమని, అలాంటి ప్రాజెక్టులు దేశానికి చాలా అవసరమని వివిధ రాష్ర్టాల రైతు ప్రతినిధులు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను సందర్శించిన వారంతా ఎంతో ఆనందానికి, ఆశ్చర్యానికి లోనయ్యారు. రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కాళేశ్వరం ఇరిగేషన్ ఈఎన్సీ హరిరామ్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టుల ఎస్ఈ వేణు మల్లన్నసాగర్ ప్రాజెక్టు గురించి వారికి క్షుణ్ణంగా వివరించారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో కేవలం మూడున్నరేండ్లలోనే మల్లన్నసాగర్ నిర్మాణం పూర్తయ్యిందని తెలిపారు. 557 మీటర్ల ఎత్తులో ఒక ప్రాజెక్టును నిర్మించడంతో, ఆ ప్రాజెక్టు ద్వారా పంటలకు సాగునీరు, గ్రామాల్లోని ప్రజలకు తాగునీటిని అందించడం చాలా గొప్ప విషయమని రైతు ప్రతినిధులు చెప్పారు. దేవెగౌడ లాంటి ఒకరిద్దరు నాయకులు మాత్రమే రైతుల గురించి ఆలోచించేవారని, తెలంగాణ సీఎం కేసీఆర్ రైతుల కోసం ఇంతటి గొప్ప ప్రాజెక్టులు నిర్మించిన ఘనత సాధించారని కర్ణాటక ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఇలాంటి సీఎం ఉంటే రైతుల జీవితాలు సంతోషంగా ఉంటాయని తమిళనాడుకు చెందిన రైతులు ఆనందాన్ని వెలిబుచ్చారు.
ఒక ఉద్యమంలా తెలంగాణకు హరితహారం అమలు చేస్తున్న తీరు అద్భుతంగా ఉన్నదని, ప్రభుత్వం చిత్తశుద్ధి ఫలితంగా ఎటుచూసినా పచ్చదనం కండ్లెదుట కనిపిస్తున్నదని ఉత్తరప్రదేశ్, పంజాబ్, కర్ణాటకతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన రైతులు ప్రశంసించారు. రాజీవ్ రహదారి వెంట అవెన్యూ ప్లాంటేషన్, ఔటర్ రింగ్‌రోడ్డుపై పచ్చదనం, సిద్దిపేట జిల్లా ములుగు, సింగాయపల్లి, కోమటిబండ ప్రాంతాల్లో క్షీణించిన అటవీ ప్రాంతాలను పునరుద్ధరించటం ద్వారా కొన్నేండ్లలోనే చికటి అడవిలా మార్చిన విధానాన్ని వారు ప్రత్యక్షంగా పరిశీలించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి, అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్, హెచ్వోవోఎఫ్) ఆర్ఎం డోబ్రియాల్ హరితహారం, అడవుల సంరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వారికి వివరించారు. హరితహారం సీఎం కేసీఆర్ మానస పుత్రిక అని, రాష్ట్రంలో 33శాతం పచ్చదనం సాధించేందుకు ఎనిమిదేండ్లలో 267 కోట్ల మొక్కల్ని నాటినట్లు తెలుసుకున్న రైతు ప్రతినిధులు ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ప్రతి రాష్ట్రంలో ఇలాంటి చర్యలు చేపడితే అడవులు పెరిగి కాలుష్యం తగ్గుతుందని, ప్రజలకు ఆరోగ్యకర వాతావరణాన్ని అందించవచ్చని వారు చెప్పారు.
గుజరాత్ కన్నా తెలంగాణలో రైతు సంక్షేమం బాగున్నది. మా రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణాలు సక్రమంగా లేవు. ఇక్కడ కేవలం మూడున్నరేండ్ల లోనే ప్రాజెక్టులు కడుతున్నారంటే.. ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఎటుచూసినా పచ్చని పంట పొలాలే కనిపిస్తున్నాయి. అంతటా సస్యశ్యామల వాతావరణం ఉన్నది. తెలంగాణ తరహాలో రైతు సంక్షేమానికి దేశమంతా పాలకులు కృషి చేయాలి.
– పర్చీన్ చాలా (గుజరాత్-కిసాన్ అధికార్ మంచ్)
తెలంగాణ దేశానికి దారిచూపుతున్నది. వ్యవసాయ రంగంలో కొత్త ఒరవడిని సృష్టించింది. తెలంగాణలో కొత్తగా అనేక సాగునీటి ప్రాజెక్టులను నిర్మించారు. ఇంటింటికి తాగునీళ్లు ఇస్తున్నారు. అడవులను బాగా అభివృద్ధి చేశారు. నాటిన ప్రతి మొక్కనూ కాపాడుతున్నారు. క్షేత్రస్థాయిలో తెలంగాణలో ఏం జరుగుతున్నదో తెలుసుకోవాలన్న ఉత్సాహంతో వచ్చాం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వ్యక్తిగతంగా కలిసి మా సంతోషాన్ని తెలియజేయాలని ఉన్నది.
– బీరేంద్రకర్ (ఒడిశా)
కేంద్రం తెచ్చిన నల్లచట్టాలకు వ్యతిరేకంగా మా రాష్ట్ర రైతులు పోరాటం చేశారు. అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. ఆ రైతు కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వచ్చి మూడు లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. మా రైతు కుటుంబాలను ఆదుకున్న గొప్ప మనసు ఆయనది. తెలంగాణ అనుసరిస్తున్న విధానాలు తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. తెలంగాణ దేశంలోనే ఆదర్శవంతమైన రైతు విధానాలను అవలంబిస్తున్న రాష్ట్రం.
-మన్జీత్సింగ్ ఘరేవాల్ (పంజాబ్)
దేశంలో ఎక్కడాలేనివిధంగా ఏడాదికి ఎకరానికి పదివేల చొప్పున రైతుబంధు సహాయం అందించడం అద్భుతం. దీంతో రైతుల్లో భరోసా పెరుగుతుంది. వ్యవసాయం గిట్టుబాటు అవుతుంది. కేంద్రం ఈ తరహా పథకాన్ని పెట్టినప్పటికీ, అనేక ప్రతిబంధకాలున్నాయి. తెలంగాణాలో అలా లేదు. భూమి ఉన్న ప్రతి రైతుకు రైతుబంధు ఇస్తున్నారు. ఏ కారణంతోనైనా రైతు మరణిస్తే.. ఆ కుటుంబానికి ఐదు లక్షల బీమాను అందజేస్తున్నారు. రైతుల కోసం కేసీఆర్‌లా ఆలోచించే వ్యక్తులు లేరు. అసలు చాలామంది ముఖ్యమంత్రులకు రైతులంటేనే చిన్నచూపు. తెలంగాణ అసలు సిసలైన రైతురాజ్యం.
– హిమాంశ్ సోనూపాల్ చౌహాన్ (ఉత్తరప్రదేశ్)
తెలంగాణ రైతులు మూడుపంటలు పండిస్తున్నారు. ఇది మంచి పరిణామం. కేంద్ర ప్రభుత్వ విధానాలు రైతులను ముంచేలా ఉన్నాయి. రైతుల సమస్యలను పరిష్కరించే నాయకులు కరువయ్యారు. ఈ దశలో దేశానికి కేసీఆర్ వంటి నాయకుడు అవసరముంది. ఇలాంటి ముఖ్యమంత్రి మరింత మంది దేశానికి అవసరం. రైతుపక్షపాత ప్రభుత్వాలు అధికారంలోకి రావాలి. కేసీఆర్ రైతు బాంధవుడు.
– అయ్యన్నన్, వేణుగోపాలచారి (తమిళనాడు)
రైతుల కోసం నిర్మించిన ప్రాజెక్టును చూడటానికి ఇక్కడికి వచ్చాం. సీఎం కేసీఆర్‌ను మిగతా సీఎంలు స్ఫూర్తిగా తీసుకోవాలి. కేవలం మూడున్నరేండ్లలో మల్లన్నసాగర్ లాంటి పెద్ద ప్రాజెక్టును నిర్మించడం, 200 కిలోమీటర్ల దూరం నుంచి నీళ్లను తీసుకువచ్చి, 100 మీటర్ల లోతు నుంచి పంప్‌ల ద్వారా బయటకు పంపించడం చాలా అద్భుతమైన సాంకేతికత. సీఎం కేసీఆర్ రైతుల కోసం చేస్తున్న కృషి మరిచిపోలేనిది.
– మంజూర్సింగ్ అగర్వాల్ (భారతీయ కిసాన్ యూనియన్ పంజాబ్-హిమాచల్ ప్రదేశ్ ఇన్చార్జ్)